కర్నాటకలో కబాబ్ లను నిషేధిస్తారా?
x

కర్నాటకలో కబాబ్ లను నిషేధిస్తారా?

డబ్బులు ఇచ్చి బయట రోగాలు కొంటారా అని తెలుగులో అప్పుడప్పుడు సైటైర్లు వేస్తూ ఉంటారు. కానీ అధికారులు, జనాలు వీటిని పెద్దగా పట్టించుకోరు..కానీ కర్నాటకలో మాత్రం..


కర్నాటకలో ఆహార పదార్థాలపై అక్కడి అధికారులు, ప్రభుత్వం దృష్టి సారించారు. ఇప్పటికే గోబీ మంచూరియన్, కాటన్ స్వీట్లలో కృత్రిమ రంగులు వాడడాన్ని నిషేధించిన కన్నడ సర్కార్ తాజాగా చికెన్ కబాబ్ పై తన దృష్టిని నిలిపింది. తాజాగా వీటి నమూనాలను ల్యాబ్ లకు పంపిన ప్రభుత్వం, నివేదికల కోసం ఎదురు చూస్తోంది. గత నెలలో, కర్ణాటక ప్రభుత్వం గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయిలలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించింది, అవి ప్రజారోగ్యంపై, ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతాయని పేర్కొంది.

కర్ణాటకలోని 170కి పైగా ప్రాంతాల నుంచి వచ్చిన గోబీ మంచూరియన్‌ శాంపిల్స్‌ను ప్రయోగశాలల్లో పరీక్షించారు. కళ్యాణ మండపాలు, షాపింగ్ మాల్స్, పార్కులు, ట్రేడ్ ఫెయిర్లు వంటి పలు ప్రాంతాల నుంచి కాటన్ స్వీట్లు, గోబీ మంచూరియన్ నమూనాలను సేకరించారు. అయితే సేకరించిన వాటిల్లో 100 కంటే ఎక్కువ ప్రదేశాల గోబీ మంచూరియన్ నమూనాలు వినియోగించే విధంగా లేవని తెలుస్తోంది. చివరకు ఫలితాల ఆధారంగా, గోబీ మంచూరియన్ తయారీలో ఎలాంటి కృత్రిమ రంగుల వాడరాదని నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
కాటన్ మిఠాయి విషయంలో, నిర్దేశించిన పరిమితుల కంటే ఎక్కువ మోతాదులో కృత్రిమ రసాయనలతో చేసిన రంగును ఉపయోగించడం, అలాగే అనుమతి లేని 'రోడమైన్ B' వంటి వాటిని వీటిలో వాడుతున్నారు. అందుకు ఫుడ్ సేప్టీ కమిషనర్ వీటిని నిషేధించారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 రూల్ 59ని ఉల్లంఘిస్తే ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆ శాఖ కోర్టులో కేసు వేయవచ్చని అధికారులు తెలిపారు.
ఆహారంలో కృత్రిమ రంగులను ఎక్కువగా వినియోగిస్తే క్యాన్సర్ కు దారి తీస్తుందని అధికారులు జారీ చేసిన ఉత్తర్వూల్లో పేర్కొన్నారు. కాబట్టి, ఆహారంలో కృత్రిమ రంగులు ఉపయోగించవద్దని, పరిమిత పరిమాణంలో కూడా వాటిని ఉపయోగించవద్దని ప్రజలకు సూచించారు.
కబాబ్‌లకు పరీక్షలు..
ఇప్పుడు, ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కబాబ్‌లను పరీక్షించడానికి పంపింది. కబాబ్‌ల తయారీలో కృత్రిమ రంగులు వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. "కబాబ్‌లలో హానికరమైన కృత్రిమ రంగులు వాడుతున్నారనే వార్తలపై వాటిని ఆహార, భద్రత విభాగం పరీక్షిస్తోంది, అయితే నివేదిక ఇంకా రావాల్సి ఉంది" అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోరంజన్ ఫెడరల్ తో అన్నారు.
కబాబ్స్ రుచిని మెరుగుపరచడానికి వివిధ పదార్థాలతో తయారు చేయబడిన కొన్ని పొడులను ఉపయోగిస్తారు. ఇవి కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గోబీ మంచూరియన్‌లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధానికి వర్తించే నియమాలు కబాబ్‌లకు కూడా వర్తిస్తాయని FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) వర్గాలు తెలిపాయి.
“ప్రస్తుతం, కాటన్ మిఠాయిలు, గోబీ మంచూరియన్‌లలో కృత్రిమ రంగుల వాడకంపై రాష్ట్రంలో నిషేధించబడింది. అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాల్లో కృత్రిమ, హానికారక రంగులు వాడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, ఏదైనా రంగు కనిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గోబీ మంచూరియన్ తయారీకి కృత్రిమ రంగులు వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం' అని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.
ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగులు వాడినట్లు తేలితే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు.హోటల్ యజమానులు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు
“గోబీ మంచూరియన్‌లో కృత్రిమ రంగులు వాడకూడదు. బెంగుళూరులోని హోటల్ యజమానులకు ప్రభుత్వ ఉత్తర్వు గురించి తెలియజేశాం. అదే నియమం కబాబ్‌లకు వర్తిస్తుంది. అందరూ రూల్స్ కి కట్టుబడి ఉన్నారు’’ అని బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీసీ రావు తెలిపారు.ఫెడరల్ తో ఆయన మాట్లాడుతూ, అన్ని ఆహార పదార్థాలలో కృత్రిమ రంగులు ఉపయోగించరాదని ప్రభుత్వం ఆదేశించింది.
ఇంతకుముందు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆహారంలో ఉపయోగించగల, ఉపయోగించకూడని రంగులను వర్గీకరించింది. హోటళ్లలో గోబీ మంచూరియన్, కబాబ్స్, టొమాటో సూప్, కేసరి బాత్ వంటి వాటికి రంగులు వేస్తారు. అయితే, అనుమతించబడిన రంగులను మాత్రమే ఉపయోగించాలి వాటికి కొన్ని రూల్స్, కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే కొందరు అనుమతించిన పరిమితికి మించి రంగులు వాడుతున్నారని పీసీ రావు తెలిపారు.
‘రోడమైన్ బి’ అంటే ఏమిటి
గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయిలలో Rhodamine B అనే కృత్రిమ రంగును ఉపయోగిస్తారు. రోడమైన్ B రంగును వస్త్ర పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది.
ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు వాడడం వల్ల క్రమంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కృత్రిమ రంగులతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు అధిక బరువు, ఊబకాయం బారిన పడే అవకాశాలు అధికం. మధుమేహం, గుండె జబ్బులు, నరాల బలహీనత వ్యాధులు యువతలో ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయి తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం కబాబ్‌లకు కూడా అదే పని చేస్తుందా లేదా అన్నది చూడాలి.


Read More
Next Story