చచ్చిపోయిన కరుణా నిధి మళ్లీ ఎలా లేచాడు, ఎలా మాట్లాడాడు?
x

చచ్చిపోయిన కరుణా నిధి మళ్లీ ఎలా లేచాడు, ఎలా మాట్లాడాడు?

ఎప్పుడో 2018లో కన్నుమూసిన కరుణానిధి ఇప్పుడెలా వచ్చా ఎలా వచ్చారనేగా మీ అనుమానం. ఆయన వచ్చింది నిజం, చేతులు కదిలిస్తూ కుర్చీలో కూర్చొన్నది నిజం. మాట్లాడింది నిజం.


2024 సెప్టెంబర్ 17. చెన్నై.. నందనం.. వైఎంసీఏ గ్రౌండ్స్.. సువిశాల ప్రాంగణం. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) 75 ఏళ్ల పండక్కి వేదిక అట్టహాసంగా ముస్తాబైంది. జనం కిటకిటలాడుతున్నారు. చలువ పందిళ్ల మధ్య అందంగా ఏర్పాటు చేసిన కుర్చీలలో కార్యకర్తలు ఆసీనులవుతున్నారు. వాళ్లకు ముందు ఏర్పాటు చేసిన విశాల వేదికపై రెండు పెద్ద కుర్చీలు, ఆ పక్కన మరికొన్ని మామూలు కుర్చీలు వేసి ఉన్నాయి. సభా నిర్వహణ మొదలైంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులొక్కక్కర్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టు తమకు కేటాయించిన సీట్లలో కూర్చొంటున్నారు.

అప్పుడు జరిగిందో అద్భుతం. డీఎంకే అధినేత, భారతీయ సినిమా ఐకాన్, కవి, రచయిత, తమిళ ముద్దుబిడ్డు కలైంజర్ కరుణానిధి ఇప్పుడు వేదిక మీదకు వస్తారని పిలవడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఈలలు, కేకలతో దద్దరిల్లింది. కరుణానిధి వచ్చారు. వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొన్నారు అందరికీ చేతులూపుతూ. ఇక్కడ సీన్ కట్ చేస్తే..
అవును, మీరు చదివింది నిజమే. ఎప్పుడో 2018లో కన్నుమూసిన కరుణానిధి ఇప్పుడెలా వచ్చా ఎలా వచ్చారనేగా మీ అనుమానం. ఆయన వచ్చింది నిజం, చేతులు కదిలిస్తూ కుర్చీలో కూర్చొన్నది నిజం. మాట్లాడింది నిజం. తన ట్రేడ్‌మార్క్ బ్లాక్ సన్ గ్లాసెస్, తెల్ల చొక్కా, భుజాల చుట్టూ పసుపు రంగు శాలువా ధరించి - కరుణానిధి తన శైలిలో ప్రేక్షకులకు కనిపించారు. కొద్ది నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన సీటు పక్కనే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ ను ప్రశంసించింది కూడా నిజమే. పాతాళభైరవి సినిమా డైలాగ్ మాదిరి ఇదేమీ తావీజు మహిమ కాదు. ఇదంతా ఇప్పుడు రాజ్యమేలుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) చలువ.


ఇప్పటి ట్రెండ్ డీప్ ఫేక్ వీడియో...
ఇప్పటి ట్రెండ్ డీప్‌ఫేక్ వీడియో. ఆ పద్ధతిన కరుణానిధిని రూపొందించారు. గత ఏడాది కాలంలో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ దిగ్గజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నాలుగు సార్లు కనిపించారు. ఏఐ మీడియా టెక్ సంస్థ ముయోనియం వ్యవస్థాపకుడు సెంథిల్ నయగం ఈ కరుణానిధి సృష్టికర్త. “ఇటువంటి డీప్‌ఫేక్‌లకు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. మీరు ఒక నిర్దిష్ట వ్యక్తికి కొన్ని స్టేట్‌మెంట్లను అందిస్తే అది క్రోడికరించుకుని మాట్లాడుతుంది” అని సెంథిల్ నయగం ఆల్ జజీరాకి చెప్పిన మాట ఇక్కడ అతికినట్టు సరిపోతుంది.
ఏఐ కరుణానిధి గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన స్థానిక మీడియా ఈవెంట్‌లో మొదటిసారిగా పబ్లిక్‌గా కనిపించారు. ఆ తర్వాత డీఎంకే పార్టీ సభ్యుల ప్రచారం కోసం మరోసారి వచ్చారు. ఇలా తిరిగి ప్రాణం పోసుకున్న ప్రతిసారీ పార్టీ కార్యకర్తలను సత్కరిస్తాడు. ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తాడు. ఈసారి కూడా అదే జరిగింది. ఈ ఏడాది జనవరిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైన కరుణానిధి ఏకంగా ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడారు. ఇప్పుడు డీఎంకే పార్టీ 75ఏళ్ల వార్షికోత్సవ సభలో ప్రత్యక్షమయ్యారు.
అచ్చం కరుణానిధిలా ఎలా తయారైందీ?

