ఐఏఎస్, ఐపీఎస్ లను నమ్ముకున్న ఏ పార్టీ గట్టెక్కలేదు, ఎందుకనీ?
బహుజనవాదం పునాదులపై పుట్టిన బీఎస్పీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆయన కాడిపడేశారు, ఎందుకు? ఐఏఎస్, ఐపీఎస్ లకు రాజకీయ పార్టీలను నడపం రాకనా? మరేదైనా కారణమా?
విశ్లేషణ
ప్రవీణ్ కుమార్ ఐపీఎస్.. నాలుగో సింహంగా పేరుగాంచిన పోలీస్. ఆయన రాజకీయ జీవితంలో- దళితులు, దళితోద్దరణ, బహుజన వాదమనే- ఓ అంకం ముగిసింది. నూతన శకానికి తెర లేపారు. ఎవర్నైతే దొర, దొరబిడ్డ, గడి, గడిపాలనని దుమ్మెత్తి పోశారో అదే పార్టీ- బీఆర్ఎస్-లో చేరి ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ని నమ్మి, బీఆర్ఎస్ లో చేరుతున్నానని సగర్వంగా చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినా తిరస్కరించి బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రవీణ్ కుమార్ చెప్పారు. డబ్బు, పదవికి అమ్ముడుపోయే వ్యక్తి ప్రవీణ్ కాదన్నారు. బహుజన వాదం కోసం పని చేసే వ్యక్తినేనన్నారు.
బహుజనవాదం పునాదులపై పుట్టిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి.. తెలంగాణ శాఖ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి పార్టీని నడిపే స్వేచ్ఛను ఇస్తే ఆ పార్టీని కాదని బీఆర్ఎస్ లో చేరిన ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు బీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణ నాయకునిగా చేరిపోయారు. చిన్న బావిలో పెద్ద కప్పగా ఉండడానికి బదులు పెద్ద బావిలో చిన్న కప్పగా ఉండడానికే ఆయన ఇష్టపడ్డారని- నిన్నటి వరకు ఆయన అనుచరునిగా ఉన్న ఓ సీనియర్ జర్నలిస్టు చమత్కరించారు.
ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ లు వచ్చినా...
నిజానికి ఈ దేశం కొన్ని వందల మంది ఐపీఎస్, ఐఏఎస్ లను చూసింది. అందులో ఎంతో మంది బలహీనవర్గాల నుంచి వచ్చి ఉంటారు. తమ వర్గాల కోసం ఎంతమంది పాటుపడ్డారో తెలియదు గాని ప్రవీణ్ కుమార్ మాత్రం అందులో ముందువరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. ఎన్నో ప్రభుత్వాలు చేయలేని పనుల్ని ఆయన చేశారు. చదువులోనే కాదు చాలా వాటిలో ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల్ని ప్రమోట్ చేశారు. పిల్లలే దేశానికి భవిష్యత్తు. దేశం మారాలంటే మార్చాల్సింది పిల్లల్నే అని బలంగా నమ్మిన ప్రవీణ్ కుమార్ అందుకనుగుణంగా చాలా కార్యక్రమాలు చేపట్టారు. అనేకమంది బాలబాలికల్ని తీర్చిదిద్దారు. అంతవరకే పరిమితమైతే ఆయన్ను ఎవ్వరూ తప్పుపట్టరు. తనకున్న పలుకుబడితో మరేదైనా పెద్ద స్వచ్ఛంద సంస్థను పెట్టి భావిభారత పౌరులను తీర్చిదిద్దినా మరవ్వరూ ఆక్షేపించరు.
బీఎస్సీ సిద్ధాంతానికి ప్రవీణ్ అనుకూలమేనా..
భారతీయ రాజకీయ చిత్రపటంపై యువరాజ్యంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రజల్ని ప్రత్యేకించి బడుగు బలహీనవర్గాలను ఉద్దరించాలనే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు- స్పష్టమైన బ్రాహ్మణ, బనియా, బద్రలోక్ వ్యతిరేక నినాదంతో మొదలైన బహుజన సమాజ్ పార్టీ- అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 60 సీట్ల వరకు పోటీ చేసి తాను సైతం సిరిసిల్లలో ఓడిపోయి ఆ వెంటనే- దొరలు, గడీలు అంటూ ఎద్దేవా చేసిన పార్టీలో చేరడమే విమర్శలకు తావిచ్చింది.
