
కులవివక్ష నిర్మూలనకు ముసాయిదా తయారుచేయాలన్న కర్ణాటక సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖకు స్పందించిన సిద్ధరామయ్య..
విద్యా సంస్థల్లో కుల వివక్షను నిరోధించేందుకు రోహిత్ వేముల చట్టం ముసాయిదాను సిద్ధం చేయాలని తన న్యాయ సలహాదారు బృందాన్ని ఆదేశించారు కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah).
దళిత విద్యార్థులెవరూ వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించి..అమలు చేయాలని లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల సిద్ధరామయ్యకు లేఖ రాశారు. 2016లో కుల వివక్ష కారణంగా రోహిత్ వేముల అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో మంచి భవిష్యత్తు ఉన్న యువకులు రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎదుర్కొన్న ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ.
కుల వివక్ష నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇస్తూ.."దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి మనం చేతులు కలపాలి. అణగారిన వర్గాలు ఇకపై మన విద్యా వ్యవస్థలో ఎటువంటి వివక్షను ఎదుర్కోకూడదు" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. "విద్యా సంస్థలలో వివక్షను నిరోధించే చట్టం రోహిత్ వేముల చట్టం ముసాయిదాను సిద్ధం చేయాలని నా న్యాయ సలహాదారు, బృందానికి సూచించాను" అని చెప్పారు.