బ్రిటిష్ కాలం నాటి అటవీభూములు వెనక్కి తీసుకుందాం: కర్నాటక
x

బ్రిటిష్ కాలం నాటి అటవీభూములు వెనక్కి తీసుకుందాం: కర్నాటక

బ్రిటిష్ హయాంలో వివిధ కంపెనీలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.


బ్రిటిష్ కాలంలో వివిధ ప్లాంటేషన్ కంపెనీలకు ఇచ్చిన 7,500 ఎకరాల అటవీ భూములను వెనక్కి తీసుకోవాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో ప్రస్తుతం కాఫీ, టీ, రబ్బర్ కంపెనీలు పంటలు సాగు చేస్తున్నాయి. అలాగే వీటి నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు సైతం వసూలు చేసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు బెంగళూర్ సర్కిల్ లో వినిపిస్తున్నమాట.

వీటి విలువ రూ. 2 వేల కోట్లుగా ఉంటుందని అంచనాలున్నాయి. ఈ భూములన్నీ కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కువగా కొడగు, చిక్క మగళూర్, చామరాజనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా అటవీ భూములు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయని, తగిన పరిహారం లేకుండా అటవీ వనరులను పలు కంపెనీలు దోచుకుంటున్నాయని ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు చెప్పారు.

"అటవీ భూముల్లో పలు కంపెనీలు కాఫీ, తేయాకు, రబ్బర్ వంటి పంటలు సాగు చేస్తున్నాయి. అయితే వీటి కార్యకలాపాల వల్ల పలు వన్యప్రాణుల జీవన విధానాలకు ఆటంకం కలుగుతోంది. సాధారణంగా ఇవన్నీ కూడా ఎలిఫెంట్ కారిడార్ గా చెప్పవచ్చు. ఎన్నో దశాబ్దాలుగా ఏనుగులు కేరళ, కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర ప్రాంతాలలో స్వేచ్చగా సంచరిస్తున్నాయి ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి, వన్యప్రాణుల హక్కులను కాపాడాటానికి న్యాయపరంగా పోరాడతాం" అని ఆయన ఫెడరల్ తో అన్నారు.

ప్రభుత్వ అంతర్గత అధ్యయనం

ఈ సమస్యపై అంతర్గత అధ్యయనం చేసి దీని వెనకగల చారిత్రక సంబంధాలను కూడా ప్రభుత్వం బయటకు వెల్లడించింది. బ్రిటిష్ కాలంలో వివిధ కంపెనీలు, వ్యక్తులకు 99 సంవత్సరాలకు అటవీ భూములను లీజుకు ఇచ్చారు. వీటిపై కేవలం నామమాత్రపు ఫీజులు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఇవీ తమ ఆర్థిక బాధ్యతలను విస్మరించాయి. బకాయిలను వసూలు చేసేందుకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీపీ రవి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కంపెనీల మొత్తం బకాయిలను వసూలు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. అలాగే డీఫాల్డ్ అయిన కంపెనీలపై న్యాయపోరాటం చేసేందుకు లీగల్ సెల్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఖండ్రే చెప్పారు. 1997లో భూమి ఆదాయం హెక్టార్ కు రూ. 2000 నుంచి 5 వేలకు పెరిగింది. అయితే దీనిపై కంపెనీలు న్యాయపోరాటం చేశాయి. ఇప్పుడు రెన్యూవల్ చేయాలంటే పాత బకాయిలు మొత్తం కట్టాలని మెలిక పెట్టింది.

ఎంతెంత కట్టాలంటే

ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వివరాల ప్రకారం విరాజ్ పేటలోని మెర్కారా రబ్బర్ లిమిటేడ్ రూ. 454 కోట్లు, థాంప్సన్ రబ్బర్ ఇండియా లిమిటేడ్ రూ. 91. 29, నీలగిరి ప్లాంటేషన్ రూ. 130. 22 కోట్లు, పోర్ట్ ల్యాండ్ రబ్బర్ ఎస్టేట్ రూ. 536 .66 కోట్లు ఇవన్నీ కూడా 2022 వరకూ బాకీ ఉన్న మొత్తాలు.

అలాగే పలు కంపెనీలు బ్యాంకుల్లో రుణాలు పొంది వాటిని ఎగవేసినందున బ్యాంకులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు కొన్ని నివేదికలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి. రాష్ట్ర జీవవైవిధ్య కాపాడేందుకు కూడా న్యాయపోరాటాలు చేస్తూనే ప్రజలకు అవగాహన కల్పిస్తామని, పర్యావరణ పరిరక్షణకు, కార్పొరేట్ బాధ్యతలకు ఈ చర్యలు దోహాదం చేస్తామని మంత్రి ఖండ్రే అన్నారు.

Read More
Next Story