
టీవీకే చీఫ్ విజయ్‌కి ఫత్వా జారీ..
‘‘విజయ్‌కి మద్దతు ఇవ్వొద్దు.. ఏ కార్యక్రమాలకు ఆహ్వానించొద్దు..ఆయన ముస్లిం వ్యతిరేకి..’’- మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ
తమిళనాట (Tamil Nadu) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 2026లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రత్యర్థుల ఓటమికి కలిసి పోరాడేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకే -బీజేపీ ఒకవైపు, డీఎంకే - కాంగ్రెస్ మరోవైపు జతకట్టాయి. కాని ఇటీవల అవిర్భవించిన తమిళగ వెట్రి కజగం (TVK) ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. వాస్తవానికి ఈ పార్టీ చీఫ్ తమిళ ప్రముఖ నటుడు విజయ్. భారీ స్థాయిలో అభిమాన జనం ఉన్న ఈయనతో ఇతర పార్టీలకు మింగుడ పడడం లేదు. విజయ్ వస్తే తమ ప్రభావం మసకబారుతుందున్న ఆలోచనలో ఉన్న కొన్ని పార్టీలు ఆయనకు రాజకీయంగా అడ్డంకులు సృషిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఫత్వా జారీ చేసిందెవరు?
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ మతాధికారి ఒకరు తమిళ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌పై ఫత్వా జారీ చేయడం తమిళనాట చర్చకు దారితీసింది. తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్‌ను దూరంగా ఉండాలని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా(Maulana) ముఫ్తీ షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఫత్వాను జారీ చేశారు.
ఒక వీడియో ప్రకటనలో..“తమిళనాడులోని ముస్లింలు విజయ్‌ను నమ్మవద్దు. మీ కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించొద్దు.. మద్దతు కూడా ఇవ్వొద్దు. ఎందుకంటే ఆయన ముస్లిం వ్యతిరేకి.” అని మౌలానా పేర్కొన్నారు.
ఫత్వా జారీకి కారణలేంటి?
ఫత్వా జారీ(Fatwa) చేయడానికి మతాధికారి రెండు కారణాలను ఉదహరించారు. విజయ్ నటించిన 2022 యాక్షన్ చిత్రం ‘బీస్ట్’లో ముస్లిం పాత్రలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం. ఈ కారణంగానే సినిమా విడుదల సమయంలో తమిళనాడులోని ముస్లిం సంస్థల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండోది.. మార్చిలో విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుపై కూడా విమర్శలొచ్చాయి. జూదం, మద్యం అలవాటున్న వారిని ఆహ్వానించడం ఇస్లామిక్ ఆచారాలను అగౌరవపరచడమేనని తమిళనాడు సున్నత్ జమాత్ విమర్శించింది.
పొలిటికల్ గేమ్..
2026 తమిళనాడు అసెంబ్లీ (Assembly polls) ఎన్నికలకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు కీలకం. వక్ఫ్(Wakf) సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు కూడా. బీస్ట్ చిత్రం చుట్టూ వివాదం ఉన్నా..దాదాపు మూడేళ్ల తరువాత ఫత్వా జారీ చేయడమే ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాగా
విజయ్ మద్దతుదారులు ఈ ఫత్వాను రాజకీయ కోణంలో చూస్తున్నారు. ముస్లింలను దూరం చేయాలన్న ఆలోచనతో బీజేపీ(BJP) డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే(AIADMK) ఈ పని చేయించాయని తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు విఎంఎస్ ముస్తఫా ఆరోపించారు.
"మౌలానా షహబుద్దీన్‌ను ముస్లిం సమాజం అంగీకరించదు. ఆయన బీజేపీ మద్దతుతో రాజకీయ నాటకం ఆడుతున్నాడు" అని ముస్తఫా పేర్కొన్నారు. "వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన విజయ్‌పై తమిళనాడు అంతటా ముస్లింలు ప్రేమను చూపిస్తున్నారు." అని ముస్తఫా అన్నారు.
తమిళనాడులోని ఉత్తర, దక్షిణ, తీర ప్రాంతాల్లో మైనారిటీ ఓట్లు కీలకం. కూటమి పార్టీల ఓటు బ్యాంకులను టీవీకే దెబ్బతీసే అవకాశం ఉందన్నది రాజకీయ పరిశీలకుల మాట.