
ఇప్పుడు చేస్తారా? ‘జనక్రోశయాత్ర..’
కేంద్రానికి వ్యతిరేకంగా జకక్రోశయాత్ర చేపట్టాలని బీజేపీ నాయకులనుకోరిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. ఆ భారం వాహనదారులపై పడకుండా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. ఈ పెంపుపై కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న బీజేపీ (BJP) నాయకులు, కార్యకర్తలు.. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించాలని కోరారు.
బీజేపీ 'జనక్రోశ యాత్ర'..
కాంగ్రెస్ ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు క్పలించడం, SC/ST సబ్-ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ కర్ణాటక బీజేపీ సోమవారం నుంచి 16 రోజుల 'జనక్రోశ యాత్ర' (Janakrosha Yatre)ను ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులనుద్దేశించి డీకే.."నా బీజేపీ స్నేహితులకు నమస్కారం.. జనక్రోష యాత్ర చేస్తోన్న మీ అందరికీ నా అభినందనలు. కానీ కేంద్ర ప్రభుత్వం.. మీ బీజేపీ ప్రభుత్వం..పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచింది. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా మీ జనక్రోష యాత్ర సాగాలి’’ అని అన్నారు.
బీజేపీ జనక్రోశ యాత్రను "ప్రహసనం"గా అభివర్ణించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. "ఇప్పుడు రాష్ట్రంలోని బీజేపీ నాయకుల స్పందన ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గుతున్నా.. కేంద్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఎందుకు పెంచుతుందో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు వివరించాలి." అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
"జనక్రోశ యాత్రకు బయలుదేరిన వారి ముందు రెండు ఆపన్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రం పెంచిన ధరలను తగ్గించాలని ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలి. లేదా వారు యాత్రను ముగించి ఇళ్లకు తిరిగి వెళ్లాలి. అలా కాకుండా.. యాత్ర కొనసాగిస్తే, ప్రజల ఆగ్రహానికి గురకావాల్సి వస్తుంది" అని అన్నారు.
కాంగ్రెస్(Congress) ఏర్పాట్లు..
వంట గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ నగరంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన చేపట్టాలని కర్ణాటక కాంగ్రెస్ ప్లాన్ చేసింది.