వాళ్ల సర్వేలు, వాళ్లిష్టం!!  ఏపీ, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
x
TDP,YCP,Janasena Flags

వాళ్ల సర్వేలు, వాళ్లిష్టం!! ఏపీ, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!

రెండు సర్వేలు, రెండు భిన్నమైన తీర్పులు.. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు కదూ.. అందుకే, వాళ్ల సర్వేలు వాళ్లిష్టం అంటున్నారు ఓటర్లు. మా ఓటు మా ఇష్టం అంటున్నారు జనం.


ఎన్నికల సీజన్లో సర్వేలు, ప్రిడిక్షన్లు, ప్రాబబులిటీస్ వంటివి చాలా మామూలు విషయం. అయితే ఇప్పుడు వీటి విశ్వసనీయత, కచ్చితత్వం ప్రశ్నార్థకమైంది. ఎవరు చెప్పేది వినాలో, ఎవరు చేసే సర్వేను నమ్మాలో జనానికి అర్థం కాని పరిస్థితి. అందుకే జనం కూడా ఇటీవలి కాలంలో ఏ సర్వేకు పెద్దగా విలువ ఇవ్వడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని రెండు పేరున్న మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట చేసిన ఈ సర్వేలు ఎవరికి తోచిన రీతిలో వాళ్లు తీర్పులిచ్చారు. కేంద్రంలో బీజేపీ గెలుస్తుందని ఢంకా భజాయించిన ఈ రెండు సంస్థలు రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేయడంలో పరస్పర విరుద్ధమైన తీర్పులివ్వడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో వైసీపీకి గట్టి తగలబోతోందని చెబితే టైమ్స్ నౌ అనే సంస్థ నిర్వహించిన సర్వే అందుకు విరుద్ధమైన లెక్క చెప్పింది. వైసీపీయే విజయభేరి మోగిస్తుందని చెప్పడం గమనార్హం. వీళ్ల లెక్కలు అర్ధమైనవాళ్లు ‘ఆ.. ఇవింతేలెమ్మని పెదవి విరవగా’ అనుకూలంగా వచ్చిన వాళ్లు ‘ఇక చూస్కో, మా తడాకా’ అంటుండగా.. వ్యతిరేకంగా వచ్చిన వాళ్లు ‘ఆ సంస్థలకు అసలు విశ్వసనీయతే లేదు, డబ్బా సంస్థలు’ అంటూ విరుచుకుపడ్డారు.

మరో రెండు నెలల్లో లోక్ సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయఢంకా మోగించనున్నామని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రఖ్యాత మీడియా సంస్థ ఇండియా టుడే, ఆజ్ తక్ గ్రూప్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా చేసిన సర్వే తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశమైంది.

ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం-జనసేన కూటమికి 17 లోక్ స్థానాలు.. వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే వెల్లడించింది.


మొత్తం ఓట్లలో టీడీపీ-జనసేన కూటమికి 45శాతం ఓట్లు, వైసీపీకి 41.01 శాతం ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ఇక బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.7శాతం ఓట్లు ఏపీలో లభించవచ్చని తెలిపింది. ఏపీకి సంబంధించిన ఈ సర్వే వివరాలను ఇండియా టుడే ప్రసారం చేసింది.

అయితే, ఆశ్చర్యకరమైన రీతిలో టైమ్స్ నౌ అనే మరో ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం ఏపీలో అధికార వైసీపీకి 19 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 6 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది.

‘ప్రజల మనోగతం పేరుతో కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత లేదు. ఇందుకు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతోపాటు 2019 ఎన్నికల్లో ఆ సంస్థ లెక్కలు తప్పడమే నిదర్శనం’ అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఈ మాట ఎందుకన్నారంటే ఏపీలో వైఎస్సార్ సీపీకి గట్టి షాక్‌ తగలబోతోందని ఇండియా టుడే సంస్థ సర్వే తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. వైసీపీ 8 స్థానాలకు పరిమితం కానుందని ఇండియాటుడే సంస్థ తేల్చింది. 2023 డిసెంబర్‌ 15 నుంచి జనవరి 28 వరకు సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారో, దాని శాస్త్రీయత ఏమిటో చెప్పలేదు.

ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ఈసారి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. 17 లోక్‌సభ స్థానాలలో బీజేపీ 3, బీఆర్ఎస్ కు 3, మజ్లిస్‌ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్‌కు 3, మజ్లిస్‌ ఒక సీటు వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఏడు స్థానాలు పెంచుకోనుందని సర్వే అంచనా వేసింది.

తెలంగాణకు సంబంధించి ఇటు ఇండియా టుడే, అటు టైమ్స్ నౌ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. తెలంగాణ మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు, బీజేపీ బీఆర్ఎస్ కు చెరో 3 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం లభించవచ్చని ఇండియా టుడే సర్వేలో తేలింది.

అటు టైమ్స్ నౌ సర్వేలో.. కాంగ్రెస్ కు 9, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 2, ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది. 48 గంటల వ్యవధిలో ఇండియా టుడే సర్వే, టైమ్స్ నౌ సర్వేలు బయటకు రావడంపైన కూడా భిన్న స్వరాలు విన్పించాయి.

ఇండియా టుడే- ఆజ్ తక్ సర్వే (ఆంధ్రప్రదేశ్)

టీడీపీ-జనసేన కూటమి – 17

వైసీపీ-08

బీజేపీ-00

కాంగ్రెస్-00

టైమ్స్ నౌ సర్వే(ఎంపీ ఎన్నికలు)-ఆంధ్రప్రదేశ్

వైసీపీ-19

టీడీపీ-జనసేన కూటమికి 6

కాంగ్రెస్ కి -0

బీజేపీకి-0

ఇండియా టుడే-ఆజ్ తక్ సర్వే(తెలంగాణ)

కాంగ్రెస్-10

బీఆర్ఎస్-03

బీజేపీ-03

ఎంఐఎం-01

టైమ్స్ నౌ సర్వే(తెలంగాణ)

కాంగ్రెస్-09

బీజేపీ-05

బీఆర్ఎస్-02

ఎంఐఎం-01

ఇలా రెండు ప్రధాన సర్వే సంస్థలు పరస్పర విరుద్ధమైన సర్వే ఫలితాలు వెల్లడించడంతో వీటిలో ఏది నిజం కానున్నది? అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. వైసీపీకి అంతిమ యాత్ర పక్కా అంటూ ఆజ్ తక్ – సీ ఓటర్ సర్వే వివరాలు ట్వీట్ చేశారు టీడీపీ నేత నారా లోకేశ్. దీనికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికూడా ధీటుగానే స్పందించారు. ఎవరి మానసిక ఆనందం వాళ్లదన్నారు. తినబోతూ రుచి అడగడం ఎందుకన్నారు. వచ్చే ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలన్నారు రామకృష్ణారెడ్డి.

Read More
Next Story