
తమిళనాట ప్రమాదంలో హస్తం పార్టీ మనుగడ..I
పార్టీ పరిస్థితి బాగోలేదన్న కారూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి..
తమిళనాడు(Tamil Nadu) కాంగ్రెస్(Congress) పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకత్వ వైఫల్యాల వల్ల పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని కారూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి (MP Jothimani) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. కొంతమంది పార్టీ నేతలు కేవలం పదవులకే పరిమితం కావడం వల్ల పార్టీ రాజకీయ ఉనికి కోల్పోతోందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు అన్నీ మాటలకే పరిమితమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలోని కొందరు నాయకుల స్వార్థపూరిత రాజకీయాల వల్ల కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని జోతిమణి పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి ఎంపీల వరకూ సమన్వయ లోపం ఉందన్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిన బూత్ ఏజెంట్ల జాబితాపై కూడా పార్టీలో విభేదాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆత్మపరిశీలన అవసరం..’
2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా పార్టీ దిశ మార్చుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని జోతిమణి హెచ్చరించారు. ఇప్పటికైనా నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్లే స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆమె కోరారు. ప్రజల సమస్యలపై స్పష్టమైన పోరాటం లేకుంటే పార్టీ పునరుజ్జీవనం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై, పార్టీలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
Party heading for destruction: MP Jothimani takes on TN Congress leadership