కాన్షీరాం చెప్పిందేమిటీ, జరిగిందేమిటీ?
ఎన్నికలకు ముందు ఏ పార్టీతో అవగాహన లేకుండా అధికారం చేజిక్కు కోవాల్సి వస్తే కలిసి వచ్చే ఎటువంటి శక్తిని (దళిత వ్యతిరేక) అయినా కలుపు కోవడం ద్వారా అధికారాన్ని చేజిక్కిచ్చు కోవడం కాన్షీరాం ఆలోచన. ఆ పార్టీ ప్రధాన వ్యతిరేక శక్తి కాంగ్రెస్. ఇది నలభై ఐదేళ్ళ కింద కాన్షీరాం అవగాహన. ఆనాడు బీజేపీ ఓ చిన్నపార్టీ.
ఒక పంజాబీ సిక్కు చమార్ దిగువ మధ్యతరగతి ఉద్యోగి కేవలం చిన్నా చితక కొలువు చేసుకునే బడుగుజీవులనే నమ్ముకుని, కారంచేడులో కామాంధుల కండకావరంతో ముంచిన నెత్తుటి మడుగులో తడిసిన కాలం లోనే బహుజన సమాజ్ పార్టీ తన ప్రస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టింది. స్వయాన కాన్షీరాం అనేక ప్రయోగాలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు పార్టీ వేళ్లూనలేదు. కత్తిపద్మారావు మొదలు యనమల రామకృష్ణుడు వియ్యంకుడు వరకు అనేక మంది ఈ పార్టీకి నాయకత్వం వహించినా ఎటువంటి పురోగతి లేకపోయింది. ఈ దశలో రాష్ట్రం విడిపోయింది. తాను ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటానని చెప్పే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండున్నర సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలో 50 వేల కిలోమీటర్ల వరకు యాత్ర చేసి, బహుజనులను చైతన్యపరిచానని చెప్పుకుంటారు. అటువంటి ప్రవీణ్ కుమార్ దళితులకు ద్రోహం చేశారా అని కొన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం బీఎస్పీ చుక్కాని లేని నావలా తయారైంది.
ఐఎఎస్, ఐపీఎస్ ల నాయకత్వం పనికి రాదా!
బీఎస్సీకే కాదు ఏ రాజకీయ పార్టీకి కూడా ఐఎఎస్ లు, ఐపీఎస్ లు నాయకత్వం వహించి తుదికంటా నడిపిన దాఖలాలు ఈ దేశంలో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో లేవనే చెప్పాలి. జమ్మూ కాశ్మీర్ మొదలు ఈర్ఖండ్ వరకు ఎందరెందరో పార్టీలు పెట్టినా ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. బహుశా అందుకు మినహాయింపు ఆమ్ ఆద్మీ పార్టీ కావొచ్చు. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఐఎఫ్ఎస్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ పార్టీలలో చేరిన ఒకరిద్దరు మాత్రం ముఖ్యమంత్రులు కాగలిగారు. వారిలో కాంగ్రెస్ లో చేరిన అజిత్ జోగి ఒకరు. రాజకీయాల్లోకి వచ్చిన ఎక్కువ మంది పదవులు ఆశించి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి వచ్చిన వారో లేకో యావత్ సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ చేసి జీవితపు శరమాంకంలో ప్రజాసేవకు వచ్చిన వారే.
ఇక, తెలుగురాష్ట్రాలకు వస్తే.. అప్పుడెప్పుడో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అనే ఐఎఎస్ అధికారి లోక్ సత్తా పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. అదే కోవలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తూ నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన జేడీ లక్ష్మీనారాయణ సొంతపార్టీ పెట్టి ఆపసోపాలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మరో ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ దళిత ఉద్దరణ పేరిట కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు.
సివిల్ సర్వెంట్లతో చిక్కేమిటంటే...
“రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లవలసి ఉంటుంది కాబట్టి సాధారణంగా ప్రజలతో చాలా మర్యాదగా, మట్టసంగా ఉంటుంటారు. డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. సివిల్ సర్వెంట్లు అధికారంలో ఉన్నంత కాలం రూల్ బుక్ కు లోబడి అహంకారులుగానో మితిమీరిన అహంభావంతోనో ఉంటారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేవాళ్ల సంఖ్య తక్కువే. సివిల్ సర్వెంట్లకు సంబంధించి వినయం దాదాపుగా తెలియని ధర్మం. రాజకీయాల్లో సివిల్ సర్వెంట్లకు తక్కువ ఆదరణ రావడానికి అదే కారణం” అంటారు మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ డి.రుషీ. అది నిజమేనేమో అనిపిస్తుంది.
నాయకుల పుణ్యాన మంత్రులయ్యారే తప్ప...
ప్రధానమంత్రిగా పని చేసిన మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్లు పార్టీ పెట్టడానికి బదులు మరొకరు పెట్టిన పార్టీలో చేరి సక్సెస్ అయ్యారు. ఇలా అనేక మంది విజయవంతమైన సివిల్-సర్వెంట్లున్నారు. కాంగ్రెస్ లో మణిశంకర్ అయ్యర్, బీజేపీలో యశ్వంత్ సిన్హాలాంటి వాళ్లు చేరినా సక్సెస్ సాధించలేకపోయారు. మొరార్జీ దేశాయ్, అరవింద్ కేజ్రీవాల్ తప్ప సివిల్ సర్వెంట్లు రాజకీయ నాయకులు కాలేకపోయారు. ప్రభుత్వోద్యోగులు పని చేసి వేర్వేరు పార్టీలలో చేరిన అనేకులు ఆ పార్టీ నాయకుల పుణ్యాన మంత్రులయ్యారే తప్ప వారి సొంత ప్రతిభ కాదు.
సివిల్ సర్వెంట్లు ఎందుకు ఫెయిలవుతారంటే...
తుషార్ శర్మ, అవదేష్ సింగ్ లాంటి మేధావులు చెప్పే దాని ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగాలు చేసిన వాళ్లు రాజకీయాల్లో సక్సెస్ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
సివిల్ సర్వెంట్లు చాలా ఆలస్యంగా రాజకీయాల్లోకి వస్తారు. ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాతే రాజకీయపార్టీల దరి చేరతారు. ఇతర రాజకీయ నాయకులు పార్టీలలోనే పుట్టిపెరుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకుంటారు. సివిల్ సర్వెంట్లు తమ సీనియారిటీ , ర్యాంక్ లు, జీతభత్యాల గురించి అవగాహన ఉంటుందే గాని రాజకీయానుభవం తక్కువ. రాజకీయాల్లో అంత సీనియారిటీ ఉండదు. యువకుల కింద పని చేయడానికి ఇష్టపడరు. తమ ఉద్యోగంలో మూడు దశాబ్దాలకు పైగా రూల్స్ కే పరిమితమై అధికార దర్పాన్ని అలవాటు చేసుకుంటారు. వాళ్లు చెప్పడానికి అలవాటు పడి ఉంటారు తప్ప ఇతర నాయకుల వలే వినడానికి ఇష్టపడరు. జనంతో కలిసి మెలిసి తిరగలేరు. సివిల్ సర్వెంట్లకు తాము మంత్రులుగా ఏమి చేయగలరో తెలుసు గాని ఓట్లు సాధించలేరు. దానికి మంచి ఉదాహరణ డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రజాసమస్యల్ని పట్టించుకునే క్రమంలో వీళ్లు తమ కింద పని చేసిన జిల్లా అధికారులతో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. పెద్దపెద్ద స్థాయిల్లో పని చేసిన వీరికి అపరిమిత అధికారాలు అనుభవించి ఉండడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. పని గంటలకు అలవాటు పడ్డ వీళ్లు ప్రజాసేవను కూడా అలాగే చేయాలనుకోవడం కూడా పెద్ద సమస్యే.
ఏమైనా, బీఎస్పీ లాంటి పార్టీకి ప్రవీణ్ నాయకత్వం కలిసిరాలేదు. ప్రభుత్వ అధికారులను నమ్మి బీఎస్సీ నట్టేట మునిగిన అనుభవాలు అనేకం ఉన్నా మాయావతి తెలంగాణలో చేసిన ప్రయోగం కూడా వికటించింది. ప్రవీణ్ కుమార్ ప్రతిభకు, సామార్థ్యానికి మచ్చ తెచ్చింది.