
డీఎంకే ‘‘మాదకద్రవ్య రహిత రాష్ట్రం’’పై ప్రతిపక్షాల విసుర్లు..
గంజాయి విరివిగా పట్టుబడుతుండడంపై స్టాలిన్ ప్రభుత్వంపై ధ్వజం
తమిళనాట(Tamil Nadu) పలుప్రాంతాల్లో తరుచుగా గంజాయి(Ganja) పట్టుబడుతుండడంపై రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. "మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం" డీఎంకే(DMK) ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ గతంలో చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే గంజాయి ముఠాలు పదేపదే పట్టుబడుతుండడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల నుంచి..
మే 2021 నుంచి మార్చి 2025 మధ్యకాలంలో పోలీసులు 1 లక్ష కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా గంజాయి ముఠాలను పట్టుకున్నారు. సముద్ర మార్గం గుండా శ్రీలంక నుంచి కూడా గంజాయికి తమిళనాడుకు చేరిన ఘటనలు ఉన్నాయి. అయితే రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఉంచి, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా గంజాయి అక్రమ రవాణాను తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.
కేసులు..
2024లో గంజాయి పట్టుబడులు కొద్దిగా తగ్గాయి. 2023లో 23,364 కిలోలు పట్టుబడగా..2024లో 21,424 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. కేసులు 11,025కి పెరిగాయి.
మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంకర్ జివాల్ సహా పోలీసు అధికారులు తమిళనాడులో మాదకద్రవ్యాల వినియోగం తక్కువగా ఉందని (గంజాయి వాడకంలో 0.1 శాతం, జాతీయంగా 35వ స్థానంలో ఉంది) చెప్పారు.
2025లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠాను పట్టకున్నారు.
ఎవరేమన్నారంటే..
2021 నుంచి రాష్ట్రంలో గంజాయి విస్త్రతంగా పట్టుబడడంపై పట్టాలి మక్కల్ కట్చి(PMK) నాయకుడు అన్బుమణి రామదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తిరుత్తణి కేసును ఆయన ఉదహరించారు. గంజాయికి బానిసయిన 17 ఏళ్ల వయసు ఉన్న నలుగురు మైనర్లు వలస కార్మికుడిపై కొడవళ్లతో దాడి చేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. పుస్తకాలు పట్టుకోవాల్సిన మైనర్లు కత్తులు పట్టుకోవడం డీఎంకే వైఫల్యమేనని మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రి ఆరోపించారు.
ఏఐఏడీఎంకే(AIADMK) అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి యువత మాదకద్రవ్యాలను బానిసై పెడదోవ పట్టడం ఆందోళనకరమని పేర్కొన్నారు. డీఎంకే తమిళనాడును తాగుబోతు రాష్ట్రంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె అన్నామలై ఆరోపించారు. తమిళగా వెట్రీ కజగం పార్టీ చీఫ్ విజయ్ మాధక ద్రవ్యాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
డీఎంకే ప్రభుత్వం ఇటీవలి కాలంలో చెన్నైలో 2,300 కిలోలు, తిరువళ్లూరులో 102 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ చెప్పారు.
గంజాయి పట్టుబడ్డ ఘటనలు..
నవంబర్ 28న వెల్లూరు జిల్లాలోని గుడియాతం సమీపంలో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో పొడవైన గంజాయి మొక్కలను సాగు చేస్తుండడంతో అరెస్టు చేశారు. నవంబర్ 13న చెన్నైలోని కొడుంగైయూర్ ప్రాంతంలో గంజాయి మొక్కలను పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 19, ఆగస్టు 14 తేదీల్లో అరక్కోణం మార్తాండంలో ఇంట్లో గంజాయి మొక్కలను పెంచినందుకు ఇద్దరిని అరెస్టు చేశారు.

