
Bonded labourers with their agreement Bonds (File)
పొరపాటున అప్పు తీసుకున్నారో జీవితాంతం వెట్టి చాకిరే ఇక్కడ!
ఫిబ్రవరి 9.. వెట్టి చాకిరీ నిర్మూలన దినం.. ఆధునిక యుగంలోనూ కట్టుబానిసత్వం రాజ్యమేలుతున్న తీరుకు నిదర్శనం ఈ కథనం..
వెట్టి నుంచి విముక్తి పొంది.. కొత్త జీవితంలోకి అడుగు పెట్టి.. - ఒకసారి అప్పు తీసుకుంటే జీవితకాలం బందీలే..
- తీసుకున్న రుణానికి పది రెట్లు అధికంగా బాండు పేపర్లపై సంతకాలు - రేయింబవళ్లు శ్రమ దోపిడీకి పాల్పడుతున్న యజమానులు
- 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'తో అనుభవాలు పంచుకున్న బాధిత బందీలు..
పదిహేనేళ్ల క్రితం తన అక్క ఓ రైస్ మిల్లు యజమాని నుంచి రూ.20 వేల అప్పు తీసుకుంది. అక్క, బావ మిల్లులో పనిచేసినా ఆ అప్పు తీరకపోవడంతో ఏడేళ్ల తమ్ముడిని కూడా తీసుకెళ్లారు. అక్కడ ఈ ముగ్గురూ 15 ఏళ్లు పనులు చేయించుకున్నా అప్పు తీరలేదని యజమాని వదిలిపెట్టలేదు. ఓసారి తమ్ముడు బంధువులతో సొంతూరుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆగ్రహించిన యజమాని మిల్లులో బస్తాలు పడేసి అక్కను చంపేశాడు. దానిపై కేసు లేకుండా చేసుకున్నాడు. మొత్తం 11 మంది ఆ కుటుంబ సభ్యులు అధికారుల సాయంతో వెట్టి చాకిరీ నుంచి విముక్తులయ్యారు. ఇప్పుడు చెట్లు కోసే పని చేసుకుంటూ స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇది చిత్తూరు జిల్లాకు చెందిన అజిత్ కుమార్ కథ!
'అప్పటికి ఆమె వయసు పట్టుమని పదేళ్లు కూడా లేవు. అమ్మా, నాన్న చేసిన అప్పు తీర్చడానికి వారితో పాటు ఆమె కూడా రాళ్లు కొట్టే పనికి వెళ్లింది. పన్నెండేళ్లకే ఇష్టం లేని పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నాన్ని ఆమె వ్యతిరేకించింది. ఆ సంగతి తెలుసుకున్న యజమాని ఢిల్లీలో వ్యభిచార గృహానికి అమ్మేశాడు. అక్కడ మూడేళ్ల నరకం కూపం నుంచి ఎలాగోలా బయటపడి సొంతూరు చేరుకుంది. ఇప్పుడు కుమారుడితో కలిసి కూలి, నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ' ఇది వెట్టి చాకిరీ నుంచి బయటపడిన అనంతపురం జిల్లాకు చెందిన జ్యోతి అనే మహిళ వ్యధ!
తిరుపతి జిల్లాకు చెందిన వెట్టి కార్మికురాలు తీన్మోయి కథ ఆసక్తికరం.
ఇటుక బట్టీల యజమాని.. ఆమె తండ్రి ఒప్పందం ప్రకారం కూలీలను తీసుకురాలేదని వారికి బదులు ఏడో తరగతి చదువుతున్న ఆమెను పనిలోకి బలవంతంగా తీసుకుపోయాడు. మూడేళ్లు అక్కడే నిర్బంధంగా పని చేయించుకున్నాడు. అధికారుల చొరవతో వెట్టి చాకిరీ నుంచి బయటపడింది. ఆ తర్వాత మానేసిన చదువును కొనసాగించి టెన్త్ పాసైంది. పెళ్లి చేసుకుని పండ్ల దుకాణాన్ని లాభదాయకంగా నడుపుకుంటోంది. ఇప్పుడు తనలా వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి జీవన్ జ్వాల సంస్థ తరఫున కృషి చేస్తోంది.
