‘కులగణన’ఇప్పుడిప్పుడే బయటకు రాదా? సీఎం సిద్దరామయ్య మదిలో ఏముంది?
x
కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

‘కులగణన’ఇప్పుడిప్పుడే బయటకు రాదా? సీఎం సిద్దరామయ్య మదిలో ఏముంది?

‘కులగణన’ ఈ పదం కర్నాటక రాజకీయ పార్టీల్లో, ఆధిపత్య వర్గాల్ల నోళ్లల్లో బాగా నానుతోంది. తాజాగా ఈ నివేదిక గురువారం సీఎం సిద్దరామయ్యకు చేరింది.


కర్నాటక వెనకబడిన కులాల కమిషన్ చెందిన జయప్రకాశ్ హెగ్దే దీనిని ప్రభుత్వానికి సమర్పించారు.అయితే దీనిలోని వివరాలు ఏవి అధికారికంగా బయటకు తెలియకపోయినా, అప్పుడే రాజకీయ ప్రకంపనలు రావడం ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్కలిగ, లింగాయత్ నేతలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కులగణన వివరాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు బయటకు వస్తే కర్నాటకలో రాజకీయ సునామీ వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న సీఎం సిద్ద రామయ్య.. నివేదిక అందుకున్న తరువాత ఒక ప్రకటన చేశారు.
"సామాజిక, ఆర్థిక విద్యా సర్వే లో వివరాలు, సిఫార్సులు ఏమి ఉన్నాయో నాకు తెలియదు. వీటిని మంత్రి వర్గం ముందు చర్చకు పెడతాను. అక్కడే చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అని ప్రకటించారు. ప్రభుత్వంలోని ఉన్నత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఇందులోని వివరాలు బయటకు వస్తాయి. అంటే ఇదీ జరగడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటి దాకా కులగణన నివేదికలో ఏముందో బయటపడే అవకాశం లేదు.
కులాల భయాలు
కులగణనగా అందరూ పిలుచుకుంటున్న, దీనిని కర్నాటక నాట ఆధిపత్య వర్గాలుగా పిలుస్తున్న ఒక్కలిగ, లింగాయత్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో ఓబీసీలు, దళిత వర్గాలు దీనిని విడుదల చేయాల్సిందే అని పట్టుబడుతున్నాయి. కన్నడ సమాజం రెండు చీలిందని దీన్నిబట్టి అర్థమవుతోంది.
ఈ సమయంలో ఈ నివేదిక బయటకు వస్తే ఏం జరుగుతుందో అని ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. కర్నాటక సీఎం కార్యాలయం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి.. ఆ తరువాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని బయటపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే
ఇదే విషయంపై సిద్ద రామయ్యకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ మంత్రి ఫెడరల్ తో మాట్లాడుతూ " ఈ కులగణన అంశంపై ఒక్కలిగ, లింగాయత్ నాయకులు, మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ నివేదిక వారికి వ్యతిరేకంగా ఉంటే ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడుతుంది. అందులోని కొన్ని వర్గాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చాయి.
ఇప్పుడు గనక నివేదిక బయటకు వస్తే కచ్చితంగా వారి మద్దతు కోల్పోతామనే ఆందోళన ఉంది " అని వివరించారు. ఇప్పడును పరిస్థితుల్లో దీనిని అమలు చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది, అయితే దాని సభ్యుల కూర్పు, చాలా క్లిష్టమైన విషయం.
ఈ సబ్ కమిటీ దీనిని అధ్యయనం చేయడానికి కావాల్సినంత సమయం తీసుకుంటుంది. కులగణన నివేదిక ను అమలు చేయడానికి అనేక చిక్కుముడులు ఉన్నాయని అంటూ ఆయన తన మాటలను పొడిగించారు. " లోక్ సభ ఎన్నికల ముందు మాత్రం ఇది ఆమోదించబడదు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో మాత్రమే ఇది అసెంబ్లీ దృష్టికి వచ్చే అవకాశం ఉంది" అని సదరు మంత్రి వెల్లడించారు.
కులగణన నివేదిక పై హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో పాటు కొన్ని అనుమానాలు సైతం వ్యక్త మవుతున్నాయి. నిజానికి ఈ సర్వేలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించారా అనే సందేహాలు వ్యక్తం అవతున్నాయి. ఈ నివేదిక లోని కొన్ని అంశాల ప్రకారం కేవలం 5.98 కోట్ల మందిని మాత్రమే సర్వే చేసినట్లు చెబుతున్నారు. కర్నాటక ప్రజల జనాభా ఎంత అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. వీటన్నింటికి ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందో చూడాలి
కులగణన పై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది. హిందీ బెల్ట్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇదే అంశాన్ని లేవనెత్తి ఘోరంగా ఓటమిపాలైంది. అందువల్ల కర్నాటకలో ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గమని సీఎం సిద్దరామయ్యకు సూచించారని తెలుస్తోంది. ఈ వివరాలు బయటకు వస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారతాయని చెప్పిన నేపథ్యంలో కర్నాటక కులగణన నివేదిక ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.
నిష్పక్షపాతంగా తయారు చేశాం: జయప్రకాశ్ హెగ్దే
అయితే నివేదిను నిష్పక్షపాతంగా ఉంటుందని జయప్రకాశ్ హెగ్దే చెబుతున్నారు. " కాంతారాజ్ కమిటీ ప్రకారం నివేదిక తయారు చేయబడింది. ఇది శాస్త్రీయమైంది. పక్షపాతం లేనిది" అని వివరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో దళితుల జనాభా ఎక్కువగా ఉందని సమాచారం.
దళిత జనాభా
కర్నాటకలో అత్యధికంగా ముస్లింలు, లింగాయత్, ఒక్కలిగ, దళితులు ఉన్నారు. దళిత సంఘంలో దాదాపు 3.96 కోట్ల మంది ఉండగా, లింగాయత్ , ఒక్కలిగ, బ్రాహ్మణులు ఇతరులు కలిపి 1.87 కోట్ల మంది ఉన్నారు.
నివేదికలో కొత్తగా 192 కులాలను నమోదు చేశారు. 816 ఇతర కులాలను గుర్తించారు. ముఖ్యంగా పదివేల కంటే తక్కువ జనాభా ఉన్న 80 కులాలు, చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న 30 కులాలను నివేదిక లో గుర్తించారు. 2013 లోనే సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక, విద్యా, ఆర్థిక సర్వే చేయమని ఆదేశించింది.
కాంతారాజ్ నివేదిక
2015 లో అప్పటి వెనకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హెచ్. కాంతరాజ్ ను సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జేడీఎస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలోని వెనకబడిన తరగతుల కమిషన్ కు చైర్మన్ ను నియమించలేదు. తరువాత యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జయప్రకాశ్ హెగ్దే చైర్మన్ గా నియమించారు. అయితే 2021 ఆగష్టులో కమిషన్ జనాభా గణన నివేదిక కోసం వెతికినప్పుడు ఆ రిపోర్టు కనిపించలేదు. ప్రస్తుతం కాంతారాజ్ కమిటి అప్పుడెప్పుడో తయారు చేసిన సమాచారం ఆధారంగా ఇప్పుడు నివేదిను సిద్దం చేయడంతో కర్నాటకలో రాజకీయం కాక రేగుతోంది.


Read More
Next Story