కాపుల కొంప ముంచిందే ముద్రగడ? సలాది సంచలనం...
x
ముద్రగడ పద్మనాభం ఫైల్ ఫోటో

కాపుల కొంప ముంచిందే ముద్రగడ? 'సలాది' సంచలనం...

కాపులకు సీఎం పదవి ఇస్తానని పీవీ చెబితే ముద్రగడ వద్దన్నారా? కాపుల్ని ముద్రగడ ఎప్పుడూ పట్టించుకోలేదా! ఇదేం ఆరోపణ, ఎవరు చేశారు? కోస్తాలో ఈ సంచలనం ఏమిటీ?


మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ నేత, వైసీపీలో ఇటీవల చేరిన ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం కాపుల టార్గెట్ అయ్యారు. ఆయనకు అనుకూలంగా ప్రతికూలంగా వాదోపవాదాలు, చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు తీర్పులు ఇస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో ముద్రగడతో సన్నిహతంగా మెలిగిన మరో కాపు నాయకుడు, అమలాపురం వాసి సలాది వెంకటరమణ లేఖాస్త్రాన్ని సంధించారు. ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను ప్రస్తావిస్తూనే ఆయన ఏ సందర్భంలో ఏమి చేశారో, వాటి పర్యావసాలు ఏమిటో నేటి తరానికి తెలియజెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించిన వాళ్ళలో ముద్రగడ తొలివారని నేటి తరం నాయకులకు తెలియదు. కాపు రిజర్వేషన్లపై పోరాటం తొందరపాటు చర్యని, ఆ ఉద్యమాన్ని చేపట్టవద్దని చెప్పినా వినకుండా ఆయన ఆ పనికి పూనుకున్నారట. ఇలాంటి అనేక సంఘటనలను సలాది తన ఉత్తరంలో ప్రస్తావిస్తూ ఒకింత మందలింపు మరింత నేటి తరం ఆకళింపు చేసుకునేలా రాశారు.

ఎవరీ సలాది వెంకట రమణ?


సలాది వెంకటరమణ అమలాపురం వాసి. 1978 నుంచి ముద్రగడను చాలా దగ్గరి నుంచి పరిశీలించిన వారు. పదిహేను ఏళ్లుగా ఆయన్ను అనుసరించారు. అభిమానించారు. అనుచరునిగా వ్యవహరించారు. అనేక మంది కాపు ప్రముఖులతో సన్నిహితంగా మెలిగిన వారు. అమలాపురం నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పీవీఎస్ రామారావు అనుచరునిగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఆవేశపరుడే గాని అన్యాయం చేసేవారు కాదని, ప్లానింగ్ లేకనే ఎటూ కాకుండా పోయారని ఆవేదన చెందుతూనే ఇప్పటికైనా సరిగా ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చారు. 1978లో ఆయన పాటు రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఆ తర్వాత ఐదేళ్లకు రాజకీయాల్లోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంటి వాళ్లు ముఖ్యమంత్రులు, ఉపరాష్ట్రపతులైనా ముద్రగడ పద్మనాభం ఏమీ కాలేకపోయారంటారు. ఇలా ఎందుకు జరిగిందో ఒక సారి ఆలోచించండని చెబుతూ మీ అబ్బాయికైనా మంచి భవిష్యత్‌ను ఏర్పాటు చేయండని సలహా ఇచ్చారు.

తరాలు మారాయని గుర్తించాలి...

