ఇండియా ‘యూనియన్ ఓవర్ స్టేట్స్’ గా మారుతోంది: కేరళ సీఎం
x
పినరయి విజయన్. కేరళ సీఎం

ఇండియా ‘యూనియన్ ఓవర్ స్టేట్స్’ గా మారుతోంది: కేరళ సీఎం

సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ ఎత్తులతో ఓట్ల వేటను ప్రారంభించాయి. దక్షిణాది, ఉత్తరాది అంటూ కర్నాటక, ‘వివక్ష’ అంటూ కేరళ ఢిల్లీలో ధర్నాకు దిగాయి.


ఒక రోజు తేడాతో కర్నాటక, కేరళ రాష్ట్రాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తమపై కేంద్రం వివక్ష చూపుతోందని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు(పినరయ్ విజయన్, సిద్దరామయ్య) దీనికి అన్నీ తామై వ్యవహరించారు.

కేరళ లో అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రారంభంలో ఈ ధర్నా గురించి ప్రకటించినప్పుడు తమ వైఫల్యాలను కేంద్రంపై తోసే ఆలోచన చేస్తున్నారని, ఇదీ విఫలం అవుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇదీ దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యమంత్రుల మద్ధతు పొందింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రియాంక్ ఖర్గే వంటి కొత్తమిత్రులను పినరయి విజయ్ ను సంపాదించుకున్నారు. ఈ ధర్నాకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఫరూక్ అబ్దుల్లా, కపిల్ సిబల్, డీఎంకే మంత్రి పళనివేల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నుంచి డీ రాజా పాల్గొన్నారు.

ముందు జాగ్రత్త చర్యలు

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ధర్నాను బీజేపీ తిప్పికొట్టింది. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజించాలనే కుట్ర పన్నిందని, మరోసారి దేశాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నిస్తోందని విమర్శించింది. తాము ఎవరికీ బాకీ లేమని ప్రకటించింది. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కర్నాటకలోకి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దేశాన్ని ఉత్తర, దక్షిణంగా విభజించడానికి ప్రయత్నిస్తోందని, ఇది దేశ భవిష్యత్ కు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న సీపీఎం సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

"భారత దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ దశ నుంచి మెల్లగా అప్రజాస్వామికంగా యూనియన్ ఓవర్ స్టేట్స్ గా మారుతుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దాని పుట్టుకను చూస్తున్నాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉంది. మన దేశ సమాఖ్య విధానాన్ని కాపాడటానికి మనమందరం ఇక్కడికి వచ్చాం. ఈ రోజు నిజంగా గణతంత్ర దేశ చరిత్రలో ఎర్రసిరాతో రాయదగింది" కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

ఈ కార్యక్రమంలపై సీనియర్ జర్నలిస్ట్ టీజే శ్రీలాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. " ఇదీ కేరళ కాంగ్రెస్ శాఖ ఆరోపించినట్లు ఏం మొక్కుబడి సమావేశం కాదు. రాష్ట్రాలకు గొంతుకగా కేరళ ప్రభుత్వం ధైర్యంగా ఢిల్లిలో నిరసన చేపట్టింది. దీనికి జాతీయ స్థాయి నాయకులు హాజరుకావడంతో కర్నాటక ప్రభుత్వం నిర్వహించిన నిరసన లాగా బీజేపీ తిప్పికొట్టలేకపోయింది. తమతో రాని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందనే కేరళ వాదనకు బలం చేకూర్చినట్లయింది. భవిష్యత్ లో మరిన్ని చిన్న రాష్ట్రాలు ఈ బాటలో నడుస్తాయి" అని ఫెడరల్ తో అన్నారు.

ఈ నిరసనలో మాట్లాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. "ఒకప్పుడు నేరం రుజువయితే జైళ్లకు వెళ్లేవారు. కానీ బీజేపీ ఇప్పుడు ఈడీ అనే కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. వీరు ఎవరిపై కేసు పెట్టి లోపలకు పంపాలో ఆలోచిస్తారు. తాజాగా హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. రేపు నన్ను, తరువాత విజయన్ ను , ఆ తరువాత స్టాలిన్ , ఇంకా మిగిలితే సిద్ధరామయ్య సాహాబ్ లను కూడా జైళ్లో పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు " అని అన్నారు.

మీకు ఆ హక్కు లేదు

కేరళలో సీపీఎం చేసిన విధానాలతో ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టాయని కేరళ కాంగ్రెస్ విమర్శించింది. " ఎల్డీఎఫ్ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, అవినీతి కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. మన రాష్ట్రం అవసరాలను ప్రధాని మోదీ దగ్గర సీఎం ఎప్పుడు ప్రస్తావించలేదు. ఢిల్లిలో కర్నాటక చేసిన నిరసనతో కేరళ నిరసనను పోల్చలేనిది. కేంద్రం వివక్షను అంగీకరిస్తున్నాం కానీ, నిరసన తెలిపే హక్కుకు మాత్రం కేరళ ప్రభుత్వానికి లేదు" అని కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల ఫెడరల్ తో అన్నారు.

అయితే తమతో కలిసిరాని వారు రాష్ట్ర ద్రోహులని కేరళ లో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీ కౌంటర్ వేస్తోంది. నిన్న జరిగిన కర్నాటక ధర్నాలోను సీఎం సిద్దరామయ్య కూడా ఇదే అంశాన్ని లెవనెత్తారు. ఇప్పుడు సీపీఎం కూడా ఇదే దారిలో వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం నిలిపి వేయడం వల్లే సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని స్థానిక నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బీజేపీ సైతం బరిలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం భారత్ బియ్యం వంటి పథకాలను నేరుగా ప్రజలకే అందించాలని సంకల్పించింది. దీని వల్ల నేరుగా కేంద్రం పేరు ప్రజలకు తెలుస్తుందని తమకు రాజకీయంగా బలం పెరుగుతుందని కమల దళం భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా సమరాగ్ని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే పనిలో పడ్డారు.

Read More
Next Story