ప్రజ్వల్ బెంగళూరుకు వస్తున్నాడా?
పలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరుకు వస్తున్నారా? తాను విడుదల చేసిన వీడియోలో ఆయన ఏం చెప్పారు?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడి(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ మ్యూనిచ్ నుంచి బెంగుళూరుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లు సమాచారం.
ప్రజ్వల్ ఎందుకు దేశం వీడారు?
జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు అయిన హసన్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ ఈ సారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఎన్నికల వేళ ఆయన అశ్లీల వీడియోలు బయటకు రావడంతో దేశం వీడారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ దూమారం రేగింది. ఈ పార్లమెంటు ఎన్నికలో జేడీ(ఎస్) బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఈ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్)కు అప్పగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రజ్వల్‌పై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. రోజులు గడుస్తున్నా.. ఇండియాకు తిరిగి రాకపోవడంతో ఆయనపై బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. బెంగళూరుకు తిరిగి వస్తున్నాడని తెలిసి పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగి రావడానికి ప్రజ్వల్ గతంలో రెండు సార్లు టిక్కెట్లు బుక్ చేసుకుని, ఆ తర్వాత వాటిని రద్దు చేయించినట్లు సిట్ తెలిపింది.
రెండు రోజుల క్రితం ప్రజ్వల్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మే 31న సిట్ ముందు హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని అందులో చెప్పారు.