తరాలు మారుతున్నాయని, ప్రాధాన్యతలు మారాయని గుర్తించకపోతే పెద్దలని కూడా చూడకుండా తొక్కుకుంటూ ముందుకు దూసుకుపోతారన్నారు సలాది. ముద్రగడ ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చారని పొగిడిన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ తాతను బేడీలు వేసి పోలీసులు తీసుకుని వెళ్లిన ఫోటోను 24 గంటల గడవక ముందే ప్రపంచానికి చూపించారని గుర్తుచేశారు. అది ఇప్పటి యువత ఘనత. అటువంటి యువత అంతా నిస్వార్ధపరుడు అయినటువంటి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెంట మద్దతుగా నిలబడుతుంది. అది మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ యూత్ ఆవైపే వెళ్తుంది అని గుర్తించడమే మనపని అంటారు సలాది. “లోగడ కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పబ్లిక్‌ ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌ ఈ జిల్లా (తూర్పుగోదావరి) నుంచి పోటీ చేస్తే ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టి ఓడించి తీరుతాను అని చెప్పియున్నాడు. మీరు అతని ఆధ్వర్యంలో ఎక్కడైనా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్న పరిస్ధితులకన్నా... ఇంకా చులకన అయిపోతారు మీరు” అని సున్నితంగా హెచ్చరించారు.

మీ తాత 700 ఎకాల భూస్వామి...

“మీ కుటుంబ నేపద్యం చూస్తే మీ తాతగారు పద్మనాభం సుమారు 700 ఎకరాల భూస్వామి. కిర్లంపూడి కేంద్రంగా చుట్టుప్రక్కల 10, 12 గ్రామాలకు మునసుబుగా వారు జీవితాంతం ఉన్నారు. మీ తండ్రి ముద్రగడ వీర రాఘవరావు 2 సార్లు ఎమ్మెల్యే. వీరు మీ ఆస్థిని 300 ఎకరాలకు తగ్గించారు... ఇప్పుడు మీకున్న ఆస్థి మాకు తెలిసిన ప్రకారం మీ ఇంటి చుట్టూ ఉన్న ఆస్థి సుమారు 7 లేక 8 ఎకరాలు తప్ప మీ నాన్నగారు ఇచ్చిన ఏ భూమి మీ వద్ద లేదు” అని వివరించారు సలాది.

కుల పోరాటాలు చేసి మీరు ఈ కులానికి ఏమి సాధించి పెట్టారు ?

కులపోరాటం చేసి మీరు కాపులకు చేసింది అన్యాయమేనన్నారు సలాది వెంకట రమణ. ‘ఈ కులాన్ని మీరు మీకు రాజకీయ గుర్తింపు లేని సమయాల్లో రోడ్డు ఎక్కించడం తదుపరి ఆపివేయడం, మమ్మల్ని అందరినీ పోలీసులు కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, మీరు పరామర్శించడం, ఇతర కులాలు ఈ కులాన్ని విరోధులుగా చూసే స్థాయికి తీసుకెళ్ళారు’ తప్ప చేసిందేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు సలాది. ’మనం కాపు రిజర్వేషన్‌ ఉద్యమం చేసే సమయంలో మా బోనం వెంకట చలమయ్య (B.V.C కాలేజ్‌ అధినేత) నాతో ఒక మాట అన్నారు. ఒరే రమణ ఎందుకురా ఈ బి.సి రిజర్వేషన్లు వీటి కోసం ఆందోళనలు తద్వారా యువకులను ప్రక్కదారి పట్టించడం... మన జాతిలో యువతీ యువకులు చక్కగా చదువుకుంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళితే ఏ రిజర్వేషన్లు అక్కర్లేకుండా సామాన్యుడు కూడా లక్షాధికారులు అవుతారు, అందుకే ఈ కాలేజ్‌లు నిర్మిస్తున్నాను. మనలో ఉన్నటు వంటి పెద్దలు ఇటువంటి కాలేజ్‌లు ఏర్పాటు చేసి యువతను ముందుకు తీసుకుని వెళితే భవిష్యత్‌లో మనకు రిజర్వేషన్లుతో పని లేదురా అని ఆయన అప్పట్లో అనడంలోని పరమార్ధం ఏమిటో నేను ఈ రోజు చూస్తున్నాను. ఇటువంటి విజన్‌ మీరు ఎందుకు ఆలోచించ లేదో నాకు అర్ధం కావడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరెప్పుడైనా కాపుల్ని ఆదరించారా?