కరుణానిధి చివరి ఇంటర్వ్యూ 2016లో జరిగింది. ఆయన స్వరం అప్పటికే పూర్తిగా మారిపోయింది. శరీరం బలహీనపడింది. కరుణానిధి స్పీచ్ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి నాయగం అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించారు. 1990ల నాటి కరుణానిధి పోలికను తిరిగి సృష్టించాడు. ముందుగా రికార్డ్ చేసిన ఏఐ ప్రసంగాన్ని ముందుగా డీఎంకే నేతలకు వినిపించి ఆ తర్వాత కృత్రిమ కరుణానిధికి ఫీడ్ చేశారు. దాదాపు ఇది ఒక రోబోట్ ను పోలి ఉండేలా మాట్లాడమన్నప్పుడు మాట్లాడేలా ఏర్పాటు చేశాడు నాయగం.
కరుణానిధి డీప్‌ఫేక్‌ సృష్టికర్త ఎవరు?
ఈ మొత్తం పొలిటికల్ డ్రామా వెనుకున్న బ్రెయిన్ ముయోనియం ఏఐ మీడియా టెక్ సంస్థ. మరణించిన వ్యక్తిని పోలిన మనిషిని తయారు చేయడం, దానికి ప్రసంగాన్ని ఫీడ్ చేయడం, అవసరమైనప్పుడు వినిపించడం ఇందులోని టెక్నిక్. ఈ రకమైన వీడియోలు ప్రజల్లో బాగా ప్రభావం చూపుతుండడంతో నయగం ఇప్పుడు అచ్చంగా ఇలాంటి రాజకీయ ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోల తయారీలో బీజీ అయిపోయారు.
వీటికి ఉన్న విలువెంత?

తొలిసారి ఈ ప్రయోగాన్ని బీజేపీ చేసింది. అది వీడియో కాదు ఆడియో మాత్రమే. ఆ తర్వాత వరుసగా డీఎంకే, ఏఐఏడీఎంకేలు పోటీ పడ్డాయి. జయలలిత డీప్ ఫేక్ వీడియో కూడా గతంలో వచ్చింది. ఆ తర్వాత డీఎంకే ఏకంగా ఓ సంస్థనే హైర్ చేసి కరుణానిధి ఫోటోలు, వీడియోలు, ప్రసంగాలు ఉండేలా ఓ పెద్ద ప్రాజెక్ట్ కే శ్రీకారం చుట్టింది. అది ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే ఇలా చేయడం సబబా కాదా అనే ప్రశ్న తలెత్తింది.
రశ్మికా మందనా వీడియో నేర్పిన పాఠం ఏమిటీ?
ఆమధ్య రశ్మికా మందనా అనే సినిమా యాక్టర్ కి సంబంధించి డీప్ ఫేక్ వీడియో వచ్చిన తర్వాత ఈ చర్చ తీవ్రమైంది. దీని నైతికతను ప్రశ్నిస్తున్నారు చాలామంది. కృత్రిమ కరుణానిధి నిస్సందేహంగా సరికొత్త సంచలమే. కేవలం రాజకీయ లబ్ధి కోసం చనిపోయిన వారిని తిరిగి పుట్టించడమనే ప్రక్రియ సరికాదన్నారు మొజిల్లా ఫౌండేషన్‌ ఏఐ సీనియర్ ఫెలో అంబర్ సిన్హా. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడానికి కృత్రిమ మేధస్సు దుర్వినియోగం అవుతుందనే భయం ఉండనే ఉంది.
కరుణానిధి వీడియోలకు వచ్చిన స్పందన చూసిన డీఎంకే నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏఐ కరుణానిధి ప్రసంగాలను రూపొందించాలని ఆలోచిస్తోంది.
ఇది నైతికమా?అనైతికమా?
కానీ ఇది కొన్ని ఇబ్బందికరమైన నైతిక, చట్టపరమైన ప్రశ్నలనూ తెరపైకి తెచ్చింది. “బతికున్న వ్యక్తి సింథటిక్ ఆడియో, వీడియోను తయారు చేయడానికి ఏఐని వాడుకోవడం ఒక ఎత్తయితే చనిపోయిన వ్యక్తిని తిరిగి పుట్టించడం, వారి అభిప్రాయాలను జనంలోకి వదలడం మరో ముఖ్య విషయం. ఇది సబబు కాదేమో" అని అంబర్ సిన్హా అన్నారు.
కానీ ఇప్పటికే అల్లాఉద్దీన్ అద్భుత దీపం సినిమాలో మాదిరి సీసాలోంచి బొమ్మలు బయటికి వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఆపడం ఎవరి తరమన్నది ప్రశ్న. నిజానికి ఈ ట్రెండ్ ఈ తరహాలో కాకపోయినా జీన్స్ అనే తమిళ సినిమాలో మొదలైంది. ఆ తర్వాత అవతార్ సినిమా. ఇప్పుడు సోషల్ మీడియా ఈ ఏఐని విపరీతంగా వాడేస్తున్నాయి. 2024లో భారతదేశంలో 60 మిలియన్ డాలర్ల వ్యాపారం జరిగినట్టు ఆల్ జజీరా వార్త సంస్థ అంచనా.
"తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. ఇప్పుడా పార్టీలకు చెందిన పేరున్న పెద్ద నాయకులు ఎవర్వూ లేరు. జయలలిత, ఎంజి రామచంద్రన్, కరుణానిధి, విజయకాంత్ లాంటి పలుకుబడి ఉన్న నేతలెవ్వరూ ఇప్పుడు లేరు. దాంతో ఇప్పుడున్న నేతలు పాత నాయకుల ఫోటోలు, మాటలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి డీప్‌ఫేక్‌లను ఆశ్రయిస్తున్నట్టు నయగం చెబుతున్నారు. ఆయన సంస్థ ఎనిమిది భాషల్లో క్లోన్ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ను గత సెప్టెంబర్ లో విడుదల చేసింది. అది వైరల్ కావడంతో అటువంటి అప్లికేషన్‌లపై ఆసక్తి పెరిగింది.
కృత్రిమ కరుణానిధి తొలి ప్రసంగం...
ఈ ఏడాది జనవరి 21న డీఎంకే పార్టీ అనుబంధ యువజన విభాగ సమావేశం సేలంలో జరిగినపుడు వారిని ఉద్దేశించి ఈ ఏఐ కరుణానిధి ప్రసంగించారు. సుమారు 5 లక్షల మంది మద్దతుదారులను ఆ ప్రసంగం ఆకట్టుకుంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల ప్రచారంలోనూ కృత్రిమ కరుణానిధి ప్రసంగాలను వినిపించింది. బీజేపీ విధానాలను తూర్పారబట్టే పాత ప్రసంగాలను తిరిగి కొత్తగా పుట్టిన కరుణానిధి నోట వినిపించి ఓటర్లను ఆకట్టుకున్నారు. చనిపోయిన మనిషితో ప్రజాదరణ పొందుతారా అని పలువురు విమర్శించినా డీఎంకే ఖాతరు చేయలేదు. కొన్నిసార్లు డీప్ ఫేక్ వీడియోలు సింథటిక్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే లిప్ సింక్ సరిపోలడం లేదు. అయితే కరుణానిధి వాయిస్‌ ఆడియో మాత్రం అచ్చం ఆయన మాట్లాడినట్టే ఉంది. విజువల్స్ సరిగా ఉండకపోవడానికి ఓ కారణం నాణ్యత కలిగిన వీడియో డేటాసెట్‌లు అందుబాటులో లేకపోవడమే కారణమంటున్నారు ఏఐ ద్వారా కరుణానిధిని తయారు చేసిన నయగం. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వాటితోనే కరుణానిధి వీడియో తయారు చేయాల్సి రావడంతో అది మొదట్లో సరిగా రాకపోయినా ఇప్పుడు మెరుగైంది.
2020 ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటిసారిగా డీప్‌ఫేక్‌ల వినియోగాన్ని భారతదేశం చూసింది. బిజెపి రాజకీయ నాయకుడు మనోజ్ తివారీ తాను మాట్లాడలేని రెండు భాషల్లో (హర్యానీ, ఇంగ్లీషు) డీప్‌ఫేక్ వీడియోల ద్వారా ప్రచారం చేశారు. అది వివాదమే సృష్టించింది.
"ప్రజలు దీన్ని ఎక్కువగా చూడటం ప్రారంభిస్తే ఇక అవి ప్రతిచోటా దర్శనం ఇస్తాయి. గతంలో రాజకీయ పార్టీలు వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని డీప్ ఫేక్ వీడియోలు ఆక్రమించవచ్చు. ఈ చోటా మోటా నాయకుల మాటలు వినేకన్నా పాత తరం నాయకుల ప్రసంగాలే బెటర్ అని రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది" అన్నారు సామాజిక విశ్లేషకుడు ఎం.శేషగిరిరావు.
ఇండోనేషియాలో తొలిసారి...
ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ తరహా డీప్ ఫేక్ వీడియోలను వాడారు. ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మిలిటరీ జనరల్ ప్రబోవో సుబియాంటో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి, తనను తాను ఏఐ అవతార్‌గా ఊహించుకోవడానికి ఈ ఏఐని వినియోగించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా ప్రభుత్వ అనుకూల వర్గాలు డీప్‌ఫేక్‌లను ఉపయోగించాయి. పాకిస్తాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన జైల్లో ఉండే తన న్యాయవాదులకు ఈ తరహా డీప్ ఫేక్ లతో పలు సూచనలు సలహాలు పంపి ప్రచారం చేస్తున్నారు. అవి అమెరికాలోని స్టార్టప్ ఎలెవెన్‌ల్యాబ్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఏఐ ఆడియో ప్రసంగాలుగా మారుతున్నాయి.
Read More
Next Story