
ప్రతీకాత్మక చిత్రం
గౌరవమా? గారడీయా? విగ్రహాల ఏర్పాటు వెనకున్న రాజకీయం ఏమిటీ?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విగ్రహాలు, సెంటర్ల పేర్లు హల్ చల్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విగ్రహాలు, సెంటర్ల పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రమంతటా లెక్కకు మిక్కిలి విగ్రహాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రెండు ప్రాజెక్టులు- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రుషీకొండ ప్రాజెక్టులు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా 600 అడుగుల ఎత్తున ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు తెరపైకి వచ్చింది. రాష్ట్రం ఇప్పటికీ ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతోందని పాలకులే చెబుతున్నారు. రోడ్లు వేయడానికే నిధులు లేవంటూ ఇంతింత ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టాల్సిన పని ఉందా అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ విగ్రహాల నిర్మాణం ఒక పోటీగా మారిపోయింది. నాయకుల గౌరవార్ధం ప్రారంభమైన విగ్రహాల ఏర్పాటు ఇప్పుడు ప్రతిష్ఠల పోరుగా మారింది. మహానాయకుల విగ్రహాల వెనుక ఉన్న రాజకీయం, ఖర్చు, వాటి వల్ల వనగూడే ప్రజా ప్రయోజనాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
అమరావతిలోని నీరుకొండపై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహ బేస్‌లో ఎన్టీఆర్ జీవితం, కళాకృతులు, మినీ థియేటర్ ఉంటాయి. డీపీఆర్ తయారీకి కన్సల్‌టెంట్ కోసం టెండర్లు ఆహ్వానించారు. మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి ఇటీవల గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించి వచ్చారు. నీరుకొండ ఎత్తు 300 అడుగులు ఉంటుంది. దీని మీద 100 అడుగుల ఎత్తులో బేస్‌ను నిర్మిస్తారు. ఈ బేస్‌లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాల్, ఎన్టీఆర్ మ్యూజియం, ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుసుకునేలా కళాఖండాలు, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉంటాయి. ఈ బేస్ పైన 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
2023లో విజయవాడలో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం దేశంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా నిలిచింది. ఇది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రాత్మక ప్రాధాన్యతను ప్రతిబింబించడమే కాకుండా ముఖ్యంగా దళిత వర్గాలకు రాజకీయ సందేశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంగా ఏర్పాటు చేసినట్టు ఆనాటి ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, అదే సమయంలో ఇది విపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంది. రాష్ట్రమంతా అప్పుల ఊబిలో ఉండగా, మౌలిక వసతులకు నిధుల్లేవంటూ మాట్లాడే ప్రభుత్వం, విగ్రహ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాన్ని ప్రజాసంఘాలు ప్రశ్నించాయి.
ఇప్పుడు టీడీపీ నేతలుఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవానికి నిలువెత్తు చిహ్నం అని చెబుతూ అమరావతి సహా తిరుపతి, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో విగ్రహాల నిర్మాణం గురించి చర్చ సాగుతోంది. ఇంత భారీ స్థాయిలో కాకపోయినా ఇప్పటికే ఎన్టీఆర్ విగ్రహాలు రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకం ఉన్నాయి.
ఇది ఒక గౌరవప్రద ఆలోచన అని అనిపించినా, సమకాలీన ఆర్థిక పరిస్థితులను చూసి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సామాజిక విశ్లేషకుడు ఎస్వీ రావు వ్యాఖ్యలో అర్థం లేకపోలేదు. రాష్ట్రం అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయి. రోడ్లు, పాఠశాలలు, హాస్పిటల్స్ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో విగ్రహాలకు పెద్దఎత్తున ఖర్చు ఎందుకు? అనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం విశాఖపట్నం రుషీకొండ ప్యాలెస్ ను నిర్మించినపుడు జగన్ కు వ్యతిరేకంగా మీడియా, విపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి.
“500 కోట్లతో గెస్ట్ హౌస్ ఏంటి? ప్రజలకు నీళ్లు, రోడ్లు లేకుంటే ఇది అవసరమా?” అనే ప్రశ్నల వర్షం కురిపించాయి.
ఇప్పుడు మాత్రం, అదే విధంగా మరో 500 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా ప్రజల అవసరాల కన్నా వారి నాయకుల గుర్తింపుల కోసం విగ్రహాల నిర్మాణాలు జరుగుతున్నాయనేది స్పష్టమవుతోంది. వైసీపీ అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే, టీడీపీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిగా నిలబెట్టాలనుకుంటోంది. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే వారు శ్యామప్రసాద్ ముఖర్జీ లేదా పటేల్ విగ్రహాల పేరుతో కొత్త ప్రతిష్ఠలు పెట్టే అవకాశం లేకపోలేదనే గ్యారంటీ ఏమైనా ఉందా?
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డా. గోపాలకృష్ణ వ్యాఖ్యానించినట్లు- “ప్రతీ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్మాణాన్ని వాడకుండా, తమదైన ప్రతీకలు నిర్మించే ధోరణి, ప్రజాధనాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుతున్న దారుణ ఉదాహరణ.”
