‘నేను తప్పు చేయలేదు..నాకెలాంటి భయం లేదు’
x

‘నేను తప్పు చేయలేదు..నాకెలాంటి భయం లేదు’

గవర్నర్ విచారణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాను ఆందోళన చెందడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.


ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లుగా ..తాను ఆందోళన చెందడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ముడా కుంభకోణంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతించిన విషయం తెలిసిందే.

మంగళవారం బెంగళూరులో సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ..‘‘నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఏ తప్పు చేయలేదు. నేను ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు" అని అన్నారు. ముడా కేసులో సిద్ధరామయ్యపై ట్రయల్ కోర్టు విచారణను కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టేను సోమవారం సెప్టెంబరు 9 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయం ..

కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరిస్తే..సీఎం కావాలన్న కోరిక ఉందని మైసూరులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్వీ దేశ్‌పాండే విలేఖరులతో అన్నారు. ముడా కుంభకోణం సీఎం సిద్ధరామయ్యను వెంటాడుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సిద్ధరామయ్య.. 'ఎవరు సీఎం అవుతారో.. శాసనసభ్యులు, హైకమాండ్‌లు నిర్ణయిస్తారని' సిద్ధరామయ్య సమాధానమిచ్చారు.

మంత్రివర్గం ముందు నివేదిక..

మంగళవారం సిద్ధరామయ్య చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి చాముండేశ్వరి క్షేత్ర అభివృద్ధి అథారిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్‌-19 నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న అంశంపై రిటైర్డ్‌ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ కున్హా వెల్లడించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించగా.. నివేదికను గురువారం మంత్రివర్గం ముందు ఉంచుతామని సిద్ధరామయ్య తెలిపారు.

ముడా కమిషనర్ సస్పెండ్..

కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆరోగ్య శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బిజెపి, మాజీ మంత్రి కె సుధాకర్‌ను ఉద్దేశించి సిద్ధరామయ్య ఇలా అన్నారు.. “రిపోర్ట్‌లో ఏమి ఉందో అతనికి (సుధాకర్) తెలుసా? అతను తప్పు చేసినందుకే ఆందోళన చెందుతున్నాడు. తప్పుడు నివేదికను అంగీకరించారని అతనికి ఎలా తెలుసు?"

ముడా కమిషనర్‌గా కర్నాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి జిటి దినేష్ కుమార్ సస్పెన్షన్‌పై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఆయనను సస్పెండ్ చేసింది పట్టణాభివృద్ధి శాఖ అని చెప్పారు.

ముడా కుంభకోణం ఏమిటి?

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష భాజపా, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ అనుమతి మంజూరుచేయడాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని గతంలో సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీల మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్‌ గహ్లోత్‌ కొమ్ముకాస్తున్నారని సీఎం సిద్ధరామయ్య నిందించారు.

Read More
Next Story