
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏఐఏడీఎంకే సిద్దంగా ఉందా?
డీఎంకేను ఓడించడమే మా లక్ష్యమంటున్న మాజీ సీఎం పళని స్వామి
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో పార్టీల మధ్య పునరేకీకరణ జరగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత ఏఐఏడీఏంకే చీఫ్ పళని స్వామి ఇంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇటీవల కాలంలో ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్లు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలకూడదు
మాజీ సీఎం మీడియాతో మాట్లాడుతూ..‘‘డీఎంకేను ఓడించడమే మా లక్ష్యం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే మా ఉద్దేశం. మేమంతా ఉమ్మడిగా పోరాడాలి.
బీజేపీ పొత్తు విషయంలో ఆరు నెలల తరువాత అడగండి’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనితో రాష్ట్రంలో పొత్తు రాజకీయాలకు తొలి అడుగు పడినట్లు తెలుస్తొంది.
మారుతున్న సమీకరణాలు..
తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో ఏఐఏడీఎంకే - బీజేపీ మధ్య పొత్తు చిగురించే అవకాశం ఉండటం అందరిలో ఆసక్తిని రేపుతోంది. చాలాకాలంగా తమిళనాడులో డీఎంకే- ఏఐఏడీఎంకే మధ్యే ఎన్నికల పోరు జరిగేది. కానీ కరుణానిధి, జయలలిత మరణంతో కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. పొత్తులుతో తమ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు కొత్తగా రాజకీయాల్లోకి దిగిన నటుడు, సూపర్ స్టార్ తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ ఇంకా పొత్తులపై తమ పార్టీ వైఖరిని బయటపెట్టలేదు. ‘నామ్ తమిళియార్ కచ్చి’ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని అధినేత సీమాన్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే కూటమి మాత్రమే బలంగా ఉంది. దాంతో ఏఐఏడీఎంకేకు వేరే పార్టీలు దొరకలేదు.
మౌనంగా ఉన్న బీజేపీ
ఏఐఏడీఎంకే పార్టీ అధినేత ఇచ్చిన ఆఫర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. ‘‘ఇప్పుడు తొందరపడి పొత్తులు గురించి మాట్లాడలేము. మేము తరువాత వివరంగా మాట్లాడుతాము’’ అని అన్నారు. ప్రస్తుతం బీజేపీ తన పాతమిత్రులను కొనసాగిస్తునే కొత్త పొత్తుల కోసం ఎదురుచూస్తు ఉంది.
అన్నా డీఎంకేలో అంతర్గత సంఘర్షణలు
జయలలిత మరణం తరువాత పార్టీ పగ్గాలు అందుకున్న పళని స్వామి పార్టీలోని చీలికలను సమర్థవంతంగా నివారించలేకపోతున్నారు. సీనియర్ నాయకులు ముఖ్యంగా కేఏ సెంగొట్టయన్ మీడియా ముందే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇవి పార్టీలో ఉన్న గ్రూపుల తగాదాలను బయటపెట్టినట్లు అయింది.
పార్టీలో అంతర్గత సమస్యలు, పొత్తుకు ఏ పార్టీ ముందుకురాకపోవడంతో దాని వ్యూహం అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం బీజేపీ- ఏఐడీఎంకే మధ్య పొత్తుపైనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story