కర్నాటక: గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్, బీజేపీ
x

కర్నాటక: గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్, బీజేపీ

ఈసారి ఎంపీ ఎన్నికల్లో 2019 కంటే మంచి ఫలితాలు సాధించాలని బీజేపీ, కనీసం 20 సీట్లు సాధించాలని కాంగ్రెస్ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి.


సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈసారి ఎలాగైన కనీసం20 స్థానాలు గెలవాలని కాంగ్రెస్, 2019 నాటి కంటే మెరుగైన ఫలితాలు ఓట్లు రాబట్టాలని బీజేపీ.. ఇలా ఎవరికి వారు తమకు సాధ్యమైన లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి అడుగులను జాగ్రత్తగా గమనిస్తూ, గెలుపు గుర్రాలను వెతికే పనిలో ఇరు పార్టీలు బిజిబిజీగా ఉన్నాయి.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభీ మోగించింది. తాజాగా జరిగే లోక్ సభ ఎన్నికల్లోను ఇలాగే విజయం సాధించాలని అనుకుంటోంది. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అఖండ విజయం సాధించింది. మొత్తం 28 స్థానాలకు గాను 25 ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క సీటు కు మాత్రమే పరిమితం అయింది. అయితే ఈ సారి ఫలితం మాత్రం అలా ఉండకూడదని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణాదిలో బీజేపీకి కంచుకోటగా ఉన్న దీన్ని దెబ్బతీయాలని కసిగా ప్రయత్నాలు ప్రారంభించింది.
అదే సమయంలో బీజేపీ కూడా తన ప్రయత్నాలు సైతం ముమ్మరం చేసింది. మూడో సారి వరుసగా అధికారం చేపట్టి ప్రధాని పీఠంపై మోడీని కూర్చోబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అయినప్పటికీ తనకున్న ఓటు బ్యాంకును మాత్రం అలాగే కాపాడుకుంది.
లోక్ సభ ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ఆచితూచి అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
కాంగ్రెస్ హై కమాండ్
రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు తరువాత ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసే స్క్రీనింగ్ కమిటీ రెండోసారి సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కర్నాటక ఇన్ చార్జీ రణదీప్ సూర్జేవాలా అధ్యక్షత వహించారు. దాదాపు 23 మంది అభ్యర్థుల వివరాలను పార్టీ హై కమాండ్ కు పంపినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
అన్ని కుదిరితే వారం రోజుల్లో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక ఎంపీగా ఉన్న డీకే సురేష్ నివాసంలో విందు సమావేశం జరిగింది. దీనికి పార్టీ సీనియర్ నేతలంతా హజరయ్యారు. సురేష్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు. ఇందులో మొత్తం 28 స్థానాల గెలుపు పై చర్చించినట్లు సమాచారం అందుతోంది. లోక్ సభ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు సైతం ఆయా స్థానాల్లో పనిచేయాలని, వారు పని చేసిన చోట ఓడిపోతే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరిక అందినట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపికలో చిక్కులు
బెంగళూర్ సిటీ సహ దాదాపు పది స్థానాల్లో అభ్యర్థులను గుర్తించడంలో కాంగ్రెస్ ఇంకా సమస్యలు ఎదుర్కొంటోందని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చూస్తున్న పార్టీ నాయకత్వం మంత్రులను సైతం పోటీలో నిలపాలని అనుకుంటోందట. ఎంపీ ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే లు కలిసి గెలుపుపై చర్చించారని సమాచారం. కనీసం 20 స్థానాలు గెలవాలని ఖర్గే వీరికి సూచించినట్లు తెలుస్తోంది.
మంత్రులు పోటీ చేస్తారు..
తుమకూరు ఎంపీగా సహకార శాఖ మంత్రి కేఎన్ రాజప్ప, బెళగావి నుంచి పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కీహోళి, చామరాజనగర్ నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ సీ మహదేవప్ప, కోలార్ నుంచి ఆహార పౌర సరఫరాల మంత్రి కే హెచ్ మునియప్ప, బీదర్ నుంచి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, హవేరి నుంచి ఎమ్మెల్సీ సలీం అహ్మద్, మైసూరు- కొడగు నుంచి సీఎం కుమారుడు యతీంద్ర పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మహదేవప్ప ఎంపీగా పోటీ చేస్తానని చెబుతూనే తన కుమారుడు ఎమ్మెల్యే సునీల్ బోస్ ను మంత్రిగా చేయాలని, మరో మంత్రి మునియప్ప తన కుమార్తె కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళను మంత్రి చేయాలని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.
బీజేపీ ప్రణాళికలు
బీజేపీ, జేడీఎస్ పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ మాండ్య, హాసన్, బెంగళూర్ రూరల్, కోలార్, చిక్క బల్లాపూర్ స్థానాలను కోరింది. ఇవి కాకుండా 23 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. అనంతరం తొలి జాబితాను విడుదల చేస్తారని, 25 మంది సిట్టింగ్ ఎంపీలలో 15 మందికి తిరిగి టికెట్ రావచ్చని ఒక బీజేపీ నాయకుడు ఫెడరల్ కు చెప్పారు.
"కొంత అనారోగ్య కారణాల రీత్యా పోటీ నుంచి స్వచ్చందంగా తప్పుకుంటారు. మరికొంతమంది ప్రజాదరణ కొల్పోయారు" అని ఆయన చెప్పారు. మార్చి 13 నాటికి ఎన్నికల షెడ్యుల్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 10 నాటికే జాబితా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే చాలా మంది ఆశావహులు తమకు ఈసారి ఎంపీ టికెట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు.
కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, రమేష్ జిగజినాగి తిరిగి పోటీ చేయరని పుకార్లు వచ్చాయి. దీనిపై వారు మాట్లాడుతూ.. తాము ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు. మంత్రి జోషి ధార్వాడ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. విజయపుర నుంచి రమేష్ ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైయ్యారు.
ప్రత్యక్ష ఎన్నికల్లోకి జైశంకర్, నిర్మలా సీతారామన్?
చాలారోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిని వెల్లడించినప్పటికీ బీజేపీ వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. జగదీష్ శెట్టర్ తిరిగి బీజేపీలోకి చేరినందున ఆయనను ధార్వాడ్ నుంచి ఎంపీగా బరిలోకి దింపవచ్చని, జోషిని ఉత్తర కన్నడ లో పోటీ చేస్తారనే వార్తలు ప్రచారం లో ఉన్నాయి. రమేష్ జిగాజినాగి వయస్సు రీత్యా పోటీకి నిలపకపోవచ్చని తెలుస్తోంది.


Read More
Next Story