ఏపీలో కాక పుట్టిస్తున్న కాపు రాజకీయం!
x
ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య, పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటోలు)

ఏపీలో కాక పుట్టిస్తున్న కాపు రాజకీయం!

ముద్రగడ, చేగొండి హరిరామజోగయ్యకు ఏమి కావాలి? వాళ్లిచ్చే సలహాలు ఇప్పటి కాపు యువతకు నిజంగానే కావాల్నా? కాపు యువత వాళ్లిద్దర్నీ దాటి చాలా ముందుకెళ్లిందా?


తెలుగునాట కాపు రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కేంద్రంగా లేఖల యుద్ధం ఓ పక్క మాటల తూటాలు మరోపక్క పేలుతున్నాయి. అటు సొంత సామాజిక వర్గం నుంచి ఇటు ప్రత్యర్థి వర్గం, పార్టీల నుంచి కూడా పవన్ కల్యాణ్ విమర్శలు, ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం తెలుగు జన జెండా సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఈ మంటలకు కారణం. ‘తనకు ఎవరి సలహాలు, సూచనలు అవసరం లేదు. నన్ను ప్రశ్నించని వారే నా వెంట ఉండండి, లేదంటే మీ ఇష్టం’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన మాట అటు కాపు సామాజిక కురువృద్ధులకు ఇటు ప్రత్యర్థిపార్టీ వైసీపీ-లోని పేర్ని నాని, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ వంటి వారికి ఆగ్రహం తెప్పించినట్టు కనిపిస్తోంది. సలహాలు తనకు ఇవ్వద్దని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నా... ఆయనకు సూచనలు, సలహాలు ఆగడం లేదు. ఆయనపై విమర్శలు తగ్గడం లేదు. బహిరంగలేఖల రూపంలో పవన్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు కాపు నేతలు. వరుసగా ఒకరి వెంట ఒకరు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ తీరును తప్పుపడుతూ మాజీ మంత్రులు హరి రామజోగయ్య, ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రాలు సంధించారు.

నీ ఖర్మ.. ఇక నేనేమీ చేయలేను...

కాపు సంక్షేమ సేన అధ్యక్షులయిన చేగొండి హరిరామజోగయ్య పవన్‌, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తిట్లూ, శాపనార్థాలు పెడుతూ లేఖ రాశారు. టీడీపీ, జనసేన బాగుకోరి తానిచ్చే సలహాలు అధినాయకులిద్దరికీ నచ్చినట్టు లేదన్నారు. ‘ఇక, వారి ఖర్మ అని..తాను చేయగలిగింది’ ఏమీ లేదని లేఖలో రాశారు.

ముద్రగడ మండిపాటు...

ముద్రగడ పద్మనాభం కూడా పవన్‌పై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. ఆయన కూడా పెద్ద లేఖే రాశారు. కిర్లంపూడిలో తన నివాసానికి వస్తానని కబురు పంపి రాలేదన్నది ముద్రగడ ఆక్రోశంగా ఉంది. పవన్‌పై ఆయనా బాగానే విరుచుకుపడ్డారు. ‘పవన్‌ నిర్ణయాలు ఆయన చేతుల్లో ఉండవు. ఎంతోమంది దగ్గర పర్మిషన్‌ తీసుకుని రావాలి. ఆయన (పవన్) మా ఇంటికి వస్తారన్నారు. మంచిది రమ్మన్నా. రెండు నెలలుగా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. జనసేన పోటీ చేసే 24 స్థానాల కోసం తన అవసరం రాదు, రాకూడదని కోరుకుంటున్నా’ అని ముద్రగడ సెటైర్లు వేశారు.

నాకేమీ కోరికలు లేవన్న ముద్రగడ..

’నాకు ఎలాంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా పనిచేసేందుకు సిద్ధ పడ్డా. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గతం, అవమానాలు, బాధలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి పని చేసేందుకు సిద్ధమయ్యా’ అన్నారు ముద్రగడ. కానీ.. పవన్‌ లాగా తనకు గ్లామర్, పరపతి లేదని.. అందుకే తుప్పుపట్టిన ఇనుములా తనను లాస్ట్‌ గ్రేడ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు ముద్రగడ.

అసలు వీళ్లకు ఏమి కావాలి..

ప్రత్యర్థి పార్టీ వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శించడం ఇదే కొత్తా కాదు, ఇదే ఆఖరు కూడా కాదు. పవన్ కల్యాణ్ ఏది చెబితే దానికి విరుద్ధంగా మాట్లాడడం వారి పార్టీ వైఖరి. కాపుల ఓట్లను చీల్చి, టీడీపీ వైపు మళ్లకుండా చూడాలన్నది వైసీపీ నేతల వైఖరి కనుక వాళ్లు విమర్శలు చేయడాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు గాని కాపు సామాజిక వర్గానికి పెద్దలుగా ఉన్న ఈ ఇద్దరు- చేగొండి, ముద్రగడ.. పవన్ కల్యాణ్ కి చేవిలో జోరీగలలాగా ఎందుకు తయారయ్యరన్నది పెద్ద ప్రశ్నే. అన్ని రాజకీయపార్టీల్లో పనిచేసిన గొప్ప అనుభవం ఉన్న కాపు జాతీయ నాయకులు ముద్రగడ, చేగొండి హరిరామజోగయ్య అసలు జనసేనాని మేలు కోరుకుంటున్నారా? లేక తమ మాదిరిగా కల్యాణ్‌ బాబు కూడా చివరికి కాపు జాతి నాయకుడిగా మిగిలిపోవాలని కుట్రలు పన్నుతున్నారా? అనే అనుమానం ఉభయ గోదావరి జిల్లాలు సహా కోస్తా జిల్లాలకు చెందిన కాపు యువకులను చాలా గట్టిగా పీడిస్తోంది.

ముద్రగడ, చేగొండిని దాటి కాపులు ముందుకెళ్లారా?

‘కాపు జాతి’ అనే మాటను తొలిసారి వాడిన ముద్రగడను పట్టించుకునే నాథుడే లేడు. అధికారంలో ఉన్నప్పుడు కాపుల గురించి ఏనాడూ పట్టించుకోని నాయకుడిగా హరిరామజోగయ్యకు పేరుందన్నది ఓ కాపు నాయకుడి వ్యాఖ్య. కాపులు ఎక్కువగా ఉన్న నర్సాపురం–పాలకొల్లు ప్రాంతంలో కుటుంబ మూలాలున్న పవన్‌ కల్యాణ్‌ కూడా జోగయ్య మాటలను పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ‘తనకు, తన పార్టీకి ఎవరి సలహాలతో పని లేదనీ, కాపులకు ద్రోణాచార్యుడు, వశిష్ఠుడు వంటి రాజగురువుల అవసరం లేదన్నట్టు మాట్లాడడం కాపు రాజ్యాధికార రాజకీయాలు- 2008–2011 నాటి కొణిదెల చిరంజీవి, పీఆర్పీల ఎత్తుగడలను, ప్రమాణాలను, పోకడలను దాటి చాలా చాలా ముందుకొచ్చేశాయని స్పష్టమౌతోంది’ అన్న సీనియర్ జర్నలిస్టు ఎం.నాంచరయ్య వ్యాఖ్య నిజమేమో అనిపిస్తుంది.

Read More
Next Story