
కర్ణాటక హైకోర్టు
ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ ఉత్తర్వులు నిలిపివేసిన హైకోర్టు
తదుపరి విచారణ వచ్చే నెల 17 కు వాయిదా వేసిన ధార్వాడ్ హైకోర్టు బెంచ్
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ విషయంలో పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించే ముందు ప్రయివేట్ సంస్థలు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధార్వాడ్ బెంచ్ నిలిపివేసింది.
ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ నాగ ప్రసన్నతో కూడిన సింగిల్ బెంచ్ జడ్జీ స్టే విధిస్తూ, తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వును ఇచ్చినట్లు చాలామంది రాజకీయా పరిశీలకులు భావించారు. ఇప్పుడు హైకోర్టు బెంచ్ దీనిపై మధ్యంతర స్టే విధించింది.
హక్కుల ఉల్లంఘన..
ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పునశ్చైతన్య సేవా సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఉత్తర్వూ ప్రకారం.. ప్రైవేట్ సంస్థల చట్టబద్దమైన కార్యకలాపాలను నిర్వహించే హక్కులను ఉల్లంఘిస్తుందని వాదించింది. ప్రస్తుతం కోర్టు నిలిపివేసిన ప్రభుత్వ ఉత్తర్వు ఈ నెల ప్రారంభంలో జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తుల వినియోగానికి సంబంధించిన వివరణాత్మక నియమాలను వివరించింది. సంబంధిత విభాగ అధిపతుల నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల మైదానాలు లేదా ఇతర సంస్థాగత ప్రదేశాలలో ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రయివేట్ లేదా సామాజిక సంస్థలపై నిషేధం విధించింది.
కర్ణాటక భూ రెవెన్యూ, విద్యా చట్టాల ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా పరిపాలకులకు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
రెండో సారి ఉత్తర్వు ..
ప్రభుత్వ ఆస్తుల వినియోగాన్ని నియంత్రించడానికి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విస్తృత చర్యలో భాగంగా తిరిగి జారీ చేయబడిన ఆదేశం ఇది. అక్టోబర్ 18న కర్ణాటక ప్రభుత్వం పాఠశాల మైదానాలను ప్రయివేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని నిషేధిస్తూ 2013 లో జారీ చేసిన ఉత్తర్వును తిరిగి జారీ చేసింది.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనే అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక సమాచార సాంకేతిక పరిజ్ఞానం, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన తరువాత ఈ ఉత్తర్వును జారీ చేశారు.
అక్టోబర్ 18, 2025 నాటి ఉత్తర్వూ ప్రభుత్వ ఆస్తులు, ప్రాంగణాలు, ఆట స్థలాలు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, రక్షణ, సరైన వినియోగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. అంతకుముందు కర్ణాటక పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి హెచ్ కే పాటిల్ ప్రభుత్వ నిర్ణయం ఏ నిర్ధిష్ట సమూహాన్ని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు.
‘‘ఇది ఏ ప్రత్యేక సంస్థ గురించి కాదు. ప్రభుత్వ లేదా సంస్థాగత ఆస్తులను తగిన అనుమతితో, చట్టబద్దమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించవచ్చు, ఏదైనా ఉల్లంఘనపై ప్రస్తుత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటారు’’ అని ఆయన అన్నారు.
Next Story

