దక్షిణ కోస్తా పై ‘మురసు’ తీవ్ర ప్రభావం
x

దక్షిణ కోస్తా పై ‘మురసు’ తీవ్ర ప్రభావం

కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, సాయంత్రానికి బలహీనపడే అవకాశం


Click the Play button to hear this message in audio format

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. మంగళవారం తెల్లవారుజామున తీరం దాటిన ఈ తుఫాన్ ధాటికి వేలాది చెట్లు నేలకూలాయి. వందలాది విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే మంగళవారం మధ్యాహ్నానికి తుఫాన్ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మురసు తుఫాన్ మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య నెల్లూరు, నరసాపురం మధ్య, ఒంగోలుకు సమీపంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అప్పుడప్పుడు గాలుల వేగం 120 కిలోమీటర్లకు చేరుకుంది.
ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులతో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతినగా, పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. జాతీయ రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గత 14 ఏళ్లలో ఇదే భయంకరమైనది..

తుఫాన్ నేపథ్యంలో అధికారులు ముందుగానే సహాయక చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం ప్రాంతంలో సుమారు 400 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో సహకరించాయి. అయితే తుఫాన్ కారణంగా తమ జీవనాధారమైన పడవలు దెబ్బతిన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తుఫాన్ కారణంగా ఇల్లు కోల్పోయిన మరో మహిళకు ఈసారి ముందుగానే సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయినప్పటికీ ఆమెకు చెందిన మూడు పడవల్లో ఒకటి ధ్వంసమైంది.
‘‘గత 14 ఏళ్లలో మేము చూసిన అత్యంత ప్రమాదకరమైన తుఫాన్ ఇది. ప్రభుత్వం చాలా సహయకారిగా వ్యవహరించి, మా గ్రామం నుంచి సుమారు 400 కుటంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయపడ్డాయి’’ అని ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన మత్స్యకారుడు కృష్ణమ్మ మీడియాతో అన్నారు. కానీ పడవల పరిస్థితి ఏమిటో ఇంకా తెలియదని అన్నారు.
మరోవైపు తుఫాన్ క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం మధ్యాహ్నానికి తీవ్ర తుఫాన్ స్థాయి నుంచి సాధారణ తుఫాన్‌గా మారుతుందని, అర్ధరాత్రి సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.
అయితే తుఫాన్ బలహీనపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో వర్షాల ముప్పు కొనసాగనుంది. మంగళవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Read More
Next Story