పాడేరు పసుపుకు పొగ... అడుగడుగునా దగా..

అవినీతి సెగతో రంగుమారిన ఎల్లో గోల్డ్‌


పాడేరు పసుపుకు పొగ... అడుగడుగునా దగా..
x
పసుపు కొమ్ములు

అవినీతి సెగతో రంగుమారిన ఎల్లో గోల్డ్‌

రూ. 10 కోట్లు పైన తినేసిన అధికారులు
పర్చేజెస్‌లో పర్సెంటేజీలు
వచ్చిందే చాలనుకుంటున్న గిరిజనులు
(జి.పి. వెంకటేశ్వర్లు)
అల్లూరి సీతారామరాజు పార్వతీపురం జిల్లా పాడేరు ఐటీడీఏ పసుపు ప్రాజెక్టులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. అధికారులు కోట్లు కొల్లగొట్టారు. ఎవరికి వారు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
ఏమిటి ప్రాజెక్టు
పాడేరు ఐటీడీఏ పరిధిలో అక్కడి గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు ప్రాజెక్టును చేపట్టాయి. ఐదు వేల ఎకరాల్లో పసుపు పంటను గిరిజన రైతుల ద్వారా పండించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో నేతృత్వంలో రైతులకు విత్తనాలు, పరికరాలు కొనుగోలు చేసి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 84.76 కోట్లు. ఇందుకు సంబంధించిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలయ్యాయి.
ప్రాజెక్టు కాల వ్యవధి
2019–20 నుంచి 2022–23వరకు అంటే మూడేళ్లు ప్రాజెక్టు కొనసాగుతుంది. మొదటి రెండు సంవత్సరాలు అధికారులు ప్రాసెస్‌తోనే సరిపెట్టారు. ఈ ఏడాది మొదట్లో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం ఐదువేల మంది గిరిజన రైతులు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏరియాలో ప్రభుత్వ సాయంతో పసుపు పంటను సాగు చేశారు.
నిధులు ఎలా..
అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయి. మొత్తం ప్రాజెక్టు విలువ రూ. 84.76 కోట్లు. ఇందులో పసుపు విత్తనాలు కొనుగోలు, పసుపును ఉడకబెట్టేందుకు బాయిలర్స్, పాలిష్‌ చేసేందుకు పాలిషింగ్‌ యూనిట్లు ప్రభుత్వం కొనుగోలు చేసి 100 శాతం సబ్సిడీతో గిరిజన రైతులకు 2023 ఆగస్టులో అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా మంత్రులు, అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లాలో పసుపు విత్తనాలు (పసుపు కొమ్ములు) కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అరకు ప్రాంతంలో పండించే పసుపుకు వరల్డ్‌ వైడ్‌గా ఎంతో ప్రాధాన్యత ఉంది. తుర్కుమిన్‌ కంటెంట్‌ ఉన్న పసుపును పాడేరు ప్రాంతంలో పండిస్తారు. ఈ పసుపు కొమ్ములకు గిరాకీ ఎక్కువ. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు. తుర్కుమిన్‌ కంటెంట్‌ ఉన్న పసుపును సౌందర్య సాధనాలతో పాటు ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే ఐటీడీఏ అధికారులు క్వాలిటీ లేని పసుపు విత్తనాలు (కొమ్ములు)ను గుంటూరు జిల్లాలో నుంచి కొనుగోలు చేశారు.
కొనుగోలుకు నిబంధనలు ఏమిటి..
విత్తనాలు కానీ, ఇతర వస్తువులు కానీ కొనుగోలు చేయాలంటే తప్పకుండా ఈ ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ పిలవాల్సి ఉంటుంది. కానీ అధికారులు అలా కాకుండా బాక్స్‌ టెండర్లు పిలిచారు. వారికి అనుకూలమైన వారికి టెండర్లు ఖరారు చేశారు. పసుపు విత్తనాల కొనుగోలకు టెండరు దారు రూ. 4.19 కోట్లు తీసుకునే విధంగా బాక్స్‌ టెండరు వేశాడు. అధికారులు నిర్ణయించిన టెండరు వ్యాల్యూ కంటే 21.3శాతం ఎక్సెస్‌ కోట్‌ చేస్తూ బాక్స్‌ టెండరు వేసిన వ్యక్తిని ఖరారు చేశారు. అతని వద్ద నుంచి కావాల్సిన మేరకు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కుంభకోణం ఎలా బయట పడింది
ఐటీడీఏ నుంచి విత్తన సరఫరా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టర్‌ హై కోర్టును ఆశ్రయించాడు. వెంటనే బిల్లులు చెల్లించాలని 2023లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో బిత్తరపోయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ రూ. 4.19 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించారు. ఈ ప్రాజెక్టు ఏమిటి? ఎందుకు ఐటీడీఏ బిల్లులు చెల్లించలేకపోయింది? అనే వివరాలు తెలుసుకుని తమకు చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించారు. ఆయన ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రాథమిక నివేదికను అధికారులు సమర్పించారు. దీనిపై డీటెయిల్డ్‌ రిపోర్టు కావాలంటూ కార్యదర్శి రావత్‌ మరో ఆదేశం జారీ చేశారు. ఇక్కడే అవినీతి అధికారుల బండారం బయట పడింది.
అవినీతి ఏమిటి..
పసుపు ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పరిశీలించేందుకు ముగ్గురు గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులను నియమించారు. వీరు ఫీల్డ్‌కు వెళ్లి ఏ విధమైన పసుపు విత్తనాలు కొనుగోలు చేశారు. వాటి ధర అప్పట్లో ఎంత ఉంది. ఎందుకు ఈ ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలవలేదు. తుర్కుమిన్‌ పసుపు రకం అంటే ఏమిటి? దానిని ఎందుకు కొనుగోలు చేయలేదు. నాసిరకం విత్తనాన్ని ఎందుకు కొనుగోలు చేశారు. అనే వివరాలన్నీ సేకరించి ఒక రిపోర్టు తయారు చేశారు. కేవలం విత్తనాలే కాకుండా పరికరాల కొనుగోలులోనూ భారీగా పర్సెంటేజీలు తీసుకున్నారు. 2020 సెప్టెంబరులో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ వారు మినీ బాయిలర్స్‌ ఒక్కొక్కటి రూ. 29,500లకు కొనుగోలు చేశారు. అలాగే మినీ పాలిషర్స్‌ ఒక్కొక్కటి రూ. 32,500లకు కొనుగోలు చేశారు. పాడేరు ఐటీడీఏ వారు మినీ బాయిలర్‌ను రూ. 64,990లు, మినీ పాలిషర్‌ను రూ. 74,499కొనుగోలు చేశారు. 1,705 మినీ బాయిలర్లు, 840 పాలిషర్లకు రూ. 17,34,02,455లు చెల్లించారు. అంటే రూ. 9,58,04,945లు అధికారులు కంపెనీ వారికి అదనంగా చెల్లించినట్లు విచారణాధికారులు రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ విషయమై ప్రధాన విచారణాధికారిగా నియమితులైన గిరిజన సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్, ట్రైకార్‌ జనరల్‌ మేనేజర్‌ సీఏ మణికుమార్‌ను ఫెడరల్‌ ప్రతినిధి వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ విచారణ జరిపి నివేదిక గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు అందజేసినట్లు తెలిపారు.
Next Story