
డీలిమిటేషన్ జరగడానికి ముందే పిల్లలను కనండి: తమిళనాడు సీఎం
ముందు రాహుల్ గాంధీని ప్రశ్నించాలని కౌంటర్ ఇచ్చిన బీజేపీ
కేంద్ర ప్రభుత్వం లోక్ సభ స్థానాల డీ లిమిటేషన్ కసరత్తు ప్రారంభించడానికి ముందే తమిళనాడులో ఉన్న కొత్త జంటలు తమ ఫ్యామిలి కోసం ప్రణాళిక తీసుకుని పిల్లలను కనాలని సీఎం స్టాలిన్ కోరారు.
నాగపట్టణం జిల్లా డీఎంకే పార్టీ సెక్రటరీ కి చెందిన ఓ వివాహ వేడుకకు హజరైన సీఎం, కేంద్రం ప్రభుత్వం పై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. కొత్తగా పెళ్లయిన జంటలు పిల్లల కనడం గురించి ప్రణాళిలు వేసుకోవాలని అన్నారు.
అది కూడా డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ముందే జరగాలని సూచించారు. ‘‘మేము చాలా కాలంగా కుటుంబ నియంత్రణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశాం. కానీ అది మాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది’’ అన్నారు. అందుకోసం కొత్తగా పెళ్లయిన జంటలను పిల్లలను కనాలని వేడుకుంటున్నామని సూచించారు.
బీజేపీ కూడా సమావేశానికి రావాలనుకుంటోంది..
దక్షిణాది రాష్ట్రాల మెడపై ఇప్పుడు కత్తి వేలాడుతోందని సీఎం అన్నారు. డీ లిమిటేషన్ చేయడంతో ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గిపోతాయని, తద్వారా తమ గొంతును పార్లమెంట్ లో బలంగా వినిపించే అవకాశం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘కేంద్రం ఇప్పటికే నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీలో భాగంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తుంది. తరువాత డీ లిమిటేషన్ అనే ఇంకో ఆపద రాబోతోంది. దీనిపై చర్చించడానికి తాము ఆల్ పార్టీ మీటింగ్ కు పిలుపునిచ్చాం’’ అని చెప్పారు. అయితే బీజేపీ ఈ మీటింగ్ ను బహిష్కరించలేదని ఆయన గుర్తు చేశారు.
‘‘కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను అమలు చేయాలనుకుంటోంది. తద్వారా తమిళనాడులో లోక్ సభ సీట్లను తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి. దీనిపై నేను అన్ని పార్టీలతో చర్చించడానికి మార్చి 5న సమావేశం నిర్వహించబోతున్నాం.
దాదాపు 40 పార్టీలు ఇందులో హజరవబోతున్నాయి. ఇందులో చాలామంది హజరవుతామని, మీ నిర్ణయమే మా నిర్ణయం అన్నారు. కొన్ని పార్టీలు మాత్రమే తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇది కేవలం డీఎంకే ప్రాబ్లమ్ మాత్రమే కాదు. ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించినది. కాబట్టి నేను అందరిని రాష్ట్రానికి అండగా నిలబడాలని అభ్యర్థిస్తున్నాను’’ అని స్టాలిన్ అన్నారు.
తమిళనాడు సమర్థవంతంగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఇప్పుడు శాపంగా మారిందన్నారు. ‘‘ డీలిమిటేషన్ కు జనాభానే ప్రామాణికంగా అమలు చేస్తే తమిళనాడు ఎనిమిది ఎంపీ సీట్లను కోల్పోతుంది. తద్వారా రాష్ట్రం తన ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ లో కోల్పోతుంది’’ అని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎదురుదాడికి దిగిన బీజేపీ
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. డీఎంకే చేస్తున్నవి డైవర్సిటీ డ్రామాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి కేశవన్ విమర్శలు గుప్పించారు.
‘‘డీఎంకే చేస్తున్నవి నిజాయితీ లేనీ డైవర్షన్ పాలిటిక్స్. వారికి దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రశ్నించాలి. ఎందుకంటే ఆయన జిత్నీ ఆబాదీ, ఉత్న హక్ ( ఎంత జనాభాకి అంతే హక్కులు) అని నినాదాలు చేస్తున్నారు, కాబట్టి ముందుగా రాహుల్ గాంధీని ప్రశ్నించి తరువాత వారి రాజకీయాలు చేయాలి’’ అని చురకలు అంటించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Next Story