
‘మీ కార్యాలయాన్ని ఖాళీ చేయండి’
తిరువనంతపురం కార్పొరేషన్ భవనంలోని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే ప్రశాంత్‌కు బీజేపీ కౌన్సిలర్ ఫోన్ ..
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Local body Polls) కేరళ(Kerala) రాష్ట్ర రాజధాని తిరువనంతపురం(Thiruvananthapuram) కార్పొరేషన్‌పై కాషాయ జెండా రెపరెపలాడింది. 101 డివిజన్లకుగాను 50 డివిజన్లలో బీజేపీ(BJP) విజయం సాధించింది. 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా విజయం సాధించడంతో కాషాయ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి గెలిచిన రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీలేఖ..కార్పొరేషన్ ప్రాంగణంలోనే సీపీఎం ఎమ్మెల్యే వికె ప్రశాంత్(VK Prasanth) పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని చెప్పారు. దీంతో ఆయన ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కౌన్సిలర్ల కార్యాలయంలో తగిన సౌకర్యాలు లేవు. మీరు మీ కార్యాలయాన్ని ఖాళీ చేస్తే సౌకర్యాలు మెరుగుపర్చుకుంటాం’’ అని శ్రీలేఖ తనకు ఫోన్ చేసి చెప్పారని ప్రశాంత్ చెప్పారు.
‘అంతవరకు ఖాళీ చెయ్యను..’
‘‘నేను గత ఏడేళ్ల నుంచి ఇదే భవనంలో పార్టీ కార్యాలయం నడుపుతున్నా. నేను తిరువనంతపురం మేయర్‌గా ఉన్నప్పుడు.. కౌన్సిలర్ల కోసం కొంత స్థలాన్ని కేటాయించి అందులో భవనం నిర్మించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో దాన్ని నాకు అద్దెకు ఇచ్చారు. అగ్రిమెంట్ మార్చి 31, 2026 నాటికి పూర్తవుతోంది. నా పదవీకాలం ముగిసే వరకు (మే వరకు) రెంటల్ అగ్రిమెంట్‌ను పొడిగించాలని కూడా దరఖాస్తు చేసుకున్నాను. పొడగించడం కురదకపోతే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇక్కడే ఉంటాను. ఆలోగా బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తే చట్టపరంగా ముందుకు వెళ్తా’’ అని చెప్పారు ప్రశాంత్.
‘‘నా కార్యాలయాన్ని ఖాళీ చేయమని శ్రీలేఖ స్వయంగా చెప్పే సాహసం చేయరు. బీజేపీ నాయకుల ఒత్తిడి మేరకే ఆమె నా ఫోన్ చేసి ఉండవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీలేఖ స్పందించలేదు.

