హైకమాండ్, సిద్ధరామయ్య అంగీకరిస్తే సీఎంను అవుతా..
x
RV Deshpande

హైకమాండ్, సిద్ధరామయ్య అంగీకరిస్తే సీఎంను అవుతా..

కర్ణాటకలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్వీ దేశ్‌పాండే మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్, సిద్ధరామయ్య అంగీకరిస్తే..సీఎం కావాలన్న కోరిక ఉందని అన్నారు.


కర్ణాటకలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్వీ దేశ్‌పాండే తన మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరిస్తే..సీఎం కావాలన్న కోరిక ఉందని మైసూరులో విలేఖరులతో అన్నారు. ముడా కుంభకోణం సీఎం సిద్ధరామయ్యను వెంటాడుతున్న తరుణంలో దేశ్ పాండే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ్‌పాండే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

నాయకత్వ మార్పు ఉండదు

సిద్ధరామయ్య పూర్తి ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగుతారనే చెబుతూనే. ‘‘నేను సీఎం కంటే రెండేళ్లు పెద్ద. ఒకవేళ హైకమాండ్ నన్ను సీఎంగా అనుమతించినా.. సిద్ధరామయ్య కూడా అందుకు ఆమోదం తెలపాలి.ఎందుకంటే నేను సిద్ధరామయ్య మంచి స్నేహితులం’’అని చెప్పారు.

మంత్రులు డాక్టర్ జి పరమేశ్వర, సతీష్ జార్కిహోళీ సమావేశం కావడంపై కూడా మాట్లాడారు. వారిద్దరూ శాఖాపర సమస్యలపై చర్చించేందుకే మాత్రమే సమావేశమయ్యారని, అంతకుమించి ఏ విశేషమూ లేదని స్పష్టతనిచ్చారు.

ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య పాత్ర ఏమీ లేదని దేశ్‌పాండే పునరుద్ఘాటించారు. ఆరోపణలు చేస్తున్న వారి వద్ద సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు దివంగత రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి పదవికి ఎలా రాజీనామా చేశారో గుర్తుచేస్తూ.. “ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు గతానికి సంబంధించినవి” అని దేశ్‌పాండే అన్నారు.

గవర్నర్ కేంద్రం చెప్పినట్లు నడుచుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. గవర్నర్ వైఖరికి నిరసనగా కర్ణాటకలోని కాంగ్రెస్ యూనిట్ శనివారం (ఆగస్టు 31) రాజ్ భవన్ చలో మార్చ్‌ కూడా నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే రామయ్య ఆరోపించారు. గెహ్లాట్ తనపై వివక్ష చూపారని కూడా విమర్శించారు.

ముడా కుంభకోణం..

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష భాజపా, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ అనుమతి మంజూరుచేయడాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని గతంలో సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీల మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్‌ గహ్లోత్‌ కొమ్ముకాస్తున్నారని సీఎం సిద్ధరామయ్య నిందించారు.

Read More
Next Story