ముడా కుంభకోణం పిటిషనర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్..
ముడా భూ కుంభకోణం ఫిర్యాదుదారుడు స్నేహమయి కృష్ణకు మైసూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) భూ కుంభకోణంలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ చెక్ బౌన్స్ కేసులో హాజరుకాకపోవడంతో మైసూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ముడా భూ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రిని సిద్ధరామయ్యను విచారించాలని ఫిర్యాదుచేసిన ముగ్గురు వ్యక్తులలో కృష్ణ ఒకరు. కర్ణాటకలో సమాచార హక్కు కార్యకర్త అయిన ఇతను చెక్ బౌన్స్ కేసుతో పాటు, ఆస్తి తగాదా విషయంలో ఒక మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్తి తగాదా విషయంలో కృష్ణ తన మామ, అత్త, బావతో కలిసి వేధిస్తున్నారని ఈ ఏడాది ఆగస్టు 21న బాధితురాలు నంజన్‌గూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా..అదే రోజు కృష్ణపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు శనివారం (సెప్టెంబర్ 28) వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఆరోపణలను కృష్ణ ఖండించారు.
ఇదిలా ఉండగా.. కృష్ణ పిటిషన్ ఆధారంగా ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు సిఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కేసును విచారిస్తున్న అధికారుల బృందం మంగళవారం మైసూరులోని సిద్ధరామయ్య భార్యకు చెందిన 14 స్థలాలను సర్వే చేశారు. రెండు రోజుల ముందు ముడా తనకు కేటాయించిన 14 స్థలాలను తిరిగి ఇచ్చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి సోమవారం (సెప్టెంబర్ 30) ముడా కమిషనర్‌కు లేఖ రాయడం.. దానిని బీజేపీ తప్పుబట్టడం తెలిసిందే. స్థలాలు వెనక్కు ఇవ్వడం అంటే తప్పును అంగీకరించినట్టేనని కాషాయ నేతలు పేర్కొన్నారు.