వక్ఫ్ భూముల వివాదంపై రైతులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అభయం..
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రైతుల భూములను లాక్కోవడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రైతుల భూములను లాక్కోవడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కొంతమందికి జారీ చేసిన నోటీసులను కూడా వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వివాదం ఏమిటి?
విజయపురలోని హోన్వాడ గ్రామంలోని రైతులకు అక్టోబర్ 4న తహసీల్దార్ నుంచి లేఖ అందింది. తమ పూర్వీకుల భూమిలో 1500 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు రీ అసైన్డ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీంతో విజయపుర జిల్లాలో తీవ్ర దుమారం రేగింది. బీజేపీ రంగంలోకి దిగింది. గతంలో 1.12 లక్షల వక్ఫ్ భూముల్లో ప్రస్తుతం 23,860 ఎకరాలు మాత్రమే వక్ఫ్ ఆధీనంలో ఉందని కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. రైతుల భూములను వక్ఫ్ స్వాధీనం చేసుకుంటుందనే వాదనను ఆయన కొట్టిపారేశారు.
మరోవైపు విజయపుర జిల్లాలోని ఇండి, చడచన్ తాలూకాల పరిధిలోని 44 ఆస్తులకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వక్ఫ్ పేరును భూ రికార్డుల్లో చేర్చారని బీజేపీ ఆరోపించింది. ఖాన్, జిల్లా అధికారుల మధ్య సమావేశం జరిగిన తర్వాత ఇది జరిగిందని బీజేపీ ఆరోపించింది. సరైన నోటీసు లేకుండా వక్ఫ్‌కు అనుకూలంగా ఇటీవలి భూ మ్యుటేషన్‌లపై, హక్కులు, కౌలు మరియు పంటల రికార్డు (ఆర్‌టిసి)లోని కాలమ్ 11లో 41 అనధికారిక మార్పులు జరిగాయని కాంగ్రెస్ నాయకుడు ఎంబి పాటిల్ ధృవీకరించారు. ఇంకా ఈ రికార్డులను సరిచేయాలని డిప్యూటీ కమిషనర్ (డిసి)ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అదనంగా, తగిన నోటీసు లేదా ప్రక్రియ లేకుండా మార్పులను అనుమతించినందుకు సంబంధిత తహసీల్దార్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టికోటా తాలూకాలోని హోనవాడలో 1,200 ఎకరాలు వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన తరువాత గెజిట్ నోటిఫికేషన్‌లో “తప్పు” కారణంగా ఇది జరిగిందని పాటిల్ స్పష్టం చేశారు.
రైతులకు సీఎం భరోసా
ఒకవేళ కొంతమంది రైతులకు నోటీసులు జారీ చేస్తే వాటిని వెనక్కి తీసుకుంటామని సీఎం తెలిపారు. యాద్గిర్, ధార్వాడ్ జిల్లాల్లోనూ ఇదే తరహాలో రైతులకు నోటీసులు జారీ చేశామని, దీనిని పరిశీలించాల్సిందిగా రెవెన్యూ మంత్రిని కోరతానని, ఎక్కడా రైతులను తొలగించబోమని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, గెజిట్ లోపం వల్లే వక్ఫ్ వివాదం ఏర్పడిందని భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.