
'త్రిమూర్తుల' చిలకలూరిపేట సభకి సెంటిమెంటు భయమా!
చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద విపక్ష కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. పదేళ్ల తర్వాత మోదీ, పవన్, చంద్రబాబు ఈవేళ ఒకే వేదికపైకి రానున్నారు.
చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద విపక్ష కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి రానున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు పార్టీలు ఏకమయ్యాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట. ప్రజాగళం పేరిట నిర్వహించనున్న ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారు. చిలకలూరిపేట సమీపంలోని బోపూడిలో జరిగే సభకు భారీ ఏర్పాట్లు చేశారు.
భారీగా జనం తరలింపు...
కూటమి తరపున మొదటి సభ కావడంతో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మోదీ, బాబు, పవన్ ఒకే వేదికపైకి రానుండటంతో అసాధారణ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభా ప్రాంగణంలో 20 పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లు పెట్టారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. సభా ప్రాంగణం సమీపంలో ఆరు హెలీ ప్యాడ్‌లను సిద్ధం చేశారు. సభా వేదిక చుట్టూ ఇనుపగ్రిల్స్‌తో బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
వేదికపై 30 మందికే చోటు
60 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు ఉండేలా సభా వేదిక నిర్మాణం చేపట్టారు. వేదికపై మూడు పార్టీకలు చెందిన 30 మందిని మాత్రమే అనుమతించనున్నారు. వేదికపై ఎవరు ఎవరుండాలనే దానిపై ఇప్పటికే లిస్ట్ రెడీ చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్‌తో పాటు మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు కొందరు వేదిక పంచుకోనున్నారు.
ట్రాఫిక్ కష్టాలు తప్పవు..
ప్రజాగళం సభా ప్రాంగణం టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. సభా ప్రాంగణం చుట్టుపక్కల పండగ వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి రానున్న పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది జనం రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ మీదగా విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు-దిగమర్రు జాతీయ రహదారి 214-ఏ పైకి మళ్లించి ఒంగోలు, త్రోవగుంట, చీరాల, పెనుమూడి, రేపల్లె, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం హైవేకి కలపనున్నారు.
మరి సెంటిమెంటు మాటేమిటీ...
రాజకీయాల్లో సెంటిమెంట్లు పాటించడం చాలా సహజం. వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి తన లిస్టు ప్రకటించేముందు ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి తనకిష్టమైన వ్యక్తులతో లిస్టులను విడుదల చేయిస్తారు. నిన్న కూడా అదే చేశారు. నందిగం సురేష్, ధర్మాన ప్రసాదరావుతో కలిసి అభ్యర్థులను ప్రకటించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కులదైవమైన వెంకటేశ్వర స్వామికి మొక్కి లిస్ట్ విడుదల చేస్తుంటారు. అయితే ఇప్పుడు జరగబోతున్న చిలకలూరిపేట వద్ద తొలి బహిరంగసభలు పెట్టుకున్న వాళ్లు ఎక్కిరాలేదని పేరు రాయడానికి ఇష్టపడని ఓ రాజకీయ కురువృద్ధుడు అన్నారు. ఇది కేవలం మూఢనమ్మకమేనని కొట్టిపారేసిన వారూ లేకపోలేదు. చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఈ సెంటిమెంట్ ను కొట్టిపారేశారు. 2014లో టీడీపీ తొలిబహిరంగ సభ ఇక్కడే పెట్టి విజయం సాధించామని చెప్పారు. ఓవైపు పవిత్రమైన కోటప్పకొండ మరోవైపు చరిత్రాత్మకమైన కొండవీటి కొండ అన్నింటికి మించి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు త్యాగం చేసిన పల్నాడు జిల్లా ఇదంటున్నారు ప్రత్తిపాటి పుల్లారావు. సెంటిమెంట్లు పుకార్లు మాత్రమేనన్నారు.