మోదీపై పోటీ చేస్తానంటున్న ఖేడా తెలుగింటి అల్లుడే!
x
పవన్ ఖేడా, కోట నీలిమ (ఫైల్ ఫోటో)

మోదీపై పోటీ చేస్తానంటున్న ఖేడా తెలుగింటి అల్లుడే!

హైదరాబాద్ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ మధ్య నీలిమ పోటీ చేశారు, గుర్తుందా.. ఆ నీలిమకు ఈ ఖేడాకు సంబంధం ఏమిటీ? మోదీపై పోటీ ఏమిటీ?


ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్ విభాగం ఛైర్మన్ పవన్ ఖేడా మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈసారి ఆయన ఏకంగా పీఎం మోదీ ఎక్కడ పోటీ చేస్తున్నారో తాను అక్కడే పోటీ చేస్తానంటున్నారు. జాతీయ మీడియా దృష్టిలో చర్చనీయాంశమై కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీపై కత్తులు దూసి పార్టీ నుంచి బహిష్కరణకు గురై ఆ తర్వాత పశ్చాతాపంతో బహిరంగ క్షమాపణ చెప్పి అదే పార్టీలో చేరిన ఈ పంజాబీకి తెలుగు రాష్ట్రాలకి అనుబంధం ఉందని ఎంతమందికి తెలుసో గాని ఆయన మన హైదరాబాద్ అల్లుడు. ఓనాటి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కరస్పాంటెండెంట్ నీలిమ భర్త. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పవన్‌ ఖేడా తలపడతారని జాతీయ చానళ్లు ప్రచారం చేస్తున్నాయి.

ఎవరీ పవన్ ఖేడా, ఏమా కథ...


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతల మొదలు ఆయన పుట్టుపూర్వోత్తరాల వరకు.. మోదీ వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యానాలు చేసి ఇబ్బందులు పడ్డ పవన్ ఖేడా మంచి చదువరి. ఫ్రీలాన్స్ జర్నలిస్టు. నిష్కపటనే పేరుంది. కడుపులో ఏదీ దాచుకోలేరట. దూకుడుగా జవాబులు చెప్పడంలో దిట్ట. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా టీవీ ఛానళ్లలో చర్చల్లో మహా చురుగ్గా పాల్గొంటుంటారు. ప్రతి విషయంలోనూ పవన్ ఖేడా ఏదో ఒక లాజిక్ తీస్తాడు. మంచినీళ్లు తాగినంత మామూలుగా హిందీ, ఇంగ్లీషు భాషల్ని మాట్లాడతారు. ప్రతి అంశంపై పూర్తి సన్నద్ధత, స్పష్టత ఆయన సొంతం.

1968 జూలై 31న జన్మించిన పవన్ ఖేడా రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో పరిచయం తర్వాత ఆమె వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. పవన్ ఖేరా 2013లో కాంగ్రెస్ పార్టీలో చేరి మరింత రాటుదేలారు.

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై హిడెంన్ బర్గ్ నివేదిక తర్వాత ఓ చర్చలో ప్రధాని మోడీ తండ్రి పేరును తీసుకువచ్చి ఇబ్బందుల పాలయ్యారు. కొన్ని వివాదాస్పద అంశాలపై "మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసినప్పుడు నరేంద్ర గౌతమ్ దాస్ మోదీకి వచ్చిన సమస్య ఏమిటి?" అని ప్రశ్నించిన ఖేడా నోరుజారి చిక్కుల్లో పడ్డారు. అయితే ఆ తర్వాత విచారం వ్యక్తం చేసి కోర్టు కేసుల నుంచి బయటపడినా ఆ వివాదాన్ని, అప్పుడు జరిగిన దుమారాన్నైతే మర్చిపోలేం.

ఖేదా భార్య నీలిమ హైదరాబాదీ..

పంజాబీ హిందూ ఖత్రీ నేత పవన్‌ ఖేడా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఓ హైదరాబాదీని వివాహం చేసుకున్నారు. ఆయన భార్య కోట నీలిమ. ఉన్నత విద్యావంతురాలు, జర్నలిస్టు, రచయిత అయిన డాక్టర్‌ నీలిమ ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన తెలుగు జర్నలిస్టు దివంగత కేవీఎస్‌ శర్మ, ఉమా శర్మ దంపతుల కుమార్తె. పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో రాజస్తాన్‌ నగరం జైపూర్‌ లో జన్మించిన ఖేడా 1980ల చివర్లో యువజన కాంగ్రెస్‌ నేత. 1991లో పీవీ నరసింహారావు హయాంలో 1991లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైదొలిగిన ఖేడా సోనియాగాంధీ నాయకత్వం చేపట్టాక 1998లో పవన్‌ ఖేడా తిరిగి కాంగ్రెస్‌ లో చేరారు. 2022లో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పై దుమ్మెత్తిపోసిన ఆయన ఏడాది పాటు కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు. ‘ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ సభ్యత్వం లభించేంతటి ‘తపస్సు’ నేను చేయలేదు. బహుశా నా ‘తపస్సు’ తగినంత లేదనే కారణంతో నాకు టికెట్‌ ఇవ్వలేదేమో’ అని 2022లో చేసిన ట్వీట్ పట్ల 2023 మార్చి నెలలో విచారం ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం తనను క్షమించాలని కోరారు. రాహుల్‌ గాంధీ లోక్‌ సభ సభ్యత్వం రద్దయిన సందర్భంలో ఢిల్లీలోని గాంధీజీ సమాధి రాజ్‌ ఘాట్‌ వద్ద కాంగ్రెస్ నిరసన తెలిపే సందర్భంలో ఆయన కాంగ్రెస్ తో గొంతుకలిపారు.