‘మీరు మన కులంలో ఏ ఒక్క వ్యక్తి తమ తమ రంగాల్లో అభివృద్ధి చెందిన వారు మీ వద్దకు వస్తే మీరు వారిని ఎప్పుడు ఆదరించరు. దానికి ఉదాహరణ చిరంజీవి, దాసరి నారాయణరావు, తులసి రామచంద్రప్రభు లాంటి ఎందరో... పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు ఎందరో మీ వద్దకు వచ్చి సంఫీుభావం తెలిపినా... మీరు వారికి తగిన గుర్తింపు ఇవ్వరు. ఎందుకో మీకు ఇగో ఫీలింగ్‌ ఇక్కడ మెగా కుటుంబం గూర్చి కొన్ని విషయాలు చెప్పాలి. మీరు చెన్నారెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణం చేసిన 5వ రోజున... మాగంటి రవీంధ్రనాధ్‌ చౌదరితో చిరంజీవి, పద్మనాభాన్ని మా ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు తీసుకురావాలని ఆహ్వానించడం, దానికి మీరు, మీతో పాటు నల్లా సత్యనారాయణ మేమందరం కూడా మీతో పాటు చిరంజీవి ఇంటికి వెళ్ళినాం. ఆయన ఎంతో సాధరంగా ఆహ్వానించి మీతో ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. కానీ ఈ మధ్య లేఖలో మీరు మెగా కుటుంబం కులానికి ఏమి చేసింది అని అడుగుతున్నారు. రంగా చని పోయినప్పుడు చిరంజీవి విజయవాడ వచ్చేందుకు ప్రయతిస్తే అప్పటికే విజయవాడలో ఉన్న పరిస్ధితుల రీత్యా అక్కడకు వెళ్ళకూడదని ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు, చిరంజీవి సన్నిహితులు సూచనల మేరకు ఆయన ఆగారు, ఆ విషయం మీకూ తెలుసు. ఆ మరునాడు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ సంఘటనపై ఖండించి, తాను రాక పోవడంపై కారణాలు తెలియజేశారు. వాటికి సంబంధించి మెగా కుటుంబం కాపు కులానికి ఏ విధమైనటువంటి ఉపకారం చేయలేదని మీరు ఈ మధ్య లేఖలో ఉదహరించారు. ఇది న్యాయమా’ అని ప్రశ్నించా. ఏ సినీ నేపధ్యంలేని అతిసాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన చిరంజీవి నటప్రస్థానం స్వశక్తితో ఇంతటి ఉన్నత స్ధితిని సాధించారని, చిరంజీవి సినీ ప్రవేశం చేసేనాటికి సినీరంగంలో తమ జాతి 5 శాతం కూడా ఉండేది కాదని, అటువంటి చిరంజీవి తన ఎదుగుదలతో పాటు మన జాతిలో ఎంతో మందిని సినీ రంగంలో వివిధ శాఖల్లో ఉన్నత స్ధితిలోకి తీసుకుని వచ్చారని చెప్పుకొచ్చారు సలాది.

మీ వ్యక్తిగత రాజకీయ విధానాలను ప్రశ్నించుకోండి...

