కర్నాటక సీఎం చేతిలో  కులాల చిట్టా
x

కర్నాటక సీఎం చేతిలో కులాల చిట్టా

కన్నడ నాట ఆధిపత్య వర్గాలుగా ఉన్న వొక్కలిగ, లింగాయత్ లు కులగణన నివేదికను వ్యతిరేకిస్తున్నారు.. దళితులు, ఓబీసీ మాత్రం నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


కర్నాటక వెనకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కె. జయప్రకాష్ హెగ్దే గురువారం సాయంత్రం ‘కులగణన’గా పిలవబడుతున్న సామాజిక ఆర్ధిక విద్యాసర్వే నివేదికను ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సమర్పించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. నివేదికలో ఏముందో మాకు తెలియదు. దాన్ని తీసుకెళ్లి మంత్రివర్గం ముందు పెడతామని, అక్కడే చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. నివేదికలో మొత్తం 13 కాపీలుగా ఉందని , రాష్ట్రంలోని అన్ని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సమాచారం, గణాంకాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమంచే అవకాశం కనిపిస్తోంది.

నివేదికను తిరస్కరించిన ఒక్కలిగ, లింగాయత్ వర్గాలు
కన్నడ నాట ఆధిపత్య వర్గాలుగా పేరుపొందిన ఒక్కలిగ, లింగాయత్ లు ఈ నివేదికను వ్యతిరేకించారు. అందులోని సమాచారం మొత్తం తప్పుల తడకగా ఉంటుందని, అదంతా ఆశాస్త్రీయని, తాజాగా మరోసారి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వర్గాల అభ్యంతరాలపై కొంతమంది పలు విశ్లేషణలు వినిపిస్తున్నారు.
ఆధిపత్య వర్గాలపై ఒక్కలిగ, లింగాయత్ లు తమ సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే ప్రచారం కల్పించారని, ఇది బయటకు వస్తే నిజంగానే తమ కులానికి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా ఉన్న నేత డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం కమిషన్ సమర్పించిన ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని ఒక్కలిగ సామాజిక వర్గం కూడా సీఎంకు ఓ మెమోరాండం సమర్పించింది. దీనిపై డీకే కూడా సంతకం చేశారు. అలాగే ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా దీనిపై సంతకాలు చేశారు.
తాజాగా సర్వే చేయాలి
వీర శైవ లింగాయత్ ల అత్యున్నత సంస్థ అయిన అఖిల భారత వీరశైవ మహాసభ కూడా ఈ నివేదికపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనిని తిరస్కరిస్తున్నామని తాజాగా మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేసింది. లింగాయత్ బాడీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే శామనూర్ శివశంకరప్పతో పాటు, పలువురు లింగాయత్ ఎమ్మెల్యేలు , మంత్రులు సైతం దీనిపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వన్ని ఇరుకున పెట్టింది.
2015 లో సీఎంగా ఉన్న సిద్ద రామయ్య ఆలోచనల నుంచి ఇది రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో కులగణన ప్రారంభించాలని కర్నాటక స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ దాని అప్పటి ఛైర్ పర్సన్ హెచ్ కాంతరాజు ఆధ్వర్యంలో సామాజిక- ఆర్థిక, విద్యా సర్వే నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూ. 170 కోట్ల రూపాయలను కేటాయించారు.
2018 లో సిద్ద రామయ్య మొదటి టర్మ్ పూర్తి అయ్యే నాటికి సర్వే పనులు పూర్తయ్యాయి. కానీ నివేదిక మాత్రం ఆమోదించలేదు. దాని వివరాలు సైతం బయటకు రానీయలేదు. ప్రస్తుతం దీనికి జయప్రకాష్ హెగ్దే నేతృత్వం వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లోనే ఇది ప్రభుత్వానికి చేరాల్సి ఉంది. కానీ కొన్ని పనులు పూర్తికాకపోవడంతో కమిషన్ గడువును పొడిగించారు. తాజాగా నిన్న దీనిని సీఎంకు అప్పగించారు.
బిహార్ లో కులగణన విడుదల అయ్యాక సిద్ద రామయ్యపై ఒత్తిడి పెరిగింది. అయితే నివేదిక అందిన తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన అప్పట్లో చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడివడడం, వర్క్ షీట్ అసలు కనిపించకుండా పోవడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించకముందే ఇది వివాదాల్లో చిక్కుకుంది.
అయితే ఆధిపత్య వర్గాలైన ఒక్కలిగ, లింగాయత్ లు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీసీ సంఘాలు, దళితులు దీనిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది విడుదలైయితే రాష్ట్రంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది.


Read More
Next Story