
తమిళనాడులో ప్రధాని మోదీ..
రూ.4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపనలు, కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేశారు. విమానాశ్రయం, రహదారులు, రైల్వేలు, విద్యుత్తు, ఓడరేవు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా..17,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్ భవనానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తేనరసు, చెన్నైలోని ప్రఖ్యాత వల్లువర్ కొట్టం ప్రతిరూపాన్ని ప్రధానికి జ్ఞాపికగా అందజేశారు. సాంఘిక సంక్షేమ మంత్రి పి. గీతా జీవన్, లోక్‌సభ ఎంపీ కనిమొళి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బృహదీశ్వర ఆలయంలో పూజలు..
ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడు రాష్ట్రం గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయంలో పూజలు చేశారు. చోళ రాజు రాజేంద్ర చోళ-I జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ‘ఆది తిరువతిరై’ ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు.
సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న ప్రధానికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వయంగా హారతి ఇచ్చి స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనతరం చోళ రాజు చరిత్ర, వాస్తుశిల్పంపై భారత పురావస్తు సర్వే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జూలై 23న ప్రారంభమైన ఈ ఉత్సవాలు జూలై 27తో ముగుస్తాయి.