‘రాహుల్ గాంధీ త్యాగనిరతి చూసిన తర్వాత నేను నా తప్పు తెలుసుకున్నాను’ అని ఖేడా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆరేడు నెల్లకే అంటే 2023 నవంబర్ నాటికే తన పలుకుబడిని పెంచుకుని, హైదరాబాద్‌ నగరంలోని సనత్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి తన భార్య నీలిమకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించారు. ఆమెకు టికెట్ రావడంపై చాలా వివాదాలు, సెటైర్లు ఆవేళ పేలాయి. పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డితో తనకున్న పాత స్నేహాన్ని ఉపయోగించి బీఆరెస్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌- నీలిమ వంటే నాన్‌ లోకల్‌ ‘బలహీన బ్రాహ్మణ’ అభ్యర్థికి టికెట్ వచ్చేలా చేశారన్న పుకార్లు వినవచ్చాయి. సనత్ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో తలసానిపై పోటీ పడి మూడో స్థానంలో నిలిచారు కోట నీలిమ. ఆమెకు కేవలం 22,492 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మరి ఇప్పుడామె భర్త పవన్‌ ఖేడా వారణాసిలో ప్రధాని తో తలపపడతానంటున్నారు. డిపాజిట్లు అయినా వస్తాయా అని ఆయన ప్రత్యర్థులు, బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటున్నారు ఖేదా. మన తెలుగమ్మాయి నీలిమ భర్త పవన్‌ ఖేడా పార్లమెంటు ఎన్నికల్లో పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో గౌరవప్రదమైన రీతిలో ఓట్లు వేయించుకోవాలని కోరుకోవడం మినహా మనం చేయగలిగిందేమీ లేదు.

ఎవరీ కోట నీలిమ...

కోటా నీలిమ రచయిత్రి, పరిశోధకురాలు, జర్నలిస్టు, రాజకీయ వ్యాఖ్యాత, కళాకారిణి, రాజకీయవేత్త. దేశంలోని ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలపై అనేక రచనలు చేశారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నీలిమ ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో పని చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో పీహెచ్డీ చేసి ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ డిగ్రీని పొందారు. రైతు ఆత్మహత్యలపై ఆమె రాసిన నవల "షూస్ ఆఫ్ ది డెడ్" ఆధారంగా చిత్రనిర్మాత వెట్రిమారన్ ఓ సినిమా కూడా తీశారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం కారణంగా వాస్తవసాగుదార్లు అయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి భార్యలు పడే అగచాట్లు గురించి నీలిమ రాసిన నవల గుండెల్ని పిండేస్తుంది.

జర్నలిస్ట్‌గా నీలిమ "ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌"కి ప్రధాన కరస్పాండెంట్‌గా రాజకీయాలను కవర్ చేశారు. ది సండే గార్డియన్‌కి పొలిటికల్ ఎడిటర్ గా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ది హఫింగ్టన్ పోస్ట్ ఇండియా, ది క్వింట్, ది వైర్, హిందుస్థాన్ టైమ్స్‌కు ఫ్రీలాన్సర్ గా పని చేశారు. ఆమె ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ పరిశోధనా సంస్థ గ్రామీణ ఇబ్బందులను కవర్ చేస్తుంది. హైదరాబాద్‌లోని వైన్ షాపులపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి అనేక కొత్త అంశాలను ప్రభుత్వం ముందుంచారు. "తిరుపతి: ది గాడ్ ఫర్ ఎ మోడ్రన్ ఏజ్" అనే పుస్తకానికి సంపాదకత్వం వహించారు. ఆమె పెయింటర్ కూడా.

ఆల్ ది బెస్ట్ పవన్ ఖేడా...

ప్రత్యక్ష రాజకీయాలకు, ఓట్లకు మేధావులు సరిపోరన్నది స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎప్పుడూ నిరూపితమవుతూనే వస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం ఓట్ల వేటలో ఓడిపోయారు. అందువల్ల పవన్ ఖేడా ఈ ఎన్నికల్లో ఎంతమేరకు రాణిస్తారో ఊహించలేం గాని సముచిత రీతిలోనైనా పోటీ ఇవ్వాలన్నది ఆకాంక్ష.

Read More
Next Story