‘చలో మైసూర్’ పాదయాత్ర ప్రారంభించిన విపక్షాలు.. ఎందుకో తెలుసా?
ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కర్నాటకలో విపక్షాలు డిమాండ్ చేస్తూ చలో మైసూర్ పాదయాత్ర చేపట్టాయి.
కర్నాటకలో రాజకీయాలు వేడేక్కాయి. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు మైసూర్ నగరాభివృద్ధిలో సేకరించిన భూమి కంటే ఎక్కువ మొత్తంలో భూమి కేటాయించడంపై కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. తాజాగా బీజేపీ, జేడీ(ఎస్) ప్రత్యక్ష పోరాటానికి దిగింది.
అక్రమంగా భూమి పొందిన సీఎం రాజీనామా చేయాలని కోరుతూ శనివారం (ఆగస్టు 3) బెంగళూరు నుంచి మైసూర్ చల్ పాదయాత్రను ప్రారంభించాయి. రాజధాని బెంగళూర్ నుంచి ఏడు రోజుల పాదయాత్ర ద్వారా మైసూర్ చేరుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, జేడీ(ఎస్) యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి డోలు వాయిద్యాల నడుమ బగల్ ఊదుతూ పాదయాత్రను ప్రారంభించారు. ఏడు రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర ఆగస్టు 10న మైసూరులో మెగా బహిరంగ సభతో ముగుస్తుంది.
అవినీతి కేసులో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని, అందుకే ఆయన పదవి నుంచి వైదొలగాలని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ఆరోపించారు. సిద్ధరామయ్య తనంతట తానుగా రాజీనామా చేసి సునాయాసంగా పదవి నుంచి వైదొలగడం మంచిదని వేలాది హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి నోటీసు జారీ చేసినందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు.
నోటీసులివ్వగానే మీకు (సిద్దరామయ్యకు) వణుకు మొదలైందని, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన (గవర్నర్) అనుమతి ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చని చురకలు అంటించారు.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి కాంగ్రెస్ మాట్లాడుతుందని, అయితే ముడా, వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంలో వారు చేసిన పని వారి దళిత వ్యతిరేక ముఖాన్ని బయటపెట్టిందని అన్నారు. వేదిక వద్ద బ్యానర్లు, పూలదండలు, బీజేపీ-జేడీ(ఎస్) జెండాలు ఏర్పాటు చేశారు.
Next Story