అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆత్మహత్యపై స్పందించిన కేరళ మానవ హక్కుల కమిషన్
x

అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆత్మహత్యపై స్పందించిన కేరళ మానవ హక్కుల కమిషన్

కేరళలోని కన్నూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నవీన్ బాబు ఆత్మహత్య ఘటనపై విచారణ చేయాలని న్యాయవాది దేవదాస్ కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరారు.


కేరళలోని కన్నూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) నవీన్ బాబు మృతికి సంబంధించి కన్నూర్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు పీపీ దివ్యపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వి దేవదాస్ కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషన్ సభ్యుడు కె. బైజునాథ్ జిల్లా యంత్రాంగానికి నోటీసు జారీ చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు.

నవీన్ బాబు బదిలీ వీడ్కోలు కార్యక్రమంలో కలెక్టర్‌ అరుణ్‌తో పాటు పంచాయతీ అధ్యక్షురాలు పీపీ దివ్య హాజరయ్యారు. పెట్రోల్ బంకు పెట్టుకునేందుకు అవకాశం వచ్చిన వ్యక్తి నుంచి నవీన్ బాబు రూ. లక్ష లంచం తీసుకుని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇచ్చాడని వేదికపై అందరి ముందు దివ్య ఆరోపించారు. ఆమె మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన నవీన్ బాబు తన క్వాటర్స్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

నష్టపరిహారం చెల్లించాలి..

నవీన్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, ఆయనపై ఆధారపడిన వారికి ఉపాధి కల్పించాలని న్యాయవాది దేవదాస్ కమిషన్‌ను కోరారు. నవంబర్ 19న కన్నూర్ ప్రభుత్వ అతిథి గృహంలో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని కమిషన్ పేర్కొంది.

రైలులో వస్తున్నాడని స్టేషన్‌లో వేచిచూసిన భార్య, పిల్లలు..

కన్నూర్ నుంచి బదిలీ అయిన నవీన్ బాబు మంగళవారం పతనంతిట్టలో బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. రైలులో పతనంతిట్ట చేరుకుంటారని ముందస్తు సమాచారం ఉండడంతో రిసీవ్ చేసుకోడానికి భార్య, పిల్లలు, తహసీల్దార్ స్టేషన్‌ చేరుకున్నారు. అయితే నవీన్ బాబు ఆ రైలులో రాలేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు కోర్టు సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్లు వెళ్లి నవీన్ బాబు ఉంటున్న క్వార్టర్స్‌కు వెళ్లి చూసేసరికి ఆయన ఉరివేసుకుని కనిపించారు.

Read More
Next Story