
కమల్ హసన్
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హసన్
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి థగ్ లైఫ్ సినిమా విడుదల విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న నటుడు
కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురైన కమల్ హసన్ థగ్ లైఫ్ సినిమా విషయంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కాదని చెప్పడంతో ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
తమిళం నుంచి కన్నడ పుట్టిందని వ్యాఖ్యలు చేయడమే కాకుండా, క్షమాపణలు చెప్పబోనని తెగేసీ చెప్పడంతో కర్ణాటకలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వమని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఫిల్మ్ ఛాంబర్ వ్యతిరేకత..
నటుడు క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో విడుదల కాబోదని కేఎఫ్సీసీ అధ్యక్షుడు ఎం. నరసింహులు అన్నారు. ఇది చిత్రపరిశ్రమ గురించి కాదు, రాష్ట్రం గురించి అని ఆయన అన్నారు.
ఈ సినిమా విడుదలను రాజకీయ పార్టీలు, కన్నడ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, కన్నడ నటుల స్పందన కోరుతున్నాయని ఆయన చెప్పారు. కమల్ క్షమాపణ చెప్పకుండా కర్ణాటకలో సినిమా విడుదల కాకుండా విడుదల కావడం కష్టమని అన్నారు.
థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ సందర్బంగా వివాదం మొదలైంది. కమల్ మాట్లాడుతూ.. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అన్నారు. ఇది కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. కర్ణాటకలో బద్దవిరుధులైన కాంగ్రెస్, బీజేపీ సైతం కమల్ పై మూకుమ్మడిగా విమర్శలు గుప్పించాయి.
నాయకుల విమర్శలు..
కన్నడ భాష గొప్ప చరిత్ర గురించి కమల్ కు తెలియదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక బీజేపీ చీఫ్ బివై విజయేంద్ర తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తమిళనటుడు మాత్రం తాను క్షమాపణ చెప్పేది లేదని ప్రకటించారు.
‘‘ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించాలి. కానీ దాని ముసుగులో అహంకారాన్ని ప్రదర్శిస్తే చాలా ప్రమాదకరం. అది సాంస్కృతికంగా దివాలా తీసినట్లే. ముఖ్యంగా కళాకారులకు ప్రతి భాషను గౌరవించే తత్వాన్ని కలిగి ఉండటం చాలా అవసరం’’ అన్నారు.
తనకు చట్టంపై నమ్మకం ఉందని, తనను వ్యతిరేకించే వారికి ప్రత్యేక ఎజెండా ఉందని ఆయన విమర్శించారు. ‘‘కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ పట్ల నాకు ఉన్న ప్రేమ నిజమైనది. ఎజెండా ఉన్నవారు తప్ప ఎవరూ దీనిని అనుమానించరు’’ అని కమల్ చెప్పినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తాను గతంలో బెదిరింపులను ఎదుర్కొన్నానని, తాను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని కూడా ఆయన అన్నారు.
Next Story