ఆడప్లిలల భ్రూణహత్యల నివారణకు కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
ఎట్టకేలకు కర్ణాటక సర్కారు భ్రూణహత్యల నివారణకు చర్యలు తీసుకుంది. కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అమలు చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఆడపిల్లల భ్రూణహత్యల ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం.. ఈ దారుణ చర్యను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. అల్ట్రాసౌండ్ గదిలోకి గర్భిణీని మాత్రమే పంపి, ఆమె బంధువుల ప్రవేశాన్ని పరిమితం చేయాలని నిర్ణయించింది.
పక్షం రోజుల క్రితం మాండ్యా జిల్లా పాండవ్‌పూర్ పట్టణంలోని ఆరోగ్య శాఖ నివాస గృహంలో ఆడ పిండాన్ని చంపిన ఆరోపణపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్‌తో సహా నలుగురిని అరెస్టు చేశారు.
కిట్ల దుర్వినియోగం..
భ్రూణహత్యల నెట్‌వర్క్ కేవలం మాండ్యా జిల్లాకే పరిమితం కాకుండా బెంగళూరు, మైసూరు, రామనగర జిల్లాల్లో కూడా యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మాండ్యా జిల్లాలోని 32 హోల్‌సేల్ మందుల దుకాణాలు ఏడాదిలోపు అబార్షన్ కోసం ఉపయోగించే వేలాది ``MPT కిట్‌లను'' విక్రయించాయని గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి రావడంతో జిల్లాలో ఈ కిట్ల విక్రయాలను నిషేధించారు. అయితే బయటి జిల్లాల నుంచి వీటిని కొని రహస్యంగా ఉంచుతున్నారు. ఈ కిట్ల విక్రయానికి సంబంధించి ఒక నియమావళి లేదని తెలుస్తోంది.
వైద్యులతో వర్క్‌షాప్..
ప్రీ కాన్సెప్షన్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ పై ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌కు రేడియాలజిస్టులు, సోనాలజిస్టులు, గైనకాలజిస్ట్‌లు హాజరయ్యారు. అల్ట్రాసౌండ్ గదిలోకి గర్భిణీతో పాటు బంధువులు రావడంపై వారు అనుమానం వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేని కొంతమంది సోనాలజిస్టులు స్కానింగ్ వీడియోలను ఇతర వైద్యులకు షేర్ చేయడం భ్రూణ హత్యలకు ఒక కారణమని వర్క్‌షాప్‌కు హాజరైన ఒక వైద్యుడు ది ఫెడరల్‌తో అన్నారు.
చర్యలు తప్పవు..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం..ప్రివెన్షన్ ఆఫ్ కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ ఫీటల్ సెక్స్ డిటర్మినేషన్ చట్టం కింద రిజిస్టరయిన అన్ని ఆసుపత్రుల్లో అల్ట్రాసౌండ్ గది వెలుపల గర్భిణీని మినహాయించి ఇతరుల ప్రవేశం లేదని సూచించే బోర్డు తప్పనిసరిగా ప్రదర్శించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డా. వివేక్ డోర్ ఆదేశించారు. అదనపు మానిటర్లు అమర్చినట్లు ఫిర్యాదు వస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.