మోదీకి  ఈ సారైనా దక్షిణం అచ్చివస్తుందా?
x
Modi in Election tour

మోదీకి ఈ సారైనా దక్షిణం అచ్చివస్తుందా?

దక్షిణాదిలోని 131 సీట్లలో సగం గెలవడం బీజేపీకి సాధ్యమా? దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుందా? మోదీ గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?


మోదీ ఎన్నికల గేమ్ ప్లాన్ విస్తరణకు దక్షిణ భారతదేశమే చివరి మెట్టు. ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం.. 131 మంది లోక్‌సభ సభ్యులు. మోదీ టార్గెట్ 400 సీట్లకు పైబడి.. ఈ లక్ష్యం చేరాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల్సిందే. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కాంగ్రెస్ కంచుకోటలు. కర్నాటక కాస్త తడబడుతున్నా ఇప్పటికీ మిగతా నాలుగు రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్ఛేరి బీజేపీకి కొరుకుడు పడని ప్రాంతాలే. మోదీ బీజేపీకి నిర్దేశించిన 370 సీట్లు రావాలన్నా, ఎన్డీఏ కి ఇచ్చిన టార్గెట్ "400 ప్లస్" (400 సీట్లకు మించి) నినాదం సక్సెస్ కావాలన్నా దక్షిణాది నుంచి సీట్లు పెరిగితేనే సాధ్యం. అయితే అదంత సులువు కాదని, ఉత్తరాది రాష్ట్రాలను సంతృప్తి పరిచినంతగా దక్షిణాది రాష్ట్రాలను మెప్పించలేకపోతున్నామన్న విషయం బీజేపీ నాయకత్వానికి తెలుసు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ సాధించిన 400 ఫ్లస్ సీట్లను గెలిచి రికార్డు సృష్టించాలన్నది నరేంద్ర మోదీ వ్యూహం. అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలపై మోదీ పెట్టిన ఫోకస్.

కవిత అరెస్ట్ దేనికి సంకేతం...


తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పటి తన శత్రువు ఆ తర్వాత మిత్రువైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోదీ చేతులు కలిపారు. పొత్తు పెట్టుకున్నారు. కర్నాటకలోనూ చాలా తెలివిగా మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీతో సంధి కుదుర్చుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవితను అరెస్ట్ చేయించి ఆ పార్టీని పక్కకునెట్టి కాంగ్రెస్ తో నేరుగా పోటీకి సమాయత్తం అయ్యారు. ఈ ప్లాన్ లో భాగంగానే పీఎం మోదీ తరచూ తెలంగాణ సహా దక్షిణాదిలో పర్యటిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు తెలంగాణ వచ్చి పోయిన ఘటనలు ఉన్నాయి. చివరికి ఈవేళ అంటే మార్చి 18న కూడా జగిత్యాల వచ్చారు.

దక్షిణాది.. ప్రాంతీయ పార్టీలకు, కాంగ్రెస్‌కు కంచుకోటలు...

కొద్ది కాలం కిందట పార్లమెంటు సాక్షిగా కర్ణాటక ఎంపీ డీకే సురేష్.. “బీజేపీ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశం కోరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని” అన్నప్పుడు ఇదే మోదీ మండిపడ్డారు. దేశాన్ని చీల్చాలని చూస్తున్నారా అని పార్లమెంటులో చీల్చిచెండాడారు. కానీ, దేశ రాజధాని పాలనవిభాగంలో సౌత్, నార్త్ తేడా ఉంటుందని ప్రధానికి తెలియంది కాదు. అందుకే నరేంద్ర మోదీ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాజకీయ విస్తరణతో పాటు పాలన ప్రాధాన్యతలలో వ్యూహాత్మక మార్పు కనబడేలా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రాజకీయ మద్దతు కూడగట్టే పేరిట ఓపక్క ప్రయత్నాలు సాగిస్తూనే మరోపక్క ప్రాంతీయ ఆందోళనలకు బీజేపీ దూరమనే సంకేతాల్ని ఇవ్వాలనుకుంటున్నారు. దక్షిణాది పట్ల బీజేపీకి ఎటువంటి వివక్ష లేదని చెప్పడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ ను వెనక్కి నెట్టినా కమలానికి దక్కని చోటు..

