
కే ఎన్. రాజన్న
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వ్యతిరేకించిన కర్ణాటక కాంగ్రెస్ మంత్రి
మంత్రి పదవి నుంచి తొలగించిన సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక సహకార మంత్రి కే. ఎన్. రాజన్న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మొదట ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చినప్పటకీ, తరువాత పార్టీ అధిష్టానం ఆయనను రాజీనామా చేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
మహదేవపురంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓట్ల మోసం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలపై కర్నాటక మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.
రాజన్న సోమవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి తన మంత్రి పదవి నుంచి తప్పుకున్నట్లు లేఖను సమర్పించారని తెలుస్తోంది. సాయంత్రం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు గవర్నర్ కార్యాలయం సీఎంఓకు సమాచారం పంపింది. ఆయన రాజీనామా చేయాడానికి ముందే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనను తొలగించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిసింది.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల తరువాత తన సొంత ప్రభుత్వంపై, నాయకులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మా ప్రభుత్వ హాయంలో ఓటర్ల జాబితా తయారుచేశారు. అందరూ కళ్లూ మూసుకున్నట్లు కనిపిస్తోంది’’ అన్నారు. దీనితో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు బూమారాంగ్ అయ్యాయి.
హై కమాండ్ ఆదేశం..
‘‘మహదేవపురలో ఎన్నికల అక్రమాలు జరిగినప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది’’ అని రాజన్న చేసిన ప్రకటన రాహుల్ గాంధీ చేస్తున్న ఎన్నికల మోసానికి వ్యతిరేకంగా జరిగిన జాతీయ ఉద్యమానికి తీవ్ర ఇబ్బందిని కలిగించింది.
బీజేపీ, ఎన్నికల కమిషన్ కు సంబంధించిన అక్రమాల గురించి కాంగ్రెస్ ఆందోళనలు లేవనెత్తుతుండగా, రాజన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను హై కమాండ్ తీవ్రంగా పరిగణించింది.
ప్రతిపక్ష పార్టీలు రాజన్న చేసిన వ్యాఖ్యలను ఉపయోగించుకుని కాంగ్రెస్, రాహుల్ గాంధీ పైకి ఎదురుదాడికి దిగాయి. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ రంగంలో గందరగోళాన్ని తీసుకొచ్చాయి. ఫలితంగా ఆయన మంత్రి పదవిని పోగొట్టుకున్నారు.
పార్టీ హెచ్చరికలను పట్టించుకోలేదు..
పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడకూడదని హైకమాండ్ పదేపదే హెచ్చరించినప్పటికీ రాజన్న మాత్రం తాను కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానని చెబుతూనే ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల తరువాత డికే శివకుమార్ ను ఎందుకు మార్చలేదని పలు సందర్భాల్లో ప్రశ్నించారు. శివకుమార్, పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవే కాకుండా హనీట్రాప్ కేసును అసెంబ్లీలో కూడా ప్రస్తావించింది రాజన్ననే. హైకమాండ్ అనుమతి లేకుండా ఇటువంటి సున్నిత అంశాలను బహిరంగంగా హైలైట్ చేయడం ద్వారా పార్టీని కష్టాల్లోకి నెట్టారు.
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా కీలక సమావేశం కోసం బెంగళూర్ కు వచ్చినప్పుడు రాజన్న దానిని బహిష్కరించారు. ఇది పార్టీ నాయకత్వం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పార్టీ భావించింది.
Next Story