
కేరళలో నిపా వైరస్ కలకలం.. మూడు జిల్లాల్లో హై అలర్ట్
కంటోన్మెంట్ జోన్లను ప్రకటించిన జిల్లా కలెక్టర్, కచ్చితంగా మాస్క్ లు ధరించాలని ఆదేశాలు
కేరళలో నిపా వైరస్ కలకలం రేగింది. పాలక్కాడ్ కు చెందిన 38 ఏళ్ల మహిళకు నిపా వైరస్ పాజిటివ్ గా తేలడంతో కేరళ మరోసారి వణికిపోయింది. మలప్పురంలో ఒక అనుమానిత కేసుతో పాటు మరో కేసు ధృవీకరించడంతో ఆరోగ్య శాఖ అధికారులు పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ లో హై అలర్ట్ జారీ చేశారు.
వైరస్ సోకిన రోగి ప్రస్తుతం మలప్పురం జిల్లాలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి. మరో అనుమానిత రోగి నుంచి శాంపిల్ సేకరించి పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ( ఎన్ఐవీ) కి పంపారు.
మల్పప్పురం లో ఒకరు..
మలప్పురం జిల్లాలోని చెట్టియారంగడిలో నిపా వైరస్ సోకినట్లు అనుమానం ఉన్న18 ఏళ్ల బాలిక మరణించిందని ఆరోగ్య అధికారులు తెలిపారు. కోజికోడ్ ఆరోగ్య అధికారుల ప్రకారం.. జిల్లాలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోగికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ పాజిటివ్ గా తేలిందని తెలిపింది.
రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. నిపా కాంటాక్ట్ అనుమానితుల జాబితాలో 345 మంది ఉన్నారని చెప్పారు. ఇందులో మలప్పురంలో 211 మంది, పాలక్కాడ్ లో 91 మంది, కోజికోడ్ లో 43 మంది ఉన్నారని వివరించారు.
‘‘పాలక్కాడ్ లో రోగి ఎవరెవరిని కలిశాడో ఓ మ్యాప్ తయారు చేశాము. అధికారిక నిర్థారణకు ముందే ప్రోటోకాల్ ప్రకారం నివారణ చర్యలు తీసుకుంటున్నాం. రెండు నిపా కేసులకు సంబంధించి కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాలో హెచ్చరికలు జారీ చేశారు’’ అని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పాలక్కాడ్ లో నిపా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ప్రజలంతా భయపడిపోతున్నారు.
58 మంది గుర్తింపు..
నిపా వైరస్ సోకిన వ్యక్తి తో వ్యక్తిగతంగా కలిసిన 58 మందిని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాధి సోకిన వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో వార్డులను జిల్లా కలెక్టర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
థాచనకట్టుకర గ్రామ పంచాయతీలో 7 ( కుందూరు కన్ను), 8 పలోడ్, 9 పరమ్మల్, 11 చంపరంబు, వార్డులు చేర్చబడ్డాయి. కరింపుజ గ్రామ పంచాయతీలో 17 అట్టష్షేరీ, 18 చోళక్కురిస్సి వార్డును కూడా కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. బహిరంగ సభలను కచ్చితంగా నిషేధించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రాంతాల్లో కేవలం మెడికల్ స్టోర్స్ మినహ, దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు తెరిచి ఉంటాయి.
‘‘ట్యూషన్ సెంటర్లు, అంగన్ వాడీలు, మదర్సాలు, ఇతర విద్యా సంస్థలు మూసివేయాలి. అయితే ఆన్ లైన్ తరగతులు అనుమతి ఉంది. కంటైన్ మెంట్ జోన్ లలోకి బయటి వ్యక్తుల ప్రవేశం కచ్చితంగా నియంత్రించబడింది.
వివాహాలు, అంత్యక్రియలు వంటి ఏవైనా వేడుకల గురించి కుటుంబాలు స్థానిక స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ఆరోగ్య అధికారులకు తెలియజేయాలి’’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
కంటోన్మెంట్ జోన్లలో లక్షణాలు ఉన్నవారు, డయాలసిస్, క్యాన్సర్ చికిత్స అవసరమైనవారు లేదా ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు ఆసుపత్రులకు వెళ్లడానికి అనుమతి ఉంది.
ఈ జోన్లలోకి ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా భద్రతా ప్రోటోకాల్ లను కచ్చితంగా పాటిస్తునే, అక్కడ నివసించే వారు ఎల్లప్పుడూ ఎన్95 మాస్క్ లను ఉపయోగించాలి.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఫేస్ మాస్కులు ధరించాలని చేతులను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రజలు ఎక్కడా గుంపుగా ఉండరాదని, అవసరమైతే తప్ప ఆసుపత్రుల సందర్శనలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రాష్ట్ర, జిల్లా స్థాయి హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేశారు. వైరస్ బారిన పడిన వ్యక్తులను గుర్తించడంలో పోలీసులను సహయం చేయమని కోరారు. నివాసితులకు సమాచారం అందించడానికి మూడు జిల్లాల్లోనూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
నిపా వ్యాప్తికి ముందస్తు సూచికగా ఇటీవల వారాల్లో ప్రభావిత ప్రాంతాల్లో ఏవైన అసహజ లేదా వివరించలేని మరణాలు సంభవించాయా అని ధృవీకరించాని మంత్రి వీణా జార్జ్ అధికారుకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story