
జయలలిత నగలిచ్చేస్తాం.. ఆరేడు సూట్ కేసులు తెచ్చుకోండి!!
అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలింది. నాలుగేళ్ల జైలు శిక్ష పడిన దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆమె మరణించారు. మరణించిన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె నగలు బయటికొస్తున్నాయి..
‘రాజుల సొమ్ము రాళ్ళ పాలు’ ‘జయలలిత సొమ్ము సర్కారు పాలంటే’ ఇదేనేమో.. అష్టకష్టాలు పడి రూపాయి.. రూపాయి కూడబెట్టింది. సినీనటిగా ఎంతపేరు తెచ్చుకున్నారో ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగానూ అంతే పేరు తెచ్చుకున్నారు. జీవితంలో చీకటి వెలుగులున్నట్టే పేరుప్రతిష్టల వెనుకే వాటిని మసకబార్చే పనులూ ఉంటాయి. సరిగ్గా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకూ అదే జరిగింది.
ఆదాయానికి మించిన ఆస్తులు..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. కోర్టులకు వెళ్లారు. జైళ్ల పాలయ్యారు. చివరకు ఆ క్షోభతోనే కన్నుమూశారు. ఇప్పుడా డబ్బు, నగలు, డైమండ్లు, వెండి, బంగారం వంటివన్నీ కోర్టుల్లో మూలుగుతున్నాయి. వీటిని కాపాడడం మా వల్ల కాదంటూ కర్నాటక ప్రభుత్వం చేతులెత్తేసింది. బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టుకు ఆ విషయాన్ని తెలియజేసింది. దీంతో కర్నాటక సివిల్ కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘మీ సొత్తు మీరు తీసుకెళ్లండి. మేము కాపాడలేకపోతున్నాం. ఇప్పటి వరకు కాపలా కాసినందుకు మాకో ఏడు కోట్లు కట్టండి. ఏడు సూట్ కేసులు తెచ్చుకోండి’ అని కోర్టు వారి తరఫున కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
14 ఏళ్లపాటు తమిళనాడు రాజకీయాలను శాసించడంతో పాటు.. దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయలలిత. కానీ.. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో దోషిగా తేలారు. అటు రాజకీయ విమర్శలు.. ఇటు కేసుల ఇబ్బందులకు తోడు అనారోగ్యం ఆమెను మరింతగా కుంగదీసింది. ఈ క్రమంలోనే కన్నుమూసిన జయలలిత మరణం కూడా ఓ వివాదస్పంగానే మారింది.
ఇదీ ఆమె నేపథ్యం....
జయలలిత జయరామం. 1948 ఫిబ్రవరి 24న కర్నాటకలోని ఓ సంప్రదాయ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. బెంగళూరులో చదువుతోపాటు పలు నృత్యరీతులను నేర్చుకున్న ఆమె... కర్నాటక సంగీతాన్ని కూడా అభ్యసించారు. నటనపై ఉన్న మక్కువతో తొలుత నాటకాలు ప్రారంభించిన జయలలిత.. హీరోయిన్ స్థాయికి ఎదిగారు.
నాలుగు భాషల్లో మంచి పట్టు...
నాలుగు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన ఆమె.. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించారు. 1981లో అన్నాడీఎంకేలో చేరిన ఆమె.. 1984లో తొలిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమస్యలపై పోరాటం చేసే తత్వం, మంచి వాగ్ధాటి ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. తమిళనాడు సమస్యలపై పార్లమెంట్‌లో పలు సార్లు ఆమె గళమెత్తిన తీరుతో ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు జయ.
ఎంజీఆర్ వారసురాలిగా...
ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రకటించుకున్న జయలలిత... అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు. 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. అతిచిన్న వయసులో సీఎం అయిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు జయలలిత. టాన్సీ భూముల కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో... 2001 ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. 2002లో ఆ కేసులో విడుదలైన జయలలిత.. ఆడింపట్టి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
పడి లేచిన కెరటం జయలలిత...
2011లో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత... 2014లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చడంతో మరోసారి సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే.. 2015లో ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన జయ.. తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 2016 ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి మే నెలలో సీఎం పీఠాన్ని అధిష్టించారు.
కానీ.. అదే ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యానికి గురైన జయలలిత.. 74 రోజులపాటు మృత్యువుతో పోరాడారు. 2016 డిసెంబర్ 5న పరిస్థితి విషమించడంతో ఆమె కన్ను మూశారు. ఆ తర్వాత.. ఆమె మృతి నుంచి వారసత్వం వరకు అన్నీ వివాదాస్పదమే అయ్యాయి.
మార్చి 6,7 తేదీల్లో ఆస్తుల మార్పిడి..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 27 కేజీల బంగారం, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6, 7 తేదీల్లో ఆ రాష్ట్ర హోం కార్యదర్శికి అందజేస్తామని బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు ప్రకటించింది. ఆమెపై విధించిన రూ. 100 కోట్ల జరిమానా చెల్లించడానికి ఆమె ఆస్తులను అమ్మి కట్టమని కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలింది. నాలుగేళ్ల జైలు శిక్ష పడిన దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆమె మరణించారు. మరణించిన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె నగలను, ఇతరత్రా వస్తువులను కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించబోతోంది.