‘అసెంబ్లీలో నేలపై కూర్చుంటా..ప్రతిపక్షంతో కలిసి కాదు’
x

‘అసెంబ్లీలో నేలపై కూర్చుంటా..ప్రతిపక్షంతో కలిసి కాదు’

‘ప్రతిపక్షానికి దూరంగా ప్రత్యేక బ్లాక్ లేదా సీటు కేటాయించండి. లేదంటే నేల మీద కూర్చుంటా’ - అసెంబ్లీ స్పీకర్‌కు నిలంబూరు ఎమ్మెల్యే పీవీ అన్వర్ లేఖ.


కేరళ అసమ్మతి ఎమ్మెల్యే పీవీ అన్వర్ అసెంబ్లీ స్పీకర్‌ ఏఎన్ శ్యాంసీర్‌కు లేఖ రాశారు. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని లెటర్ పంపారు. ‘ప్రతిపక్షంతో కలిసి కూర్చునే ఉద్దేశ్యం నాకు లేదు. అందుకే ఈరోజు సభకు హాజరుకావడం లేదు. ప్రతిపక్షానికి దూరంగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్యేక బ్లాక్ లేదా సీటు కేటాయించండి’ అని అన్వర్ లేఖలో కోరారు. తమ పార్లమెంటరీ పార్టీలో అన్వర్ భాగం కాదని సీపీఐ(ఎం) చెప్పడంతో స్పీకర్..అన్వర్‌కు ప్రతిపక్ష సభ్యులతో పాటు సీటు కేటాయించారు. స్పీకర్ స్పందన కోసం బుధవారం వరకు వేచి చూస్తానని అన్వర్ విలేఖరులతో అన్నారు.

"రేపటిలోగా (అక్టోబర్ 9) నాకు స్పీకర్ నుంచి సమాధానం రాకపోతే, నేను అసెంబ్లీ సమావేశానికి హాజరవుతాను. కానీ నేను ప్రతిపక్షంతో కలిసి కూర్చోను. సభలో నేలపై కూర్చుంటాను." అన్నారు.

సభలో ముఖ్యమైన చర్చలకు హాజరుకాకుండా తప్పుకుంటున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ‘‘ సభలో జరుగుతున్నవి తగాదాలే తప్ప చర్చలు కావని’’ సమాధానమిచ్చారు. విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం కారణంగా స్పీకర్ సభను సోమవారం రోజంతా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు సీనియర్ పోలీసు అధికారి MR అజిత్‌కుమార్‌పై అన్వర్ పలు ఆరోపణలు చేయడంతో పార్టీ ఆయనను దూరం పెట్టింది. కేరళలో వామపక్ష పార్టీ పశ్చిమ బెంగాల్ కంటే దారుణమైన పరిస్థితికి చేరుకుంటుందని ఆరోపించారు.

Read More
Next Story