వీరే కాదు.. ఆంధ్రప్రదేశ్లో వెట్టి చాకిరీ చట్రంలో కొనసాగుతున్న వారూ, దాని నుంచి బయట పడి స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్న పేదలు ఎందరో ఉన్నారు. వీరిలో చిన్నారుల నుంచి పెద్దల వరకు, ఆడ, మగ అన్న బేధం లేకుండా ఒక్కసారి వెట్టి చాకిరి చట్రంలో చిక్కుకుంటే ఇక ఏళ్ల తరబడి అక్కడే మగ్గిపోతున్నారు. వారి జీవితాలకు ఎదుగూ బొదుగూ లేకుండా పోతున్నారు. చిన్నారులు అందరిలా చదువులకూ నోచుకోలేక పోతున్నారు. పేదరికంతో కుటుంబ పోషణ జరగని పరిస్థితుల్లో వెట్టి చాకిరీ బారిన పడుడుతున్న వారి అసహాయత, అవసరాలు, పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్న భూస్వాములు, కెపెత్తందార్లు, వ్యాపారులు, పరిశ్రమల యజమానులు,
కాంట్రాక్టర్లు రుణాలిచ్చి వారి శ్రమను ఏళ్లకు ఏళ్లు దోచుకుంటున్నారు. వీరి నుంచి వెట్టి చాకిరీ బాధితులకు విముక్తి కల్పించడానికి బాండెడ్ లేబర్ చట్టం అమలులో ఉంది. ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలుకు వీలుగా ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్డ్ బాండెడ్ లేబర్ అసోసియేషన్ అయిన జీవన్ జ్వాల వంటి సంస్థలు ఉన్నాయి. వెట్టి నుంచి విముక్తులైన కొందరు నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారు. వెట్టిలో ఉన్నప్పుడు తాము అనుభవించిన దుర్భర పరిస్థితులను, కష్టాలను కన్నీళ్లను 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో పంచుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 9న) వెట్టి చాకిరీ నిర్మూలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కథనం.. హృదయాలను కదిలించే వారి కష్టాలు, కన్నీళ్లు వారి మాటల్లోనే..!
నన్ను ఢిల్లీ వాళ్లకు అమ్మేశారు..
నా పేరు వడ్డే జ్యోతి.
మాది అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామం. నా ఎనిమిదేళ్ల వయసులో కదిరి మండలం కొమరావారిపల్లిలో అమ్మానాన్న, తమ్ముడితో పాటు నన్నూ రాళ్లు కొట్టే పనికి తీసుకెళ్లారు. ఆ యజమాని సమయంతో పనిలేకుండా పగలు, రాత్రి పని చేయించే వారు. అలసిపోయిన మాకు ఒళ్లు నొప్పులు తెలియకుండా నాటు సారాలో గంజాయి మరిగించి తాగించే వారు. కడుపునిండా తిండి కూడా పెట్టేవారు కాదు. నాకు పన్నెండో ఏటనే పెళ్లి చేయాలని అమ్మా నాన్న అనుకున్నారు. నాకు అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాను. నా అయిష్టతను తెలుసుకున్న యజమాని మంచి పనిలో పెడ్తాను అని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లి రైలెక్కించాడు. ఆ రైలు ఢిల్లీ చేరుకున్నాక కొందరొచ్చి ఓ గదిలో పెట్టారు. ఆ తర్వాత నుంచి విటులు రావడంతో భయంతో ఏడుస్తూ అడిగితే.. 'నిన్ను మాకు అమ్మేశారు. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి' అని దాని నిర్వాహకులు చెప్పారు. దీంతో నేను వ్యభిచార గృహానికి అమ్ముడుపోయానని తెలుసుకుని ఏడ్వని రోజు లేదు. అలా మూడేళ్లు ఆ నరక కూపంలో బందీగా ఉన్నప్పుడు సహకరించకపోతే కొట్టేవారు. దీంతో పాక్షికంగా మానసిక స్థితిని కోల్పోయాను.. ఓ రోజు తనిఖీలకొచ్చిన ఒకాయన నన్ను విడిపించి హైదరాబాద్ రైలెక్కించారు. అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న నన్ను పోలీసులు తీసుకెళ్లి అనాథల హాస్టల్లో చేర్చారు. కొన్నాళ్లకు ఒక మహిళా అధికారి ఆ హోంను సందర్శించినప్పుడు మానసిక స్థితి సరిగా లేక మా ఊరు పేరునూ మర్చిపోయాను. తనది అనంతపురం జిల్లా అని ఆమె చెప్పడంతో నాదీ అదే జిల్లా అని గుర్తుకొచ్చింది. దాని ఆధారంగా ఆమె నన్ను మా ఊరు తీసుకొచ్చారు. అక్కడ ఇంకా అమ్మా, నాన్న, తమ్ముడు వెట్టి చాకిరీలోనే ఉన్నారు. నేనొచ్చిన సంగతి తెలుసుకున్న రాళ్ల క్వారీ యజమాని.. నీ గతాన్ని చెప్పినా, మీ అమ్మా నాన్నలను తీసుకెళ్లే ప్రయత్నం చేసినా చంపేస్తామని బెదిరించాడు. అక్కడ పని చేసే వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు. అప్పటికే తాగుడుకు బానిసై ఉన్న నా భర్త తాగి తాగి కొన్నాళ్లకు చనిపోయాడు. నాకొక కొడుకు. అధికారుల సాయంతో అమ్మానాన్నలను వెట్టి చాకిరీ నుంచి విడిపించాను. ఇప్పుడంతా కలిసి ఉంటున్నాం. నేను కూలీ, నా కొడుకు తాపీ పని చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాం.' అని జ్యోతి వివరించింది.