వర్షాకాలంలో వీధుల్లో కొట్టుకుపోతున్న రోడ్లు, 6 నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, దళిత ఉపాధి హామీ పథకాలు నిలిచిపోవడం వంటి సమస్యలు నిత్యం మీడియాలో వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విగ్రహాలకు లక్షల చదరపు అడుగుల్లో స్థలాలు, కోట్ల రూపాయల వ్యయం, ప్రత్యేక కమిటీలతో పనులు – ఇది సామాన్యుడికి అసహ్యం కలిగించే పరిస్థితి.
ఎన్టీఆర్ వంటి నాయకుల జీవితాలను, సేవలను స్మరించుకోవడం తప్పు కాదు. కానీ వారిని గుర్తించాలంటే విగ్రహాలనే మార్గంగా తీసుకోవాలన్న తీరు తప్పనిసరిగా మార్చుకోవాలి. ప్రజల అవసరాలను తీర్చడమే వారి ఆశయాలకు నిజమైన నివాళి అవుతుంది.
సామాజిక ఉద్యమ కార్యకర్త అనితా రాజ్ మాట్లాడుతూ, “అంబేడ్కర్ విగ్రహం ఎత్తుగా ఉండటం కన్నా, ఆయన సిద్ధాంతాల ప్రకారం దళితులకు విద్యను, ఉపాధిని బలపరచడమే ముఖ్యమవుతుంది. అదే ఎన్టీఆర్ విషయంలోనూ వర్తిస్తుంది.”
విగ్రహాలు ఎందుకు పెడతారు?
నాయకుల సామూహిక గుర్తింపును ప్రజల్లో బలపరచేందుకు విగ్రహాలు ఒక దృశ్య చిహ్నంగా ఉపయోగపడతాయి. నాయకులు చేసిన త్యాగాలు నిత్యం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. ఆ కోవలోనే స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఆనాడు ఊరూరా ఏర్పాటు అయ్యాయి. కాలక్రమంలో అసలు ఉద్దేశం మరుగున పడి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా మారింది. ప్రత్యేకంగా జాతి, కుల, ప్రాంతీయ గుర్తింపుల ప్రాతిపదికన విగ్రహాల ఏర్పాటు కావడం మొదలైంది. రాజకీయ నాయకుల లెక్కలో విగ్రహాలు భావోద్వేగ పద్ధతిలో ఓటర్లను ప్రభావితం చేయగలవు అని భావించే స్థితి వచ్చింది.
ఫలితంగా పోటాపోటీ విగ్రహాలు ఏర్పాటు కావడం మొదలుపెట్టారు. ఒక నాయకుడి విగ్రహానికి ప్రతిగా మరో నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాజకీయాల నైతిక తలంపుగా మారింది.
ప్రజలకు దీనివల్ల ఉపయోగమేమిటి?
విగ్రహాలు చరిత్రను గుర్తు చేస్తాయి. అయితే, వాటితోపాటు వచ్చే ఖర్చు, నిధుల మళ్లింపులు, ప్రజా అవసరాల నేపథ్యంలో వాటి ప్రాధాన్యతను ప్రశ్నించాల్సిందే. గ్రామాల్లో తాగునీరు లేదు. జిల్లాల్లో మెడికల్ స్టాఫ్ పోటీలకు నోటిఫికేషన్లు రావడం లేదు. కానీ గగనాన్ని చుంబించే విగ్రహాల కోసం వందల కోట్లు వెచ్చించడం ప్రజా సంక్షేమానికి ఏం మేలు? అనేది చర్చనీయాంశం.
మౌలిక వసతుల కోసం పోరాడే సమయం
విగ్రహాలు చరిత్రను చెబుతాయి కానీ ప్రజల ఆకలి తీర్చవు. విద్యను ఇవ్వవు. ఉపాధి కల్పించవు. వాటి చుట్టూ ఉన్న రాజకీయం కంటే, వాటి కోసం వాడుతున్న నిధులను ప్రజల జీవితాలను మెరుగుపరిచే కార్యక్రమాలకు వెచ్చిస్తే, అదే నాయకుడి తలంపులకు నిజమైన నివాళి అవుతుంది. నాయకుల విగ్రహాల కంటే, వారి విధానాల ఆచరణకే ప్రజలు పట్టం కట్టాలి. లౌకికత, సమానత్వం, ప్రజాస్వామ్యం అనే విలువలకు విగ్రహాలు కాదు – ప్రభుత్వ చర్యలే అద్దం పడాలి.
గుర్తింపు కంటే సేవ మిన్న
ఒక్క విగ్రహం మీద వెయ్యి కోట్లు వెచ్చించామనే గర్వం కంటే, అదే నిధులతో వందల పాఠశాలల్లో మరమ్మతులు చేయడం, ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భర్తీ చేయడం... ఇవే ప్రజా నాయకత్వానికి ప్రతీకలు కావాలి. విగ్రహాల హడావిడికి ముగింపు పలకకపోతే, ప్రజల నమ్మకం కూడా విగ్రహాల్లానే మౌనంగా నిలిచిపోతుంది.
Next Story