కేరళలో DYFI తొలి స్టార్టప్ ఈవెంట్ ‘మవాజో’..
x

కేరళలో DYFI తొలి స్టార్టప్ ఈవెంట్ ‘మవాజో’..

యువత కొత్త ఆవిష్కరణకు కేరళ తిరువనంతపురం(Trivandrum)లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘‘యూత్ స్టార్టప్ ఫెస్టివల్’’ ప్రాధాన్యతను సంతరించుకుంది.


Click the Play button to hear this message in audio format

సాంకేతిక పురోగతికి వామపక్షాలు వ్యతిరేకం. ఈ విమర్శ పూర్తిగా నిరాధారమైతే కాదు. ఉద్యోగులకు ముప్పు వాటిల్లితే మొదటగా స్పందించేది వామపక్ష నేతలే. కాంగ్రెస్ మద్దతు ఉన్న ఐఎన్‌టీయుసీ (INTUC), బీజేపీ మద్దతు ఉన్న బీఎంఎస్ (BMS) దీనికి మినహాయింపు కాదు. అయితే ఎక్కువపాళ్లు విమర్శలు ఎదుర్కొనేది మాత్రం వామపక్ష పార్టీలే.

సాంకేతికత(Technology)కు వ్యతిరేకం కాదు..

కాలానుగుణంగా.. ముఖ్యంగా కేరళ(Kerala)లో, కొంతవరకు పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వాలు సాంకేతికతకు తాము వ్యతిరేకం కాదని చెప్పడానికి శ్రీకారం చుట్టాయి. ఆ విషయానికొస్తే..దేశంలోని తొలి ఐటీ పార్క్ అయిన తిరువనంతపురంలోని టెక్నోపార్క్‌కు పునాది రాయి వేసింది 1990లో మార్క్సిస్ట్ ముఖ్యమంత్రి ఈ.కె. నయనార్ (EK Nayanar) ప్రభుత్వమే. 1989లో యునైటెడ్ స్టేట్స్‌లోని ఆపిల్ సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించినపుడు ఈ టెక్నోపార్క్ ఆవిర్భావానికి బీజం పడింది. అయితే నయనార్ ప్రభుత్వం 1990 మార్చి 31న పార్క్ భవనానికి శంకుస్థాపన మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత వచ్చిన కారుణాకరన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనులను మొదలుపెట్టింది. తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు 1992లో ఈ టెక్నోపార్క్‌ను దేశానికి అంకితం చేశారు. ఈ ఐటీ పార్క్ వల్ల 70 వేల మందికి ప్రత్యక్షంగా, మరి కొంతమందికి పరోక్షంగా ఉపాధి లభించింది.

కేరళ ప్రభుత్వం ఐటీ రంగంలో ఎన్నో విజయాలను సాధించినా, వామపక్ష పార్టీలు సాంకేతికతకు వ్యతిరేకమనే ముద్ర నుంచి బయటపడలేకపోతున్నాయి. అందుకే డీవైఎఫ్‌ఐ (DYFI) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్టార్టప్ ఫెస్టివల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ‘మవాజో’ (Mawazo) అనే పేరు పెట్టారు. ఆ పదానికి స్వాహిలి భాషలో "ఆలోచనలు" అని అర్థం. కేరళ యువతను కొత్త వ్యాపారాల వైపు ప్రేరేపించాలన్నదే ‘మవాజో’ ప్రధాన లక్ష్యం.

సీఎం పినరయి చేతుల మీదుగా..

ఈ వేడుకను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) అధికారికంగా ప్రారంభించనున్నారు. గతంలో ‘కోచ్చిలో యువధారా యువ సాహిత్య మహోత్సవం విజయవంతంగా నిర్వహించిన డీవైఎఫ్‌ఐ.. ఇప్పుడు మవాజో 2025కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్టార్టప్ మిషన్ సీఈవో, తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.

ఫెస్టివల్ కోఆర్డినేటర్ దీపక్ పాచా(Deepak Pacha) మాట్లాడుతూ.."ఇటీవల కాలంలో స్టార్టప్ రంగంలో కేరళలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ‘‘నాలెడ్జ్ సొసైటీ"గా మారాలని కోరుకుంటోంది. ఈ మార్పులో కీలక భాగస్వామ్యం యువజన సంఘాలదే. డీవైఎఫ్‌ఐ లాంటి పెద్ద ప్రజా ప్రాతినిధ్యాన్ని కలిగిన సంస్థలు ఈ బాధ్యత తీసుకోవాలి," అని చెప్పారు.

"ఈ కార్యక్రమం యువతకు వేదిక అవుతుంది. పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలు, మెంటర్లు వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. డీవైఎఫ్‌ఐ, రాజకీయంగా కేరళ వామపక్షానికి కూడా ముఖ్యమైనది. కేరళలో ఉన్నత విద్య చదువుతున్న యువత ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని AI, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, మెడిసిన్ ప్రొడక్షన్, లాజిస్టిక్స్, ఏరోస్పేస్ రంగాలపై దృష్టి సారించాలి." అని డీవైఎఫ్‌ఐ ప్రొఫెషనల్ సబ్‌కమిటీ కన్వీనర్ దీపక్ పాచా పేర్కొన్నారు.

విజేతలకు బహుమతులు..

ఈ ఫెస్టివల్‌లో పిచింగ్ పోటీలు, వర్క్‌షాప్‌లు, నిపుణులతో చర్చలు, స్టార్టప్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఉత్తమంగా నిలిచిన ఐదు టీంలకు రూ. 50వేల నగదు బహుమతి ఇవ్వనున్నారు. 2015 తర్వాత స్టార్టప్‌ కంపెనీలను స్థాపించి 45 ఏళ్లలోపు వ్యక్తులో ఒకరికి "యూత్ స్టార్టప్ ఐకాన్ అవార్డు"కు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు ఈ అవార్డుకు ఫెస్టివల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ విజయవంతానికి కేరళలోని కాలేజీల్లో పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో సెమినార్లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Read More
Next Story