కర్ణాటకలో కొత్తగా కుల గణన..
x

కర్ణాటకలో కొత్తగా కుల గణన..

సెప్టెంబర్ నుంచి ప్రారంభం - ఈసారి మొబైల్ యాప్ ద్వారా..


Click the Play button to hear this message in audio format

కర్ణాటక(Karnataka) ప్రభుత్వం మరోసారి కులగణన(Caste Survey)కు సిద్ధమవుతోంది. 7 కోట్ల ప్రజల సామాజిక, విద్యా సర్వేను 15 రోజుల పాటు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22 నుంచి మొదలై అక్టోబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. బుధవారం ఆయన ఉన్నాధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. కొన్ని ప్రభావవంత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంతరాజ్, జయప్రకాష్ హెగ్డే కమిషన్ సమర్పించిన కుల సర్వే నివేదికను ప్రభుత్వం రద్దు చేసింది. అదే సమయంలో కొత్త సర్వే నిర్వహిస్తామని కూడా ప్రకటించింది.

ఈ సారి సర్వేలో ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి, భూ యాజమాన్య వివరాలతో సహా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఈ నివేదిక బడ్జెట్‌ కేటాయింపునకు కూడా ఉపయోగపడుతుంది. ఇది దేశంలోనే ఒక మోడల్ సర్వేగా నిలిచిపోవాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు..

గతంలో కాంతరాజ్ కమిషన్ 54 ప్రశ్నలతో భౌతిక (మాన్యువల్) సర్వే నిర్వహించింది. అయితే ఈసారి అదనపు అంశాలను కలుపుకొని మొబైల్ యాప్‌ను ఉపయోగించి సర్వే నిర్వహించనున్నారు. సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సర్వేపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, సర్వే విధుల నుంచి తప్పుపోవాలని చూసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భారీగా సన్నాహాలు..

సర్వేకు 1,65,000 మంది ఎన్యుమరేటర్లను అవసరం అవుతారు. ఉపాధ్యాయులతో పాటు ఇతర విభాగాల సిబ్బందిని కూడా సర్వే విధులకు వినియోగించనున్నారు. సన్నాహక ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని సీఎం సూచించారు. బెంగళూరు నగర పరిధిలో సర్వేను విజయవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని, ఉప కులాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.

అదే లక్ష్యం..

"వర్గరహిత, కుల రహిత సమాజం స్థాపనే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి సాధికారత చేకూర్చేందుకు వీలువుతుంది. ఆర్థిక, సామాజిక సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించాలి" అని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.

సమావేశంలో సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి, రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ మధుసూధన ఆర్ నాయక్, ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్, ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More
Next Story