సాంప్రదాయకంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకించి తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీలు లేదా కాంగ్రెస్‌కు కంచుకోటలుగానే ఉన్నాయి. అయినా ఇటీవలి కాలంలో బిజెపి చేసిన కొన్ని ప్రయత్నాల మూలంగా అది కర్నాటకలో పాగా వేయగలిగింది. తెలంగాణలో కూడా దాని పునాదిని విస్తరించుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో కలిసి కొన్ని సీట్లు సాధించగలిగినా పార్టీకి పట్టుందని చెప్పలేం. దానికి నిదర్శనం 2019 ఎన్నికలే. 2014లో చంద్రబాబు క్యాబినెట్ లో ఇద్దరు మంత్రులుంటే 2019 ఎన్నికల్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.



ఇప్పటి టార్గెట్ మాత్రం 400 సీట్లే...

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 370 లోక్‌సభ సీట్లు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 సీట్లకు మించి గెలవాలన్నది బీజేపీ వ్యూహం. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రధాని మోదీ దక్షిణాదిపై దృష్టి సారించారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా దక్షిణాది భారత దేశ విశిష్టతలను ఆయన పార్లమెంటు లోపల, బయట కూడా నొక్కి చెప్పడం ప్రారంభించారు.

సౌత్, నార్త్ తేడా లేదని చెప్పడానికేనా..

జాతీయ స్థూల ఉత్పత్తికి (జీడీపీ) గణనీయంగా తోడ్పడుతున్న దక్షిణాది పట్ల వివక్ష లేదని- అవకాశం దొరికిన ప్రతిసారీ చెబుతున్నారు ప్రధాని మోదీ. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ఆర్ధికంగా బలమైన రాష్ట్రాలన్న భావన ఉత్తరాదిలో ఉంది. ప్రణాళికాపరమైన పారిశ్రామికాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న ఐటీ సెక్టార్లు, నగరీకరణ, ఇతర సేవారంగాలలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని బీజేపీ గుర్తించింది. మౌలిక వసతుల కల్పిస్తున్నందునే ఈ తరహా అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని మోదీ చెప్పాలనుకుంటున్నారు. తద్వార మార్పు కోరుతున్న తరాన్ని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.

సాంస్కృతిక తేడాలు సహా ఎన్నో అవరోధాలు...

అయితే ఇదంత సులువు కాదు. దక్షిణాది వైపు మోదీ చూపు మొదలు పెట్టినా చాలా అడ్డుగోడలు ఉన్నాయనేది చారిత్రక సత్యం. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపులు, సున్నితత్వాలు కలగలిపి ఉంటాయి. దేశభక్తి ఎంత మెండో దైవభక్తి కూడా అంతే ఎక్కువ. గ్రామ దేవతల సంస్కృతి, దాని నుంచి పండుగలు ఎక్కువ. ఇప్పుడు వాటిని కలుపుకొని పోవడానికి మోదీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాంతీయ ఉత్సవాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లినపుడు స్థానిక భాషల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంకేతాలు, సంజ్ఞలు చేస్తూ తామూ దక్షిణాదిలో భాగమే అనే ప్రయత్నం చేస్తున్నా అదంత సులభసాధ్యమైతే కాదు. భౌగోళిక రాజకీయ తేడాల ప్రభావం కూడా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలతో, ముఖ్యంగా తమిళనాడుతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అనుకోవడం వెనుక వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయని స్థానిక నేతల్ని నమ్మించడానికి చాలా కాలమే పట్టవచ్చు. భాషా, సాంస్కృతిక వైవిధ్యం, ప్రాంతీయత, చారిత్రక రాజకీయ అనుబంధాలు బిజెపి విస్తరణ ప్రయత్నాలకు అడ్డంకులుగా ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు వంటి సున్నితాంశాలు ఉండనే ఉన్నాయి.

నేను మీ వాణ్ణే అనే చెప్పడానికేనా...

ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో రామమందిరం 'ప్రాణ్ ప్రతిస్థాన్' వేడుకకు ముందు ప్రధాని మోదీ దక్షిణాది ఆలయాలను అనేకసార్లు సందర్శించారు. ఈ సందర్శనల వెనుక కూడా రాజకీయ ప్రయోజనమే ఉండి ఉండవచ్చునన్నది ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డి.పాపారావు అభిప్రాయం. రామమందిరం ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచే ఆయన దక్షిణాదిలోని వివిధ రాష్ట్రాలను పర్యటించారు. వీరభద్ర దేవాలయం, ఆంధ్రప్రదేశ్ - జనవరి 16న, గురువాయూర్ ఆలయం, కేరళ - జనవరి 17న, త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయం, కేరళ - జనవరి 17న, రంగనాథస్వామి ఆలయం, తమిళనాడు - జనవరి 20న ప్రధాని సందర్శించి 21న అయోధ్య వెళ్లారు.

ఇక రాజకీయ పర్యటనలకైతే లెక్కేలేదు...

మార్చి 5న తెలంగాణలోని సంగారెడ్డిలో వివిధ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. సంగారెడ్డిలో 6,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. తెలంగాణాలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ప్రధానమంత్రి ప్రార్థనలు చేశారు. మార్చి 4న కల్పక్కం ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. ఫిబ్రవరి 29న విక్షిత్ భారత్, విక్షిత్ మధ్యప్రదేశ్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఫిబ్రవరి 28న తూత్తుకుడి (ట్యూటికోరిన్)లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.


ఫిబ్రవరి 27న మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రధానమంత్రి ప్రార్థనలు చేశారు. కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మోదీ ప్రసంగించారు.

పవర్ గేమ్ లో భాగమేనా....

దక్షిణాదిలో పాగా వేయాలన్న సంకల్పంతోనే ఈ బహుముఖ వ్యూహాన్ని రూపొందించి ఉండవచ్చు. రాజకీయ ఏకీకరణ, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక ఏకీకరణ, భౌగోళిక రాజకీయ స్థానాలను లక్ష్యంగా చేసుకునే ఈ వ్యూహాన్ని రచించి ఉండవచ్చు. "మేము దక్షిణ భారతదేశంలో పట్టు కోసం పని చేస్తున్నాం. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ పై దృష్టి సారించాం. మేము కచ్చితంగా ప్రజలతో కలిసి వారి వాయిస్ వినిపించడానికి ప్రయత్నిస్తున్నాం. కొంత సమయం పట్టవచ్చు గాని సౌత్‌లో కచ్చితంగా పట్టుసాధిస్తాం" అన్నారు ఓ ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి, తమిళనాడు వాసి, ఆంధ్రవారి కోడలు అయిన నిర్మలా సీతారామన్. ఉత్తరాది హిందీ హార్ట్‌ల్యాండ్‌లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు దక్షిణాదిలో కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. ఇదే అదునుగా బీజేపీ పావులు కదుపుతోంది.

దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఎన్నంటే..

దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 20 లోక్ సభ సీట్లు, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణలో 17, కర్నాటకలో 28, పుదుచ్ఛేరిలో ఒక సీటు ఉన్నాయి. ఈ 131 సీట్లలో కనీసం సగానికిపైగా సీట్లను గెలిస్తే గాని బీజేపీ అనుకున్న 400కి మించిన టార్గెట్ నెరవేరదు. గత పార్లమెంటు ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. పుదుచ్చేరి నుంచి ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు. కర్నాటకలోని 28 సీట్లలో 25 సీట్లు గెలిచింది. తెలంగాణలో 4 గెలిచింది. ఏపీలో ఒక్క సీటూ గెలవకపోయినా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ దాదాపు ఎన్డీఏ పక్షంగానే వ్యవహరించాయి. కర్నాటక, తెలంగాణ, కేరళ మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్న బీజేపీకి ఏపీలో ఏ పార్టీ గెలిచినా ఆ 25 సీట్లు వాళ్ల ఖాతాలోనే పడతాయి. కేరళలో కాంగ్రెస్ హవా కొనసాగితే సీట్లు తగ్గుతాయి. తెలంగాణలో గతంలో 4 సీట్లు గెలిచింది, ఈసారి పూర్తి స్థాయిలో కేంద్రీకరించినందున సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. కేరళ, తమిళనాడు, ఏపీలో ఖాతా తెరిస్తే బీజేపీ ప్రయత్నం సక్సెస్ అయినట్టే.

Read More
Next Story