
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే..
బీజేపీతో పొత్తు ఉండదన్న జేడీ(ఎస్) చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ..
కర్ణాటక(Karnataka) రాజకీయాల్లో బీజేపీ(BJP)-జేడీ(ఎస్) పొత్తు కొనసాగుతున్న తరుణంలో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల(Local body polls)కు సంబంధించి మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ(HD Deve Gowda) ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బెంగళూరులో విలేఖరులతో దేవెగౌడ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో JD(S) ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిలో భాగమైన జేడీ(ఎస్).. స్థానిక సంస్థల ఎన్నికలలో "ఒంటరిగా" పోటీ చేయాలని నిర్ణయించుకుంది. పార్టీ ఉనికి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
"స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల గురించి ప్రధాని మోదీతో లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించలేము. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ సీట్ల పంపకాల గురించి మాత్రమే మేం వారితో చర్చిస్తాము" అని చెప్పారు. స్థానిక ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడమే మా ముందున్న ప్రధమ కర్తవ్యం’’ అని అన్నారు.
శాసనమండలిలోని నాలుగు స్థానాలకు ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మూడు స్థానాలను బీజేపీకి, ఒక స్థానాన్ని జేడీ(ఎస్)కు ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవేగౌడ తెలిపారు.
"బీజేపీ సొంత బలంతో గెలుస్తుంది" అని రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రకటనకు దేవెగౌడ వ్యంగ్యంగా స్పందించారు. విజయేంద్ర పేరును ప్రస్తావిస్తూ, "విజయేంద్ర ఇప్పుడు చాలా ఉత్సాహంగా పరిగెడుతున్నాడు, యువ స్టార్ లాగా పనిచేస్తున్నాడు" అని గౌడ చమత్కరించారు.
‘దాడులు సరికావు’..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో చర్చిలపై జరుగుతున్న దాడుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
"ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా ఖండించదగినవే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ కూడా ఇలాంటి సంఘటనలపై దృష్టి పెట్టాలి. ప్రధాని నిన్ననే ఒక చర్చిని సందర్శించారు. ఇది కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగడం లేదు. ఎక్కడైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని కోరారు.
పార్టీ సమావేశాలు..
జేడీ(ఎస్)ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనవరి 18న బెంగళూరులో, జనవరి 23న హసన్‌లో భారీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాబోయే ఎన్నికలకు పార్టీ తన కార్యకర్తలను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

