కేరళలో నిపా వైరస్..
x

కేరళలో నిపా వైరస్..

బాలుడి రక్త నమూనాలను కోజికోడ్ వైరాలజీ ల్యాబ్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి పరీక్ష చేయించారు. నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది.


కేరళవాసులను నిపా వైరస్ భయపెడుతోంది. ఈ వైరస్ బారినపడి 14 ఏళ్ల బాలుడు ఆదివారం మృత్యువాతపడ్డాడు. మలప్పురం జిల్లా పాండిక్కాడ్ పంచాయతీలోని చెంబ్రాచేరికి చెందిన బాలుడు కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

‘‘బాలుడి వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స అందించారు. ఈ ఉదయం మూత్ర విసర్జన తగ్గింది. తీవ్ర గుండెపోటు రావడంతో ఉదయం 11.30 గంటలకు చనిపోయాడు’’ అని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.

బాలుడి రక్త నమూనాలను కోజికోడ్ వైరాలజీ ల్యాబ్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి పరీక్ష చేయించారు. నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది.

11 రోజుల క్రితం జ్వరం రావడంతో మొదట బాలుడిని చిన్నపిల్లల వైద్యుడికి చూయించారు. జ్వరం తగ్గకపోవడంతో సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో పెరింతల్మన్నలోని మౌలానా ఆసుపత్రికి తరలించారు. జూలై 19న కోజికోడ్‌లోని మిమ్స్‌ ఆస్పత్రికి, ఆ తర్వాత కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. దగ్గినా, తుమ్మినా వ్యాప్తి చెందే వైరస్ కావడంతో బాలుడి వెంట ఉన్న అతని స్నేహితుడు, తల్లిదండ్రులు, మామను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

బాలుడితో పరిచయం ఉన్న 60 మంది రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. ఫలితాలు రావాల్సి ఉంది. చనిపోయిన బాలుడి స్నేహితుడైన మరో బాలుడు జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం మంజేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు.

అప్రమత్తంగా ఉండాలి..

జ్వరంతో ఆసుపత్రికి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిపా వైరస్ ఒకరి నుంచి ఒకరికి దగ్గడం, తుమ్మడం ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. మాస్కులు ధరించాలని సూచించారు. రోగుల పట్ల ప్రోటోకాల్‌ అనుసరించాలని కోరారు.

నియమావళి ప్రకారం అంత్యక్రియలు..

బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలెక్టర్ చర్చించిన తర్వాతే నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

2018, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకుళం జిల్లాలో నిపా వ్యాపించింది. కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా వైరస్ యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించారు.

Read More
Next Story