కర్నాటక సెక్స్ స్కాండల్: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
x

కర్నాటక సెక్స్ స్కాండల్: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్

కర్నాటకు కుదిపేసిన సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అరెస్ట్ చేసి, తమ కార్యాలయానికి తరలించింది.


నెలక్రితం కర్నాటకను కుదిపేసిన సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ను శుక్రవారం అర్ధరాత్రి దాటాకా కేసును విచారిస్తున్న సిట్ అరెస్ట్ చేసింది. సెక్స్ స్కాండల్ కు సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమంలోకి విడుదల కాగానే దౌత్య పాస్పోర్ట్ పై జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణపై దర్యాప్తు సంస్థలు బ్లూకార్నర్ నోటీసు జారీ చేశాయి.

ప్రజ్వల్ విచారణ ఎదుర్కొకతప్పదని ఆయన పోటీ చేస్తున్న పార్టీ అధినాయకుడు, మాజీ ప్రధాని దేవే గౌడ సైతం హెచ్చరించడంతో ప్రజ్వల్ గురువారం మ్యూనిచ్ నుంచి బెంగళూర్ తిరిగి వచ్చాడు. తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి, విచారణ కోసం సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇందుకోసం భారీ స్థాయిలో పోలీసులను విమానాశ్రయ పరిసరాల్లో మోహరించారు.

మొదట కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కస్టడీలోకి తీసుకుని తరువాత సిట్ కు అప్పగించినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అరెస్టు చేసిన 24 గంటల్లో జేడీ(ఎస్) నాయకుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లనున్నారు.

కోర్టు వారెంట్
ప్రజ్వల్ రేవణ్ణ పై కోర్టు వారెంట్ పెండింగ్‌లో ఉంది. కొన్ని న్యాయ ప్రక్రియల అనంతరం అతడిని సిట్ కస్టడీలోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయంలో పోలీసులు.. ఎంపీ భద్రతా దృష్ట్యా వేరే మార్గం గుండా బయటకు తరలించారు. దేశం విడిచి వెళ్లిన సరిగ్గా నెల రోజుల తర్వాత, ఆయనొక వీడియో విడుదల చేశారు. మే 27 నాటి వీడియో ప్రకారం మే 31 న కర్నాటక పోలీసుల ముందు విచారణకు హజరవుతానని అందులో వెల్లడించారు.
33 ఏళ్ల ప్రజ్వల్, JD(S) వ్యవస్థాపకుడు మాజీ ప్రధాని HD దేవెగౌడ మనవడు. హాసన్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి BJP-JD(S) కూటమి అభ్యర్థి, అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతనిపై ఇప్పటి వరకు మూడు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
బ్లూ కార్నర్ నోటీసు
హసన్ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 27న ఆయన జర్మనీకి వెళ్లారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ద్వారా సిట్ చేసిన అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ గతంలో అతని ఆచూకీపై సమాచారం కోరుతూ 'బ్లూ కార్నర్ నోటీసు' జారీ చేసింది.
సిట్ దాఖలు చేసిన దరఖాస్తు మేరకు ఎన్నికైన ప్రతినిధుల కోసం ప్రత్యేక కోర్టు మే 18న ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కోరినట్లుగా అతని దౌత్య పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రజ్వల్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది.
రాజకీయ కుట్ర?
తనపై పెట్టిన కేసులు అబద్ధమని, రాజకీయ కుట్ర అని ఆరోపించిన ఎంపీ, ఈ వారం ప్రారంభంలో విడుదల చేసిన వీడియో ప్రకటనలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. అనంతరం మే 29న ప్రిన్సిపల్ సిటీ అండ్ సెషన్స్ కోర్ట్ ఫర్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు సిట్ కు నోటీసులు జారీ చేయనుంది. ఈ కుంభకోణం అధికార కాంగ్రెస్, బీజేపీ-జేడీ(ఎస్) మధ్య చిచ్చు రేపడంతో రాజకీయ తుపానును సృష్టించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుల దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయగా, బిజెపి, జెడి(ఎస్) సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశాయి. వీడియోలను సామాజిక మాధ్యమంలోకి విడుదల చేసిన వ్యక్తుల పై కూడా చర్యలు తీసుకోవాలని కోరాయి.
దేవెగౌడ హెచ్చరిక
ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలకు ముందు హాసన్‌లో ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక వేధింపుల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆ తరువాత ఆయన జర్మనీకి వెళ్లారు. నోటీసులకు స్పందించకపోవడంతో పార్టీ అధినాయకత్వం తీవ్రంగా హెచ్చరించింది.
ముఖ్యంగా దేవెగౌడ ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణకు 'గట్టి హెచ్చరిక' జారీ చేశారు, అతను దేశానికి తిరిగి వచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని సూచించాడు. అలాగే విచారణ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావని ప్రకటించారు. దోషిగా తేలితే కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రజ్వల్ బాబాయి మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి కూడా ప్రజ్వల్ కు ఇదే అభ్యర్థన చేశాడు. ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.


Read More
Next Story