బాకీ తీర్చలేదని మా అక్కను చంపేశారు- అజిత్
నా పేరు అజిత్. చిత్తూరు జిల్లా నగరి మండలం అయినంబాకం మా ఊరు.నా చిన్నప్పుడు మా అక్క నందిని కుటుంబ పోషణకు 15 ఏళ్ల క్రితం రేణిగుంటలోని ఓ రైస్ మిల్లు యజమాని వద్ద రూ.20 వేల అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చడానికి అక్క, బావ అక్కడ పని చేసినా అప్పు తీరలేదని ఏడేళ్ల వయసున్న నన్ను కూడా ఆ పనిలోకి తీసుకెళ్లారు. అక్కడ మూటలు మోసే పని చేయమనే వారు. నేను మోయలేకపోతే కొట్టేవారు. కొన్నేళ్ల తర్వాత మా బంధువులొచ్చి కొద్దిరోజులు ఇంటికి తీసుకెళ్లి తీసుకొస్తామని యజమానికి చెప్పి నన్ను 2023లో తీసుకెళ్లారు. నన్ను తిరిగి పనికి పంపలేదని మిల్లులో ఆ యజమాని మా అక్కపై మూటలు పడేసి దారుణంగా చంపేశాడు. ప్రమాదవశాత్తూ బియ్యం మూటలు పడి చనిపోయినట్టు తప్పుడు సమాచారం ఇచ్చి కేసు లేకుండా చేశాడు. అంతేకాదు.. వికలాంగుడైన మా బంధువును కిడ్నాప్ చేసి తీసుకుపోయి భయబ్రాంతులకు గురి చేశారు. మా వారిని కూడా అక్కలాగే చంపేస్తారన్న భయంతో మళ్లీ నేను మిల్లు పనికి వెళ్లాను. అలా 15 ఏళ్ల పాటు మేమంతా
అక్కడే వెట్టి చాకిరీలో బందీలుగా ఉన్నాం. రూ.20 వేల అప్పుకి రూ. 2 లక్షలు తీసుకున్నట్టు బాండు పేపరుపై రాయించుకున్నాడు మిల్లు యజమాని. ఎవరైనా అడిగితే ఆ రూ.2 లక్షలు చూపించేవాడు. మా దుస్థితిని తెలుసుకున్న అధికారులు మమ్ములను (11 మందిని) గత నవంబరు 30న వెట్టి చాకిరీ నుంచి విడిపించారు' అని అజిత్ వివరించాడు.
వెట్టి నుంచి విముక్తికి కృషి చేస్తున్నా..
నా పేరు తీన్మోయి. మాది తిరుపతి జిల్లా పుత్తూరు మండలం కేబీఆరపురం. మా తండ్రి కన్నన్ బెంగళూరులోని జిగిని ప్రాంతంలో ఇటుకల తయారీ పనికి కూలీలను తీసుకెళ్లేందుకు రూ.20 వేలు తీసుకున్నాడు.. వారిలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. నాన్న చెప్పిన ప్రకారం వారిలో ఒకరు తక్కువయ్యారని యజమాని నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో నా ఏడో తరగతి చదువు అపేసి పనిలో చేరాను. రాత్రి, పగలు తేడా లేకుండా మా అందరితో పనిచేయించే వారు. కేవలం మూడు గంటలే నిద్రపోవడానికి అవకాశం ఇచ్చే వారు. ఎవరైనా లేవకపోతే దారుణంగా కొట్టేసేవారు. వారానికి మా కుటుంబానికంతటికీ కేవలం రూ.500లే ఇచ్చేవారు. కడుపు నిండా తిండి కూడా పెట్టేవారు కాదు. అర్థాకలితోనే పని చేయించేవారు. అప్పుడప్పుడు మేం బయటకు వచ్చి వెళ్తుంటే ఒకసారి అధికారులు మమ్మల్ని అనుమానించి ఆరా తీశారు. మా గురించి తెలుసుకుని మా ఏడుగురిని వెట్టి చాకిరీ నుంచి విడిపించారు. వెట్టి నుంచి విముక్తులైన వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.20 వేలు ఇచ్చింది. పెద్దన్నయ్య ఎలక్ట్రిషియన్, చిన్నన్నయ్య డ్రైవర్గా పనిచేస్తున్నారు. అమ్మ కమలమ్మ కాయగూరలు అమ్ముతోంది. నేను ఐదేళ్ల క్రితం పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించా. రోజుకు రూ. వెయ్యికి పైగా సంపాదిస్తున్నా. మా ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నా. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన కోసం పని చేస్తున్న జీవన్ జ్వాల సంస్థలో చేరి ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నాను. మాలా ఇంకెవరూ వెట్టి చాకిరీకి వెళ్లకూడదని, వెళ్లిన వారిని బయటకు తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నా. ఇప్పటివరకు ఇలా 100 మంది వరకు వెట్టి చాకిరీ నుంచి విముక్తిలో పాలుపంచుకున్నాను. పండ్ల దుకాణాన్ని భర్తకు అప్పగించి మాలాగే ఇంకెవరున్నారో అన్వేషిస్తూ ఉంటాను. ఎక్కడైనా ఉంటే అధికారుల సాయంతో విడుదలకు సాయపడుతుంటాను' అని తీన్మోయి వివరించింది.
Next Story