ఈ కంప్యూటర్‌లో ఉద్యోగుల జీతాలు

కంప్యూటర్‌ పార్కింగ్‌లో ఆగుతున్న ఏపీ ఉద్యోగుల జీతాలు


కంప్యూటర్‌ పార్కింగ్‌లో ఆగుతున్న ఏపీ ఉద్యోగుల జీతాలు

(జిపి వెంకటేశ్వర్లు)
జామ్‌ అంటే గుర్తుకు వచ్చేది ట్రాఫిక్‌ జామ్‌. మరి పార్కింగ్‌ జామ్‌ ఏమిటి? మీరు సరిగ్గానే విన్నారు. ఇది అప్పుతచ్చు గాదు. పార్కింగ్‌ అనగానే గుర్తుకు వచ్చేది వెహికిల్‌ పార్కింగ్‌. నో పార్కింగ్‌ జోన్‌. యితే ఇటీవల ఉద్యోగుల జీత భత్యాల బిల్లులు పార్కింగ్‌ జామ్‌ అవుతున్నాయి. ఇది ఒక్కింత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కంప్యూటర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిధులు లేక ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల జీతాల బిల్లులు ఆగిపోయి ఉంటున్నాయి.
గతంలో మాన్యువల్‌గా తయారు చేసిన బిల్లులకు ట్రెజరీలో పాస్‌ చేసిన తరువాత నగదును సంబంధిత అధికారి బట్వాడా చేసేవాడు. రెండో స్టెప్‌లో ఉద్యోగులకు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్‌ చేయించి ట్రెజరీ వారు పాస్‌ చేసిన బిల్లులను సంబంధిత ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లకు జమచేయడం జరిగేది. మూడో స్టెప్‌లో ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ట్రెజరీలో పాస్‌చేసిన బిల్లులను నేరుగా రిజర్వు బ్యాంకుకు పంపిస్తున్నారు. ఈ బిల్లులు ఎప్పుడు అకౌంట్‌కు జమ అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీని గురించి ఎవరిని వాకబు చేసినా పార్కింగ్‌లో ఉన్నాయంటున్నారు. సంవత్సరాల తరబడి జమచేసుకున్న జీపీఎఫ్‌ అమౌంట్స్, సరెండర్‌ లీవులు, ఇతర రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు మొదలైనవి ఈ పార్కింగ్‌ జామ్‌లో చిక్కుకుని ఎప్పుడు సంబంధిత ఉద్యోగి అకౌంట్‌కు జమవుతాయో తెలియని వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొంది.
మారుతున్న కాలాన్ని బట్టి ఉద్యోగులు తక్షణ అవసరాల కోసం బ్యాంకులపై ఆధారపడుతున్నారు. బ్యాంకుల రుణాలపై నెలవారీ ఈఎంఐలు నిర్ధేశించిన తేదీలోపు చెల్లించాలి. అయితే ఈ పరిస్థితుల వల్ల సమయంలోపు ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో డిఫాల్టర్స్‌ అవుతున్నారు. సిబిల్‌ స్కోర్‌ పడిపోవడంతో తదుపరి రుణసదుపాయం కోల్పోవడంతో పాటు అధిక వడ్డీ సైతం కట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో చెక్‌బౌన్స్‌ కేసుల వల్ల ఉద్యోగులు కోర్టులకు తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇంతవరకు ఎప్పుడూ ఉద్యోగులు ఈ వింత పరిస్థితిని ఎదుర్కోలేదు. కొత్తగా ప్రభుత్వం సృష్టించిన పార్కింగ్‌జామ్‌తో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. పెన్షనర్లు, ప్యామిలీ పెన్షనర్‌లది కూడా ఇదే పరిస్థితి.


Next Story