
కర్ణాటక దేవనహళ్లిలో తెరమీదకు ‘‘గ్రీన్ జోన్’’ ..
రైతుల నుంచి భూములను రాబట్టుకునేందుకు 'ప్లాన్ బి'కి సిద్ధమవుతోన్న సిద్ధరామయ్య ప్రభుత్వం
కర్ణాటక(Karnataka)ప్రభుత్వం ఏరోస్పేస్ హబ్ ఏర్పాటుకు దేవనహళ్లి (Devanahalli) తాలూకాలోని చన్నరాయపట్నం హోబ్లిలోని 13 గ్రామాల పరిధిలో ఉన్న 1,777 ఎకరాలను సేకరించాలనుకుంది. అయితే రైతుల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో సీఎం సిద్ధరామయ్య (CM Sidda Ramaiah) వెనక్కు తగ్గారు. ఇటీవల రైతు సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వయంగా ఆయనే ఇలా పేర్కొన్నారు. ‘‘రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మేం మా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాం. స్వచ్ఛందంగా అమ్మాలని ముందుకువస్తే కొంటాం’ అని చెప్పారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకున్నారు. కాని మరోమార్గంలో భూములను లాక్కోవాలని చూస్తోంది. అందుకోసం ‘‘గ్రీన్ జోన్’’ నిబంధన తెస్తోంది.
ఏమిటీ ‘‘గ్రీన్ జోన్..’’
‘‘గ్రీన్ జోన్’’ నిబంధన అమలు చేస్తే..సుమారు 20 నుంచి 25 ఏళ్ల పాటు తమ భూములను రైతులు ఇతరులకు అమ్ముకునే వీలుండదు. ఒకవేళ ఎవరైనా కొన్నా.. దాన్ని వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి. ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.
అసలు భూములను ఎందుకు అమ్మడం లేదు?
దేవనహళ్లి తాలూకాలో ఎకరా భూమి రూ.4కోట్ల నుంచి 5 కోట్ల మధ్య అమ్ముడవుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం రూ.2.5 కోట్లు మాత్రమే ఇస్తానంటోంది. ధరలో ఈ భారీ వ్యత్యాసం వల్ల చాలా మంది రైతులు తమ భూమిని అమ్మడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
ఎలాగైనా చేజిక్కించుకోవాలనే..
‘‘ప్రస్తుతం చాలా మంది రైతులకు వ్యవసాయమే జీవనాధారం. వారు తమ భూమిని అమ్మడానికి సిద్ధంగా లేరు. భవిష్యత్తులో డబ్బు అవసరమై ఎవరైనా అమ్మాలనుకుంటే ఇబ్బందులు తప్పవు’ అని పోలనహళ్లికి చెందిన రైతు ప్రమోద్ ది ఫెడరల్ కర్ణాటకకు తెలిపారు.
‘మరింత జాగ్రత్తగా ఉండాలి..’
రైతుల నిరసన కమిటీకి నాయకత్వం వహించిన కరహళ్లి శ్రీనివాస్ ది ఫెడరల్ కర్ణాటకతో మాట్లాడుతూ.. “ప్రభుత్వం భూసేకరణను రద్దు చేసుకున్నంత మాత్రాన.. దాన్ని రైతులు తమ విజయంగా భావించకూడదు. మునుపటి కంటే మరింత అప్రమత్తంగా ఉండాలి” అని పేర్కొన్నారు.
పరిస్థితులను బట్టి చూస్తే.. భూ సేకరణలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదని స్పష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించింది. అదే గ్రీన్ జోన్. రానున్న రోజుల్లో ఈ కండీషన్‌పై రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి.