
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్
గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం: ఈసారి కర్ణాటక అసెంబ్లీలో..
కన్నడ అసెంబ్లీలో రెండు లైన్లు చదివి ప్రసంగాన్ని ముగించిన గవర్నర్
దక్షిణాది రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే, గవర్నర్ల మధ్య వివాదం ప్రారంభం అయిన తరువాత కేరళ అసెంబ్లీలోనూ ఇదే తరహ వాతావరణం నెలకొంది. తాజాగా నేడు ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీలోనూ ఇదే సీన్ పునరావృతం అయింది.
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాద్ గురువారం బెంగళూర్ లో జరిగిన రాష్ట్ర శాసనసభ సంయుక్త సమావేశంలో తన సంప్రదాయ ప్రసంగాన్ని కేవలం రెండు లైన్లు చదివి ముగించడంతో వివాదం ప్రారంభం అయింది.
సభ ప్రారంభంలో అందరిని పలకరించిన ఆయన ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర ఆర్థిక, సామాజిక, భౌతిక అభివృద్ధిని రెట్టింపు చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జైహింద్, జై కర్ణాటక’’ అని తన ప్రసంగాన్ని హిందీలో ముగించారు.
నిరసన తెలుపుతాం..
గవర్నర్ తన ప్రసంగాన్ని కుదించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో సిగ్గు సిగ్గు అంటూ అధికార కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ పరిణామం తరువాత సీఎం సిద్ధరామయ్య విధాన సౌధ వెలుపల మీడియాతో మాట్లాడారు.
‘‘గవర్నర్ సంయుక్త సమావేశంలో ప్రసంగించి, కేబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని చదవాలి. ఇది రాజ్యాంగబద్దం. నేడు కేబినెట్ తయారుచేసిన ప్రసంగాన్ని చదవడానికి బదులుగా ఆయన స్వయంగా తయారు చేసిన ప్రసంగాన్ని చదివారు.
ఇది రాజ్యాంగ ప్రసంగాన్ని చదవడానికి బదులుగా ఆయన స్వయంగా తయారు చేసిన ప్రసంగాన్ని చదివారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం. గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేయబోతున్నాం’’ అని అన్నారు.
ప్రతిష్టంభన..
లోక్ భవన్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన తరువాత కొద్దిసేపు ప్రదర్శన జరిగింది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వ ఘర్షణల శ్రేణిలో ఇది తాజాది.
సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర సచివాలయం వద్ద గవర్నర్ ను సీఎం, శాసన సభ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్, మంత్రులు స్వాగతం పలికారు.
నిరాకరణ... రాక..
బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగం ఉండదని లోక్ భవన్ తెలిపింది. ప్రభుత్వ విధానాలను వివరించే సంప్రదాయ ప్రసంగం ఎలా అనే దానిపై ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ తరువాత ఆయన సమావేశాలకు హజరవుతా అని స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ పై వివాదం..
ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో మొత్తం 11 పేరాలు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ విధానాలను కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. వీటిని తొలగించాలని గవర్నర్ కోరుకున్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమంగా గవర్నర్ భావించారు.
లోక్ భవన్- విధానసౌధ వివాదం నేపథ్యంలో సాయంత్రం మంత్రి పాటిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గెహ్లాట్ ను కలిసింది. ఇందులో అడ్వకేట్ జనరల్ కే శశికిరణ్ శెట్టి, ముఖ్యమంత్రి న్యాయ సలహదారు ఎఎస్ పొన్న ఉన్నారు.
దక్షిణాదిలోని బీజేపీయేతర రాష్ట్రాలలో ఇది మూడో గవర్నర్- ప్రభుత్వ ఘర్షణ. మంగళవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి సభలో ప్రసంగం చేయకుండానే వెళ్లిపోయారు. జాతీయ గీతాన్ని అవమానపరిచారని లోక్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం తనచేత అబద్దాలు చదివిస్తుందని కూడా పేర్కొన్నారు.
కేరళలో ముఖ్యమంత్రి పినరయీ విజయన్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగంలో చేసిన మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి మండలి ఆమోదించిన సంస్కరణలను మాత్రమే ప్రసంగం ప్రతిబింబిచాలని అన్నారు.
పదకొండో పేరాలో ఏం ఉంది?
మంత్రిమండలి ఆమోదించిన ప్రసంగంలో వీబీ రామ్ జీ పథకం విమర్శలు ఉన్నాయి. దీనిని ప్రసంగంలోని పదకొండో పేరాలో చేర్చారు. గవర్నర్ ఈ ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భాగాన్ని చదవకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదని సీఎం పట్టుబట్టారు. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 ప్రకారం.. గవర్నర్ సమావేశానికి హజరుకావడం తప్పనిసరి. ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ప్రసంగంలోని భాగాలపై అభ్యంతరం చెప్పే హక్కు ఉంది. ఈ ప్రకరణ ప్రకారం తమిళనాడు, కేరళ అసెంబ్లీలో గవర్నర్లు ప్రభుత్వం రాసిచ్చిన వాటిని చదవడానికి నిరాకరించారు. తాజాగా కర్ణాటకలోనూ ఇదే జరిగింది.
న్యాయపోరాటం..
ప్రస్తుత సమావేశంలో గవర్నర్ ప్రసంగంలోని కీలక భాగాలను చదవకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం అవసరమైన సన్నాహాలు చేయమని అడ్వకేట్ జనరల్ ను సూచించింది. గవర్నర్ ఈ రోజు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయని భావిస్తున్నారు.
రాజ్యాంగ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అడ్వకేట్ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారు.
Next Story

