భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్.. షరతులు వర్తిస్తాయి?
x

భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్.. షరతులు వర్తిస్తాయి?

మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబాన్ని కుదిపేస్తున్న ప్రజ్వల్ ‘సెక్స్ స్కాండల్’ వ్యవహారంలో భవానీ రేవణ్ణకు ఏ కండీషన్‌పై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది?


కర్ణాటక హసన్ నియోజకవర్గ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లైంగికదాడికి గురైన బాధితురాలిని అపహరించిన కేసులో ఆమె సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణ ఎదుర్కొంటున్నారు.

గతవారం వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ధర్మాసనం భవానీ ముందస్తు బెయిల్ దరఖాస్తుపై మంగళవారం (జూన్ 18) తుది ఉత్తర్వులిచ్చింది.

"వాదన ఆమోదయోగ్యం కాదు"

పోలీసులు అడిగిన 85 ప్రశ్నలకు భవానీ రేవణ్ణ సమాధానమిచ్చారు. అందువల్ల ఆమె దర్యాప్తునకు సహకరించలేదన్న వాదనను అంగీకరించలేము. నిందితులు తమకు కావలసిన సమాధానాలు ఇస్తారని పోలీసులు ఆశించకూడదు” అని న్యాయస్థానం పేర్కొంది.

"బాధితురాలికి భవానీ ఆహారం, బట్టలు ఇవ్వలేదనే వాదన కూడా ఆమోదయోగ్యం కాదు" అని కోర్టు పేర్కొంది. బాధితురాలికి తన సోదరి బట్టలు, ఆహారం పంపిందని భవానీ ఇదివరకే చెప్పారు.

అయితే భవానీ రేవణ్ణ మైసూరు, హాసన్ జిల్లాల్లోకి ప్రవేశించరాదని హైకోర్టు షరతు విధించింది. దర్యాప్తులో సిట్‌కు సహకరించాలని కూడా ఆదేశించింది.

అసలు కేసు ఏమిటి?

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో హసన్ నియోజకవర్గం నుంచి జేడీ(ఎస్) టికెట్‌పై సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేసి ఓడిపోయారు. సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రజ్వల్ అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసులో ప్రజ్వల్ తల్లిదండ్రులు రేవణ్ణ, భవానీ నిందితులు.ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నహెచ్‌డీ రేవణ్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు భవానీకి శరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది హై కోర్టు.

తన తల్లి కనిపించడం లేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాధితురాలిని రక్షించారు. ఆ కేసులో సిట్ విచారణకు హాజరుకావాలని హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read More
Next Story