‘1978లో రాజకీయాల్లోకి వచ్చిన మీరు 1983 వరకు జనతా పార్టీలో ఉండి 6 మాసాలు ముందే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిడిపి పార్టీలో చేరి 1983 ఎమ్మెల్యేగా గెలిచారు. మిమ్మల్ని డ్రైనేజీ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. తర్వాత మీరు ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి కిర్లంపూడి వచ్చేశారు. నేను అప్పటికి హైదరాబాద్‌లో ఉన్నాను. తదుపరి నాదెండ్ల భాస్కరరావు వ్యవహారం జరిగితే మీరు ఎన్‌.టి రామారావుకి మద్దతుగా నిలబడి 1985లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. మిమ్మల్ని మొదటి క్యాబినేట్‌లో ట్రాన్స్‌పోర్టు మంత్రిగా నియమించారు. 1986లో విజయవాడ సిటిబస్‌లు వ్యవహారంలో మీరు కోపం ప్రదర్శించి మంత్రి పదవికి రాజీనామా చేసి కిర్లంపూడికి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చేశారు. అదే సమయంలో నేను మీ యర్రమంజిల్‌ మినిస్ట్రి క్వాటర్స్‌కి నేను వచ్చా. అప్పటికి లక్ష్మిపతి, చక్రపాణి, శివ, ఎల్లపు లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఏమిటి ఈ హడావిడి అని అడిగినాను మళ్ళీ రాజీనామా చేసేశారు, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణమవుతున్నారు అని వాళ్లు చెప్పారు. మీరు కారు ఎక్కినప్పుడు మేము అక్కడ ఉన్నాం. మళ్ళీ సంప్రదింపు.. కొంతమంది పెద్దలు దేవరపల్లి సూర్యారావు, బొడ్డు భాస్కర రామారావు వగైరా పెద్దలు వచ్చి మిమ్మల్ని శాంతింపజేసి మళ్ళీ ఎన్‌.టి.ఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు మిమ్మల్ని ఎక్సైజ్‌ శాఖకు మార్చారు. 1987లో కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎలక్షన్‌లో మీరు బొడ్డు భాస్కర రామారావుని ఛైర్మన్‌గా చేసే ప్రయత్నం చేశారు. మేము మెట్ల సత్య నారాయణరావుని ఛైర్మన్‌గా చేయాలని ప్రయత్నించాం. ఆ ప్రయత్నంలో భాగంగా బొడ్డు భాస్కర రామారావుని కోనసీమ అంతా ఏకమై డైరెక్టర్‌గా ఓడించాం. మీకు మండిపోయింది. నా మీద కూడా మీరు కేకలు వేశారు. మెట్ల సత్యనారాయణ రావుకి పదవి రాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ద్వారా ఎన్‌.టి.ఆర్‌ పై ఒత్తిడి తెచ్చి ఆకాశం శ్రీరామ చంద్రమూర్తిని సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా నియమించేలా చేశారు. మీరు ఎక్కడ రాజీనామా చేస్తారోనని ఆ నిర్ణయం తీసుకున్నారు. 1988 ప్రారంభంలో ఉత్తర కంచిలో జరిగిన చిన్న వివాదాన్ని అధికారంలో ఉన్న మీరు లౌక్యంగా పరిష్కరించవలసిన మీరు పత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా నిరాహార దీక్షా శిబిరం ఏర్పాటు చేసి మీ ప్రభుత్వంపై మీరే నిరసన తెలియజేశారు. ఆ ఉద్యమంలో కూడా మేము మీ నిర్ణయం ఏదైనా మీకు మద్దతుగా మీ వెనుక వచ్చాము. షరా మామూలే మరలా రాజీనామా చేశారు.

1988లో కాపునాడు ఉద్యమం...

1988లో కాపునాడు ఉద్యమం కాకినాడ ఆనంద భారతిలో ఆకుల శివయ్యనాయుడు, మిరియాల వెంకట్రావు, పోతుల సీతారామయ్య ఆధ్వర్యంలో మీరు ముఖ్య అతిధులుగా పాల్గొని విజయవాడలో కాపునాడుకి పిలుపు ఇచ్చారు. మీకు మద్దతుగా మా నల్లా సత్యనారాయణ మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి కోనసీమలో భారీగా జనాలను సమీకరించి వందలాది వాహనాల్లో మీ నాయకత్వంలో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మీరు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కె.జానారెడ్డి, కె.ఈ. కృష్ణమూర్తి కలిసి తెలుగునాడు పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తెలుగునాడు పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత రంగా హత్య అనంతరం జరిగిన 1989లో మీ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి మీ నియోజక వర్గంలో మిమ్మల్ని గ్రామాల్లో అన్ని వర్గాల వారు మిమ్మల్ని రోడ్డుపై చీరలు పరిచి పువ్వులు జల్లుతూ మిమ్మల్ని నడిపించారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలో మీకు ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా ? అంటూ లేఖ రాశారు సలాది వెంకట రమణ. ఇప్పుడీ లేఖ కోస్తా జిల్లాలలో సంచలనం సృష్టిస్తోంది. ఏ ఇద్దరూ కాపు నేతలు కలిసినా ఈ లేఖనే చర్చించుకుంటున్నారు.

Read More
Next Story